A wonderful art treasure …………………..
అద్భుత కళా సంపదకు కేరాఫ్ అడ్రెస్ ‘తమిళనాడు’ అనే చెప్పుకోవాలి. తమిళనాడును ఏలిన రాజులంతా గుళ్ళు,గోపురాలపై శ్రద్ధ చూపారు. వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలన్నీ అపూర్వ కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. అలాంటి వాటిలో ‘ఐరావతేశ్వర ఆలయం’ ఒకటి.
ఈ ఆలయం కుంభకోణానికి దగ్గరలోని ‘దారాసురం’ లో ఉంది.ఇది చేనేత కార్మికుల గ్రామం, చేతితో నేసిన పట్టు చీరలకు కూడా ప్రసిద్ధి చెందింది. దీన్నే’దారాసుర ఆలయం’అని కూడా పిలుస్తారు. అద్భుత శిల్పకళతో శోభిల్లే ఈ ఆలయాన్ని రెండవ రాజరాజ చోళుడు నిర్మించాడు. చోళులు శివునికి వీర భక్తులు. పన్నెండవ శతాబ్దిలో నిర్మించిన ఈ దేవాలయంలో ఇప్పటికీ నిత్యం దూప, దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు.
ఇక్కడ శివుని పేరు” ఐరావతేశ్వరుడు”. ఇంద్రుని వాహనం అయిన ఐరావతం అనే తెల్ల ఏనుగు, యముడు ఈ స్వామిని ఆరాధించినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. ఐరావతం తనను పూజించలేదని దుర్వాసమహర్షి కోపంతో శపిస్తాడు. దాంతో ఆ ఏనుగు తెల్ల రంగులో మార్పు వస్తుంది. ఆలయ ప్రాంగణం లోని కోనేరులోని పవిత్ర జలాలను జల్లుకుంటే శాప విముక్తి కలుగుతుందని దుర్వాసుడు కోపం తగ్గాక చెబుతాడు.
ఆ మేరకు ఐరావతం ఇక్కడ కొచ్చి ఆ జలాలను చల్లుకుని శివుణ్ణి ప్రార్థిస్తుంది. శివుడు కరుణించగా తన పాత రూపం పొందుతుంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో శివుడిని ఐరావతేశ్వరుడు అంటారు. గర్భాలయంలో లింగ రూపంలో ఐరావతేశ్వర స్వామి దర్శనమిస్తారు. దక్షిణ దిశగా అమ్మవారు పెరియ నాయకి నిలువెత్తు రూపంలో కొలువై ఉంటారు.పేరుకు తగినట్లుగా ఐరావతేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నీ భారీగా ఉంటాయి.
ఈ ఆలయం ద్రావిడ శైలి లో నిర్మితమైంది. ఈ ఆలయం శిల్పాలకు ప్రసిద్ధి. అత్యంత ప్రతిభావంతులైన శిల్పులు ఇక్కడి శిల్పాలను చెక్కారు. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలిచారు. ఆ అద్భుతాలను కళ్ళతో చూసి తీరాల్సిందే.
మండప స్థంభాల పైన శివకళ్యాణ దృశ్యాలు రమణీయంగా ఉంటాయి. శివుడిని పెళ్లి కుమారుని చేయడం, ఆ సుందర మూర్తిని మహిళలు మైమరచిపోయి చూస్తుండటం, రధాలు, గుర్రాలు,ఏనుగుల ఊరేగింపు దృశ్యాలు కన్నులకింపుగా ఉంటాయి. ఇక త్రిపురాంతక సంహార దృశ్యాలు, త్రినేత్రుడు మన్మధుని దహించే దృశ్యం, యోగ ముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్ధించడం … ఇవన్నీయాత్రీకులను ఆకట్టుకుంటాయి.
వాటిని చూసాక ఆనాటి శిల్పులను మెచ్చుకోకుండా ఉండలేం.ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న కొలనును ‘’యమ తీర్ధం ‘’అంటారు. ఈ కొలను లో స్నానం చేస్తే చర్మరోగాలన్నీ సమిసిపోతాయని కూడా చెబుతారు. యముడు కూడా ఇక్కడ స్నానం చేశారని అంటారు. అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ స్వామిని వేడుకొంటే సంతాన ప్రాప్తి కలిగిస్తాడని ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా నమ్ముతారు.
ఈ ‘ఐరావతేశ్వర ఆలయం’ కుంభకోణం పట్టణానికి దాదాపు 5 కి.మీ దూరంలో ఉంది.తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం కు 90 కి.మీ దూరంలో ఉంది.దారా సురం రైల్వే స్టేషన్ కి 1 కి.మీ దూరంలో ఉంది.
కుంభకోణంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటే దగ్గర్లోని స్వామిమలై సుబ్రమణ్య స్వామి ఆలయం,తంజావూరు బృహదీశ్వర ఆలయం, పట్టణంలోని శ్రీ ఆది కుంభేశ్వర ఆలయం, నాగేశ్వరన్ ఆలయం, సారంగపాణి ఆలయాలను సందర్శించవచ్చు.
అలాగే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ ఇంటిని చూడవచ్చు. దగ్గర్లో ఉన్న ధేనుపురీశ్వర (శివ) ఆలయం, శ్రీ దుర్గా మందిరాన్ని దర్శించవచ్చు .
——- Theja