నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్ ని చిత్ర పరిశ్రమ మరచిపోయినట్లేనా?

Sharing is Caring...

Mohammed Rafee …………..

తెలుగు చిత్రసీమ “ముద్దుబిడ్డ” కె.బి.తిలక్ ను సినీ ఇండస్ట్రీ మరచిపోయినట్లే అనిపిస్తోంది! ఆయన శత జయంతి రేపటితో ముగియనున్నది! తెలుగు సినిమా పరిశ్రమకు ఆ సోయి లేనట్లుంది? కనీసం ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన ఫొటోకు ఒక దండ అయినా వేస్తారో లేదో! కానీ, తిలక్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న కిన్నెర సాంస్కృతిక సంస్థ ఆహ్వానాన్ని కూడా సినిమా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకున్నట్లు లేదు!

ఆఖరకు త్యాగరాయ గానసభలో అదీ ఒక నలభై మంది మాత్రమే చూసేలా తిలక్ శత జయంతి ఉత్సవాలు ఒక చిన్న వేదికకు ఇవాళ పరిమితం చేశారు! అవునులెండి… ఎన్టీఆర్, అక్కినేని, ఘంటసాల శత జయంతి ఉత్సవాలనే పట్టించుకోని సినీ పరిశ్రమకు తిలక్ ఎందుకు గుర్తుకొస్తారు?

1956లో ‘ముద్దుబిడ్డ’ సినిమా నిర్మించిన కొల్లిపర బాల గంగాధర తిలక్ 1926 జనవరి 14న జన్మించారు. 16వ ఏట ఏలూరు లో చదువుకుంటూనే స్వాతంత్య్ర సమరంలోకి దిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1942లో జైలు జీవితం గడిపారు. తిలక్ గొప్ప అభ్యుదయవాది! ఆయన తీసిన సినిమాలు కూడా అదే కోణంలో ఎన్నో విలువలతో కూడిఉండేవి!

1974లో ఆయన తీసిన ‘భూమి కోసం’ ఒక సంచలనం సృష్టించింది. ఎల్.వి. ప్రసాద్, అక్కినేని సంజీవిలు అతనికి మేనమామలు. జగ్గన్న శాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్యమండలిలో చేరి నాటకాలు వేస్తున్న రోజుల్లో సినిమా రంగంలోకి ఎడిటర్ గా ప్రవేశించారు. ‘జ్యోతి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ‘అనుపమ చిత్ర’ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాత అయ్యారు.

ఎమ్మెల్యే, చిట్టి తమ్ముడు, ఉయ్యాల జంపాల, కొల్లేటి కాపురం ధర్మవడ్డీ లాంటి ఆణిముత్యాల్లాంటి సినిమాలు నిర్మించారు. అలనాటి అందాల తార జయప్రదను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది తిలక్ గారే! ‘నగ్నసత్యం’ సినిమాలో ఆయన నటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడుగా గుర్తింపు పొందారు.

హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ తరలివచ్చాక కార్మికుల పక్షాన నిలిచి యూనియన్లు బలోపేతం అయ్యేందుకు విశేష కృషి చేశారు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారు.తిలక్ గారితో పరిచయం నా అదృష్టం. ఆయన చివరి 15 ఏళ్ళు అప్పట్లో ప్రతి రోజు రవీంద్రభారతికి నిత్య ప్రేక్షకుడుగా మారారు!

1998 నంది నాటకోత్సవాల్లో నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నాకు నా రాతలకు అభిమాని అయ్యారు. అప్పుడప్పుడు రవీంద్రభారతిలో చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం! ఆయన తన అనుభవాలను కథలు కథలుగా చెప్పే వారు! స్వతహాగా మితభాషి! కావాలని కదిలించి మరీ ఏదో టాపిక్ గుర్తు చేసి మాట్లాడించే వాడ్ని! 

నేను జర్నలిజం వదిలేసి సాంస్కృతిక శాఖలో చేరినప్పుడు వారించారు. రాసే వాళ్ళు ఇలా అస్త్ర సన్యాసం చేస్తే ఎలా అని రెండు నెలలు నాతో మాట్లాడలేదు! 2010 సెప్టెంబర్ 23న ఆయన కన్నుమూశారు! అంతకు ముందు రెండేళ్ల క్రితం 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది సినిమా అవార్డ్స్ లో తిలక్ గారిని ప్రతిష్టాత్మక బి.ఎన్.రెడ్డి అవార్డుతో గౌరవించింది!

అంతటి మహనీయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన తిలక్ ను సినీ పరిశ్రమ మరచిపోవడం దురదృష్టకరం!తిలక్ గారి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాం ..సినీ పెద్దలు కొందరైనా రండి అని ఆహ్వానించినా ఎవరూ సహకరించలేదని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మద్దాలి రఘురాం చెప్పుకొచ్చారు.

త్యాగరాయ గానసభ కు రాలేము, ఫిలిం ఛాంబర్ లో చేయమని ఒక దర్శకుడు సలహా ఇచ్చారట! సరే అని ఫిలిం ఛాంబర్ ఉచితంగా ఇస్తారా అని అడిగితే 12 వేలు రెంట్ కట్టమన్నారట! చివరకు 50 శాతం డిస్కౌంట్, ఆరు వేలు ఇచ్చి చేసుకోండి అన్నారట! అందుకు సిద్ధమైనా, సినీ పెద్దలు ఎవరు హాజరవుతారో చెప్పలేమన్నారట!

ఎవ్వరూ రాని చోట ఎందుకులే అని త్యాగరాయ గానసభలో నిర్వహించాలని  నిర్ణయించుకున్నారు.. ఇదీ పరిస్థితి! సినిమా పరిశ్రమ దుస్థితి! ఎన్టీఆర్ శత జయంతి తెలుగుదేశం పార్టీ విజయవాడలో నిర్వహించాల్సి వచ్చింది! అక్కినేని శత జయంతి హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోకు నాగార్జున పరిమితం చేసుకోవాల్సి వచ్చింది! తిలక్ వారసుడు అమెరికాలో వున్నారు కాబట్టి, ఇక్కడ పట్టించుకోలేని పరిస్థితి!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!