Pancha Madhava Kshetras ………….
శ్రీ మహావిష్ణువు (మాధవుడు) కొలువైన అత్యంత ప్రాచీనమైన ఐదు పుణ్యక్షేత్రాలను పంచ మాధవ క్షేత్రాలు అంటారు. పురాణాల ప్రకారం కృతయుగంలో దేవేంద్రుడు అసుర చక్రవర్తి అయిన వృత్తాసురుడిని వధించాడు. అయితే, వృత్తాసురుడు గొప్ప వేద పండితుడు (బ్రాహ్మణుడు) కావడంతో, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది.
ఆ పాపం వల్ల ఇంద్రుడి తేజస్సు తగ్గిపోయింది. దీంతో ఆ పాప పరిహారం కోసం ఇంద్రుడు మహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమై, భారత భూభాగంలోని ఐదు పవిత్ర ప్రదేశాలలో తన విగ్రహాలను ప్రతిష్టించి, తపస్సు చేయమని సూచించాడు. విష్ణువు ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు ఐదు చోట్ల మాధవ విగ్రహాలను ప్రతిష్టించాడు.
అవే బిందు మాధవ ఆలయం – వారణాసి (ఉత్తరప్రదేశ్) ఇది కాశీలోని పంచగంగ ఘాట్ వద్ద ఉంది. కాశీ యాత్ర బిందు మాధవుని దర్శనంతోనే సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం.
వేణీ మాధవ ఆలయం – ప్రయాగ/అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణీ సంగమ క్షేత్రమైన ప్రయాగలో ఈ ఆలయం ఉంది.
కుంతీ మాధవ ఆలయం – పిఠాపురం (ఆంధ్రప్రదేశ్) తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పంచ మాధవ క్షేత్రం ఇది. ద్వాపర యుగంలో కుంతీదేవి ఇక్కడ మాధవుడిని పూజించినట్లు పురాణ గాథ.
సేతు మాధవ ఆలయం – రామేశ్వరం (తమిళనాడు) రామేశ్వరంలోని ప్రధాన ఆలయ సముదాయంలోనే ఈ మాధవ స్వామి కొలువై ఉన్నాడు.
సుందర మాధవ ఆలయం – తిరువనంతపురం (కేరళ) ఇది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది.
ఈ ఐదు క్షేత్రాలలో విష్ణువును ఆరాధించిన తర్వాత ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొంది, తిరిగి ఇంద్ర పదవిని, తన తేజస్సును పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాల దర్శనం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.
ఈ పంచ మాధవ క్షేత్రాలను దర్శించడానికి పురాణాలలో ప్రత్యేకమైన కఠిన నియమ నిబంధనలు ఏవీ లేవు. వీలును బట్టి దర్శించుకోవచ్చు.అయితే హిందూ సంప్రదాయంలో ఏ పుణ్యయాత్ర అయినా ఉత్తర భారతంలోని కాశీ లేదా ప్రయాగ నుండి ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు.
కాశీ క్షేత్ర రక్షకుడిగా బిందు మాధవుడిని ముందుగా దర్శిస్తారు. త్రివేణీ సంగమ స్నానం తర్వాత వేణీ మాధవుడిని దర్శించుకోవడం పుణ్యప్రదం. తర్వాత కుంతీ మాధవుడి ని, సేతు మాధవుడి ని ,సుందర మాధవుడిని వరుసక్రమం లో దర్శించుకుంటారు.

