బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమల దళం వేగం గా పావులు కదుపుతోంది. ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటన సందర్భంగా మమత ప్రభుత్వంలో కీలక నేత సుబేందు అధికారితో పాటు తృణమూల్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నేతలు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. వీరిలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ సంఖ్య ముందు ముందు ఇంకా పెరిగే సూచనలున్నాయి. పదిమంది చేరగానే అధికారం పోతుందా అంటే అవునని చెప్పలేము కానీ ఇవన్నీ ప్రమాదాన్ని సూచించే సంకేతాలు అని అనవచ్చు.
బెంగాల్ పై ఎప్పటి నుంచో కన్నేసిన బీజేపీ మెల్లగా మెల్లగా బలం పెంచుకుంటోంది. 2011లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బిజెపి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సీట్లు దక్కించుకుని ఓటు శాతాన్ని 10.16కు పెంచుకోగలిగింది. ఆ తర్వాత 2018 పంచాయతీ ఎన్నికల్లో బిజెపి 18 శాతం ఓట్లు పెంచుకుని మరి కొంత పుంజుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బిజెపి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో కాషాయదళం ధాటికి అక్కడి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ చెల్లాచెదురై పోయాయి. తృణమూల్ కూడా బలహీన పడింది. ఆ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లకు గాను 18 సీట్లలో బిజెపి విజయం సాధించింది. 18 సీట్లు అంటే మాటలేమి కాదు. ఇక అక్కడ నుంచి టార్గెట్ ఫిక్స్ చేసింది. దూకుడు పెంచింది.
బీజేపీ ప్రధానంగా మమతా సర్కార్ అవినీతి పెరిగిపోయిందనే విషయాన్నీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. వేలకోట్ల దోపిడీ జరిగిన శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాల్లో తృణమూల్ ఎంపీలు కూడా ఇరుక్కున్నారు. సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇవన్నీ దీదీని ఇబ్బంది పెట్టె అంశాలే. అలాగే మమతా మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పై అవినీతి ఆరోపణలున్నాయి. ఈయన నియోజక వర్గంలోనే బీజేపీ ఛీఫ్ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ అంశం పెద్ద వివాదం గా మారింది. ఈ ఘటన పై విచారించేందుకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు సమన్లు పంపిస్తే మమత వారిని ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకున్నారు. తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రానికి డెప్యుటేషన్‌పై వెళ్లకుండా కూడా ఆమె నిరోధించారు. గతంలో కూడా అధికారులపై విచారణ జరగకుండా మమతా బెనర్జీ అడ్డుకున్నారు. గత కొంత కాలంగా కేంద్రం తో దీదీ ఘర్షణ పడుతూనే ఉన్నారు.
మరికొద్ది నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నక్రమంలో ఈ పరిణామాలు తృణమూల్‌కు సవాల్‌గా మారనున్నాయి.సుబేందు అధికారి బీజేపీలో చేరడం దీదీకి నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీదీ క్యాబినెట్ లో సుబేందు అధికారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు రెండు పర్యాయాలు తమ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం నచ్చకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నవంబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఈ సుబేందు అధికారే.
ఆ ఉద్యమం కారణంగానే 2011లో వామపక్ష ప్రభుత్వం పతనమైంది. సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్‌మహల్ ప్రాంతాన్ని తృణమూల్ వైపు తిప్పడంలో అధికారే కీలక పాత్ర పోషించారు. అలాగే పలు ప్రాంతాలపై సుబేందు కి రాజకీయంగా మంచి పట్టు ఉంది. మొత్తం మీద రాజకీయ వాతావరణం ప్రతికూలంగా మారుతున్న క్రమంలో దీదీ హ్యాట్రిక్ కొడతారా ? అనేది సందేహమే. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మమతాను గట్టెక్కించ గలరో లేదో చూడాలి.
————–KNM