మాటలో .. పాటలో ఆమె తీరే వేరు !

Sharing is Caring...

ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం  ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది.

మొత్తానికి ఆమె చాలా నిక్కచ్చి మనిషి. ప్రత్యక్షంగా ఒక రకంగా, పరోక్షాన మరోరకంగా మాట్లాడకుండా తనకు నచ్చిన లేదా  నచ్చని విషయాలను నిర్మొహ మాటంగా చెప్పేస్తుంది. ఆ స్వభావం వల్ల ఆమెను గర్విష్టి గానూ, అహంభావిగానూ భావించే వారు కొందరు.

సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణ పాత్రికేయునిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయనకు అప్పటి టాప్ హీరోయిన్ భానుమతీ రామకృష్ణను ఇంటర్వ్యూ చేసే అపూర్వ అవకాశం లభించింది. రమణ చాలా ఆనంద పడ్డారు. అప్పట్లో భానుమతిని దూరంగా చూసిన వారందరూ ఆమె అహంభావి, గర్విష్ఠి అంటుండేవారు. దాంతో రమణ కూడా అపోహపడ్డారు. జర్నలిస్ట్‌గా తన తలపొగరేంటో భానుమతికి చూపిద్దాం అనుకున్నారట రమణ.

ఇంటర్‌వ్యూ మొదలైంది. భానుమతిని రమణ అడిగిన తొలిప్రశ్న… ‘‘మీకు తలపొగరెక్కువటగా?’ అని. దానికి ఆమె సూటిగా ఇలా సమాధానం ఇచ్చారు. ‘నా ఎదురుగా ఉండి నన్నే ఆ మాట అనడానికి నీకెంత తలపొగరు’ అని. దాంతో ఖంగు తినడం రమణ వంతైంది. వెంటనే భానుమతి పకపకా నవ్వేశారు.

‘దీన్ని తలపొగరు, అహంభావం అనకూడదు. ఆత్మాభిమానం అనాలి. భానుమతి ఎవరి ముందూ తలదించుకోదు. దానికి వీళ్లందరూ ఇలాంటి పేర్లను పెడతారు. అంతేకానీ నేనూ అందరిలాంటి ఆడదాన్నే’’ అని ఎంతో అనునయంగా సమాధానం చెప్పారు భానుమతి. ఈ విషయాన్ని ముళ్లపూడి తన ‘కోతికొమ్మచ్చి’లో గుర్తుచేసుకున్నారు.

ఈ నిక్కచ్చితనం తోనే ఒక సినిమా మిస్ అయ్యింది. ఆ మిస్సయిన సినిమా పేరు మిస్సమ్మ. ఆ తరువాత ఆ పాత్ర సావిత్రి చేశారు. విజయా వారి మిస్సమ్మ సినిమాలో మిస్సమ్మ పాత్ర తొలుత భానుమతి చేశారు.నాలుగు రీళ్ల సినిమా కూడా పూర్తయింది. ఆరోజు వరలక్ష్మీ వ్రతం. పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకొని షూటింగ్ కి భానుమతి కొంచెం ఆలస్యంగా వెళ్లారు.

నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి భానుమతిపై కోప్పడ్డారు. ఆలస్యమైనందుకు క్షమాపణ చెప్పమన్నారు. భానుమతి అందుకు ససేమిరా అన్నారు. తాను ముందురోజు సాయంత్రం షూటింగ్ ప్యాకప్ చెప్పినప్పుడు .. రేపు  ఆలస్యంగా వస్తానని ప్రొడక్షన్ సిబ్బందికి నోట్ రాసి … మీకు ఇవ్వమని చెప్పానని భానుమతి గట్టిగా జవాబు చెప్పింది.

క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో చక్రపాణికి మరింత కోపమొచ్చి తీసిన నాలుగు రీళ్ళను కాల్చిపడేశారు. భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సినిమా పూర్తి చేశాడు.అయితే తన తప్పు ఉంటే మటుకు ఏమాత్రం సంకోచించకుండా భానుమతి క్షమాపణ చెప్పేవారు.

‘మల్లీశ్వరి’ చిత్రం లో ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట ను  రికార్డింగుకు ముందు  ప్రాక్టీసు  చేస్తున్న ‌ సందర్భంలో భానుమతి ఆ పాటను  ఆయన చెప్పిన పద్ధతిలో కాకుండా తన దైన శైలిలో పాడుతున్నారట. సంగీత దర్శకుడు రాజేశ్వరరావుకు ఆమె పధ్ధతి నచ్చలేదు. ‘అలలు కొలనులో గలగల మనినా’ చరణాన్ని ఇలా పాడాలి అని రాజేశ్వరరావు మరోసారి బాణీని స్వయంగా పాడి వినిపించారు.

దాంతో భానుమతికి ఉక్రోషం వచ్చింది. ‘నేనూ సంగీతంలో మాస్టర్నే’ అని పెడసరంగా అన్నారట. ఆమాటకు రాజేశ్వరరావు కు కోపమొచ్చి వెళ్లిపోయారట.ఇది జరినప్పుడు దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి అక్కడ లేరు. తరువాత వచ్చి చూస్తే ఆర్కెస్ట్రా వాళ్లు మాత్రమే వున్నారు. రాజేశ్వరరావు కనపడలేదు. తబలా వాయిద్యకారుడు జరిగిన విషయాన్ని బి.ఎన్‌.కు వివరించి చెప్పాడు.

బి.ఎన్‌. రెడ్డి వెంటనే రాజేశ్వరరావు ఇంటికి వెళ్ళారు. ‘ఈ సినిమా చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. భానుమతికి ఉందేమో కనుక్కోండి’ అంటూ రాజేశ్వరరావు తనదైన శైలిలో చెప్పారు. ఆ తర్వాత బి.ఎన్‌. భానుమతిని పిలిపించి మందలించారు. తర్వాత పాట రికార్డు చేశారు.

రికార్డింగ్‌ అయ్యాక అందరూ ఆ పాట వింటున్నారు. ‘అలలు  కొలనులో’ చరణం ముగిశాక భానుమతి లేచి వచ్చి రాజేశ్వరరావుకు ప్రణామం చేసింది. ‘ఇప్పుడు వింటుంటే నాకు తెలుస్తోంది మీరు నన్ను ఎందుకు హెచ్చరించారో? క్షమించండి అన్నదట. అది ఆమె గొప్పదనం.

భానుమతి కి  నారదుని పాత్ర చేయాలని కోరిక ..నారదుని పాత్రను హైలెట్  చేస్తూ ” శ్రీకృష్ణ తులాభారం”  స్క్రిప్ట్ కూడా రాయించారు కానీ అది తెరకెక్కలేదు.  ఇక ఆమె పాడిన పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆమె స్వరంలో ఒక ప్రత్యేకత ఉండేది. ఆమె తన పాటలన్ని తానే పాడుకున్నది.

ప్రేమే నేరమౌనా నాపై ఈ పగేలా … లైలా మజ్ను…  పిలచిన బిగువటరా … మల్లీశ్వరి…. మనసున మల్లెల మాలలూగెనే యెంత హాయి ఈ రేయి నిండెనో … మల్లీశ్వరి….  ఉయ్యాల జంపాలలూగరావయా … చక్రపాణి…  ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన … విప్రనారాయణ…  సావిరహే తవదీనా … విప్రనారాయణ….  అడుగదుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు … సారంగధర…  ఓ బాటసారి నను మరువకోయి … బాటసారి.. శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా … బొబ్బిలి యుద్ధం……  ఊయలలూగినదోయి మనసే … బొబ్బిలి యుద్ధం…. నీటిలోన నింగిలోన నీవె వున్నావులే … వివాహబంధం శరణం నీ దివ్యచరణం … మట్టిలో మాణిక్యం..  భానుమతి పాడిన కొన్నిఆణిముత్యాలు ఇవి.

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!