ఆ ఇద్దరికీ డిసెంబర్ నెల అచ్చిరాలేదా ?

Sharing is Caring...

Both of them in the same month ……………………..

అన్నాడీఎంకే అగ్ర నేతలు ఎంజీఆర్….జయలలిత లకు డిసెంబర్ నెల కలసి రాలేదు. ఇద్దరూ డిసెంబర్ నెల లోనే అభిమానులను విడిచి దూర తీరాలకు వెళ్లిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హఠాత్తుగా 1984 లో అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ బ్రూక్లిన్ టౌన్ స్టేట్‌ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చారు.

పరీక్షలు చేసిన పిదప ఎంజీఆర్‌ కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే వాటిని మార్చాలని వైద్యులు సూచించారు . దీంతో ఎంజీఆర్‌ను నవంబరు 5న అమెరికాకు తరలించి.. ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ అనంతరం ఎంజీఆర్‌ కోలుకున్నారు.

ఆయన అక్కడ చికిత్స పొందుతున్న సమయలోనే 1984 డిసెంబరు 24, 27 తేదీల్లో అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించారు.నాడు ఎంజీఆర్ అమెరికా ఆస్పత్రి లో చికిత్స పొందుతూనే ఆండిపట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన ప్రతినిధి ద్వారా నామినేషన్ పంపించారు.

ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించింది. ఇండియన్ పాలిటిక్స్ లో ఇదొక కొత్త పరిణామం. అమెరికాలో చికిత్స ముగించుకుని ఎంజీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో 1985 ఫిబ్రవరి 4న చెన్నైకు  తిరిగి వచ్చారు.

1985 ఫిబ్రవరి 10న సీఎంగా పదవీ ప్రమాణం చేసిన ఎంజీఆర్‌ 2 సంవత్సరాల 10 నెలల పాటు పాలించారు. ఈ కాలంలో ఆయన పలుమార్లు అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. 1987 డిసెంబరు 24వ తేదీ తెల్లవారుజామున 3.30 నిమిషాలకు తన నివాసంలో ఎంజీఆర్‌ కన్నుమూశారు.

అంతకు ముందు రోజు నుంచే ఎంజీఆర్ నలతగా ఉన్నారు. వ్యక్తిగత వైద్యులు  డా. సుబ్రమణియన్ చెప్పినప్పటికీ ఎంజీఆర్ హాస్పిటల్ లో జాయిన్ కాలేదు. ఏంకాదులే అనుకున్నారు .. ఆ నిర్లక్ష్యమే గుండె పోటుకి దారి తీసింది. ఇక ఎంజీఆర్ వారసురాలు, సన్నిహితురాలు జయలలిత కూడా చివరి రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేదని చెబుతారు.

జయలలిత జ్వరంతో బాధపడుతూ 2016 సెప్టెంబరు 22వ తేదీ రాత్రి 10.30కు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు.శ్వాసకోశ, అవయవాల ఇన్ఫెక్షన్‌ నియంత్రణలో నిపుణుడిగా పేరు గాంచిన లండన్ కు చెందిన డాక్టర్‌ జాన్ రిచర్డ్‌ బీలే సెప్టెంబర్‌ 30న అపోలోకు వచ్చి జయకు చికిత్స అందించారు. బాగా కోలుకుంది.  

డిసెంబర్ 4 :జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ నిపుణుల బృందం ధృవీకరించిందని ఏఐఏడీఎంకే ప్రకటించింది.అదేరోజున జయలలితకు గుండెపోటువచ్చింది.చికిత్సచేస్తున్నామని డాక్టర్లు ప్రకటించారు. డిసెంబర్ 5 రాత్రి 11.౩౦ గంటలకు జయలలిత మరణించారు.

రేపో మాపో ఇంటికి తిరిగి వస్తుందని భావిస్తున్న తరుణంలో కార్డియాక్ అరెస్ట్ తో జయ కనుమూశారు. ఈ ఇద్దరూ కూడా పదవిలో ఉండే చనిపోయారు. 1984 డిసెంబర్ ఎన్నికల్లో గెలిచిన ఎంజీఆర్ మూడేళ్ళ తర్వాత అదే డిసెంబర్ నెలలో కన్నుమూయడం యాదృచ్చికమే కావచ్చు. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!