Abdul Rajahussain ………………….
మన వెండితెరపై గయ్యాళి అత్తలు గా రాణించిన నటీమణుల్లో ‘జవ్వాది గంగారత్నం, సూర్యకాంతం,ఛాయాదేవి ప్రముఖులు.ఆతర్వాత చాలామంది గయ్యాళి అత్తలుగా నటించినా ఎవరికీ పెద్దగా పేరు రాలేదు.
గయ్యాళి అత్త అనగానే మనకు సూర్యకాంతం మాత్రమే..గుర్తొస్తారు.కానీ..సూర్యకాంతం కు గురువిణి వున్నారు.ఆమే సీనియర్ నటి జవ్వాది గంగారత్నం.సూర్యకాంతానికి ఈమే ఆదర్శం కావడం విశేషం..
వందేళ్ళు జీవించడమే గొప్ప.. 108 ఏళ్ళుజీవించి ఈ రికార్డును తిరగ రాశారు జవ్వాది గంగారత్నం. ఈతరం వారికి ఈ నటి ఎవరో తెలీకపోవొచ్చు.అటు రంగస్థలంలో,ఇటు సినిమాల్లో గంగా రత్నం తనదైన ముద్ర వేశారు.ఫలానా పాత్ర గంగా రత్నం మాత్రమే చేయగలదు అన్నంతగా సినీ/ నాటక రంగాల్లో జయ పతాకను ఎగురవేసిన మహానటి ఆమె..
ఎవరీ గంగారత్నం.?
1893 లో తూర్పు గోదావరి జిల్లా లో అంబాజీపేట మండలం గంగలకుర్రు అనే పల్లె లో పుట్టిన మేలు జాతి కళారత్నం గంగారత్నం…ఈమె జీవితంలో… రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి.ఒకటి.బాల్య వివాహం.కాగా రెండోది..18 ఏళ్ళకే వైధవ్యం ప్రాప్తించింది.
అప్పటికే ముగ్గురు పిల్లలు. కుటుంబ జీవనం కోసం నాటకాల వైపు మళ్ళారు.వివిధ నాటకాల్లోని ఎన్నోపాత్రల్లో నటించినా..హరిశ్చంద్ర నాటకంలోని కలహకంఠి,చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రలు ఈమెకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి..ఎక్కడ చింతామణి నాటకం ప్రదర్శించినా శ్రీహరి పాత్రకు మాత్రం గంగారత్నం కావాలని జనం పట్టుపట్టేవారట.ఆరోజుల్లో…
నాటకరంగంమీద ఆమె ప్రభ అలా వెలిగిపోయేది. కరెంటు లైట్లు లేని రోజుల్లో…చమురు దీపాల,కాగడాలు, పెట్రొమాక్స్ లైట్ల కాంతుల మధ్య పల్లెల్లో నాటకాలను ప్రదర్శించేవారు.. అలాంటి నాటకాల్లో కూడా గంగారత్నం అద్భుతం గా నటించేవారట. అలా నాటకాల్లోనటిస్తూనే సినిమాలకు వెళ్ళారు గంగారత్నం.
ఆమె నటించిన మొదటి సినిమా.. “ప్రేమవిజయం”.(1936) గయ్యాళి పాత్రలు ఆమె బాడీలాంగ్వేజ్ కు తగినట్లు వుండేవి. అందుకే చాలా సినిమాల్లోగయ్యాళి పాత్రల్లో నటించారు.. ఎక్కువగా సహాయ,హాస్యపాత్రలు మాత్రమే దక్కాయి. గంగారత్నం గారికి హీరోయిన్ ఛాన్స్ లు రాలేదు.
కారణం ఆమెది హీరోయిన్ పర్సనాలిటీ కాదని అనేవారట.. పైగా మగాడికి మల్లే నిలువెత్తు ఎత్తు ఆకారం ఆమెది.. కీలుగుర్రంలో రాక్షసి పాత్రలో నటించి…మెప్పించారు.రైతుబిడ్డ,మాలపిల్ల, కనకతార, సతీ తులసి, యోగివేమన, పక్కింటి అమ్మాయి, అర్ధాంగి, నెలవంక..మల్లీశ్వరి,తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
1985 వరకు ఆమెసినిమాల్లోనటించారు.శ్రీవారి శోభనం(1985) ఆమె చివరి చిత్రం. సినిమాల్లో ఇరవైయేళ్ళు నటించాక…సినిమాల్లో వేషాలు రాక మళ్ళీ నాటకాల్లో వేషాలు వేశారు.అటు సినీ, ఇటు నాటకరంగంలో సుమారు 90 ఏళ్ళు నటించారు.
గంగారత్నం చివరి రోజులు గడ్డుగా గడిచాయి. ఇంటి అద్దె కూడా కట్టుకోలేని దుస్థితిలో గడిపారు..అప్పట్లో స్టిల్ పొటోగ్రాఫర్, చిత్ర నిర్మాత.మన సత్యం గంగారత్నం ఆర్ధిక ఇబ్బందులు తెలుసుకొని… మద్రాసులో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి సత్కరించి ఆర్ధిక సాయం అందించారు.
శారద,వాణిశ్రీ,మల్లె మాల తమ వంతు సాయం చేశారు. చివరిరోజుల్లో సినీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ సంఘం వారు కేటాయించిన వెయ్యి రూపాయల నెలవారీ భృతితో జీవనం గడిపారు.ఆమెకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్ళున్నారు..2001 సెప్టెంబర్ లో ఈదురు అనే గ్రామంలో పెద్దకూతురి దగ్గర తనువు చాలించారు గంగారత్నం.

