Paresh Turlapati ………….
సినిమా తీయడం ఒకెత్తు .. సినిమా ప్రజల్లోకి వెళ్లేలా చేయడం మరొకెత్తు..’రాజు వెడ్స్ రాంబాయి’ ల పెళ్లిగురించి (మూవీ గురించి ) మొదట్లో చాలామందికి తెలియదు..ఎందుకంటే ఇందులో పెళ్ళికొడుకు కొత్త , పెళ్లికూతురు కొత్త (హీరో , హీరోయిన్లు )ఇద్దరూ తెలిసినవాళ్ళు కాదు… టైటిల్ అనౌన్స్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు పొలోమంటూ పెళ్ళికి వెళ్తారా ?
అందుకే దర్శకుడు తెలివిగా ” రాంబాయి నీమీద నాకు మనసాయెనే ” అని ట్యూను కట్టి జనాల్లోకి వదిలాడు..పెళ్ళిపాట బాగుండటంతో జనాలకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది..దర్శకుడికి కాన్ఫిడెన్స్ రావడానికి ఆ మాత్రం చాలదూ ?
ఇంకేముంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ల పెళ్లి ఘనంగా జరక్కపోతే ( అంటే హిట్ కొట్టకపోతే ) అమీర్ పేట సెంటర్లో బట్టలిప్పుకుని తిరుగుతా అని దర్శకుడు సాయిలు ఛాలెంజ్ చేసాడు..
దానితో మొదటిసారిగా జనాలకు మూవీ మీద కొన్ని అంచనాలు వచ్చాయి…దర్శకుడు ప్రమోషన్ మీద ఈమాత్రం ఎఫర్ట్ పెట్టకపోతే సినిమా పరిస్థితి గాల్లో ఉండేది..నిజానికి దర్శకుడు సాయిలు 2010 లో ఇల్లందులో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి కథ రాసుకున్నాడు
గతంలో ప్రేమ కధలు చాలా వచ్చాయి . అగ్రవర్ణాల్లో ప్రేమలు , పరువు హత్యలు జనాలు చూసీ చూసీ విసిగెత్తిపోయి ఉన్నారు . కానీ ఇల్లేందులో జరిగిన ప్రేమ కధలో ముగింపు డిఫరెంట్ గా ఉంది ఆర్ద్రత కలిగిస్తుంది..అదే పాయింట్ ఆధారంగా దర్శకుడు కథ రాసుకున్నాడు
తన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో కొంతమంది పెద్దలను పిలిపించి ప్రివ్యూ చూపించాడు…కానీ నిర్మాత , దర్శకులు ఊహించని విధంగా ప్రివ్యూ చూడటానికి వచ్చిన పెద్దమనుషులు ఇంటర్వెల్ లోనే లేచి వెళ్లిపోవడంతో షాక్ అయ్యారు..పైగా ఈ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుందని యెగతాళి చేసి మరీ వెళ్లిపోయారు…ఆ క్షణాన దర్శకుడికి దుఃఖం తన్నుకుని వచ్చింది.
అయినా ఆత్మనిబ్బరం కోల్పోకుండా సినిమా ప్రమోషన్ మీద దృష్టి పెట్టాడు..మొదట రిలీజ్ చేసిన పాటతోనే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించాడు. టీజర్ లాంచ్ లో ఒక సెగ్మెంట్ ప్రేక్షకులకి సినిమా చూడాలనే క్యూరియాసిటీని రేకెత్తించాడు. స్లోగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది
ఇంతకీ స్టోరీ ఏంటి ?
వాస్తవ సంఘటన 2010 లో జరిగింది కాబట్టి దర్శకుడు కథని ఆనాటి నేపథ్యంలో తీసాడు..ఆంధ్ర .. తెలంగాణా సరిహద్దులో ఓ పల్లెటూరిలో రాజు (అఖిల్ రాజు ) అనే యువకుడు శుభ కార్యాలకు , అశుభ కార్యాలకు బ్యాండ్ వాయిస్తూ ఉంటాడు..అతడి తండ్రి (శివాజీ రాజా ) కి మాత్రం రాజు బ్యాండ్ వాయించడం ఇష్టం ఉండదు. అందుకే కొడుకుని హైద్రాబాదు వెళ్లి ఏదన్నా పనిచేసుకోమని వత్తిడి చేస్తూ ఉంటాడు
సరిగ్గా అదే సమయంలో రాజు ఆ ఊరికే చెందిన రాంబాయి (తేజస్వని రావు ) ప్రేమలో పడతాడు…మరోపక్క రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ ) కూతుర్ని గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తుంటాడు..సాధారణంగా పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరనే భయంతో ప్రేమికులు లేచిపోవడం చూస్తూ ఉంటాం..కానీ ఇక్కడ రాంబాయి వేరే నిర్ణయం తీసుకుంటుంది.
తమ పెళ్ళికి తండ్రి ఒప్పుకోడనే భయంతో ,పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా దారికి వస్తాడని అంచనా వేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వెంకన్న రియాక్షన్ ఏంటి ? వెంకన్న మూర్ఖపు నిర్ణయాలతో ఈ ప్రేమికులు పడే కష్టాలు ఏంటి ? వెంకన్నను ఎదిరించి రాజు రాంబాయిని పెళ్లిచేసుకుంటాడా ?లేదా ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రేమలు , పరువు హత్యలు , ముగింపు ట్రాజెడీలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. అన్నిట్లో ఒకటే రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములా ఉంటుంది… పెద్దవాళ్ళని ఎదిరించి లేచిపోయి పెళ్లిచేసుకోవడం కొన్ని సినిమాల్లో ఉంటే ,పెళ్ళికి ఇష్టపడని పెద్దలు హీరోనో , హీరోయిన్నో పరువు పేరిట హత్యలు చేయడం మరికొన్ని సినిమాల్లో ఆల్రెడీ చూసేసాం.
కాకపోతే ఈ సినిమాలో అగ్రవర్ణాలకు బదులు అణగారిన వర్గాల్లో కూడా పరువు కోసం ఎంతకైనా తెగిస్తారనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేసుకుని కథ రాసుకున్నారు… రాజు వెడ్స్ రామ్ బాయి సినిమాని ఇంటర్వెల్ దాకా చూసినప్పుడు మనక్కూడా ఇది రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములా నే అనిపిస్తుంది… క్లైమాక్స్ చూస్తే కానీ మనకు ఆ అభిప్రాయం పోదు.
పైగా ఖచ్చితంగా గుండెల్లో అదొకరకమైన ఆర్ద్రత భావం కలుగుతుంది. ఈ సినిమాకు ముగింపే ప్రాణం
ఫస్టాఫ్ లో రాజు రాంబాయి ప్రేమలో పడటం , ఫ్రెండ్స్ తో సరదాగా అల్లరి చేయడం , రాంబాయి తండ్రి వెంకన్న కౄరత్వంతో కథ చకచకా నడిచిపోతుంది. కానీ కొత్తదనం ఏదీ ?
గతంలో వచ్చిన ప్రేమ కధల సినిమాలానే అనిపిస్తుంది.. సెకండాఫ్ కధలో కొంత కొత్తదనం కనిపిస్తుంది అనుకునేలోగా సాగతీత తో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది..ఈ పరిస్థితుల్లో చివరి ఇరవై నిమిషాల్లో ప్రేక్షకులను చూపు తిప్పుకోనీకుండా కట్టి పడేశాడు దర్శకుడు… ముగింపు మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల గుండెలను బరువెక్కిస్తుంది
‘రాజు వెడ్స్ రాంబాయి’ పోస్టర్ చూసేవరకు హీరో , హీరోయిన్లు ఎవరనేది చాలామంది ప్రేక్షకులకు తెలీదు… సినిమా చూస్తే కానీ వాళ్ళిద్దరి నటన గురించి తెలియలేదు.. కొత్తవారైతేనేమి చక్కటి నటన ప్రదర్శించారు… సినిమా చూస్తున్న ఒక దశలో వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమికులా అన్నంత మమేకంగా నటించారు
అఖిల్ హావభావాలు బాగా పలికించాడు.. ఇక హీరోయిన్ తేజస్విని రావు కూడా తెలంగాణ యాసలో భావాలు పలికిస్తూ చక్కటి నటనను ప్రదర్శించింది.. వెంకన్నగా నటించిన డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ అన్న చైతన్య జొన్నలగడ్డ నెగిటివ్ షేడ్ లో క్రూరత్వం బాగానే పండించాడు.
అయితే ఇతని పాత్ర కోసం మరికొంత వర్క్ చేసి ఉంటే బాగుండేది… విలనిజం పండించటానికి స్కోప్ ఉన్న పాత్ర అయినా సరైన హోమ్ వర్క్ చేయకపోవడంతో ఆ కాసేపట్లోనే చైతన్య నటనని సగటు ప్రేక్షకుడు మర్చిపోతాడు.. శివాజీ రాజా నటనలో వంకలు పెట్టాల్సినవి ఏమీ లేవు… కాకపోతే అతడ్ని మామూలు పాత్రలో సరిపుచ్చారు
సాంకేతికంగా సినిమా బానే ఉంది… సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం బావుంది.. అతడు పాట రిలీజ్ టీజర్లోనే ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు.. పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది కాబట్టి పల్లె అందాలను చక్కగా చూపించిన సినిమాటోగ్రఫీ కూడా బానే ఉంది. సెకండాఫ్ లో కత్తెరకు కొద్దిగా పనిచెప్పి ఉంటే ఓవరాల్ గా సినిమా బాగుండేది. ముగింపు హృదయాలను టచ్ చేస్తుంది.

