Ravi Vanarasi ……………………..
A movie like Sholay will never come again…………….
‘షోలే’ సినిమా అద్భుత విజయం వెనుక కీలక అంశాలు ఎన్నో ఉన్నాయి.పాత్రల రూపకల్పన .. వాటిని తెర ఎక్కించిన విధానం నభూతో నభవిష్యత్ .. నటీనటులు పాత్రలను అవగాహన చేసుకుని అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
నటుడు సంజీవ్ కుమార్ ఠాకూర్ బలదేవ్ సింగ్ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. గబ్బర్ సింగ్ చేతిలో తన కుటుంబాన్ని, చేతులను కోల్పోయి… ప్రతీకార దాహంతో రగిలిపోయే వ్యక్తిగా సంజీవ్ కుమార్ నటన అద్భుతం. అతని కళ్లల్లో పగ, దుఃఖం, నిస్సహాయత – అన్నీ స్పష్టంగా చూపాడు. గబ్బర్ సింగ్‌ను అంతం చేయాలని తపించే ఠాకూర్ పాత్ర ను చాలా సినిమాల్లో కాపీ కొట్టి కొట్టారు.
వీరు పాత్రకు ధర్మేంద్ర తప్ప మరొకరు న్యాయం చేయలేరు అన్నట్లుగా ఉంటుంది ఆయన నటన. ఉల్లాసంగా, ధైర్యంగా, అప్పుడప్పుడు అమాయకంగా కనిపించే వీరు పాత్రలో ధర్మేంద్ర ఒదిగిపోయారు. బసంతిని ఆటపట్టించడం, జైతో అతని స్నేహం, గబ్బర్ సింగ్ పై అతని కోపం – ప్రతి సన్నివేశంలోనూ అతని నటన సహజంగా ఉంటుంది.
జై పాత్రలో అమితాబ్ బచ్చన్ ఒదిగిపోయారు. సినిమాలో ఒక నిశ్శబ్ద నాయకుడు, తన భావాలను ఎక్కువగా బయటపెట్టని వ్యక్తి. కానీ అతని కళ్లల్లో చిన్నపాటి చిరునవ్వు … అద్భుతమైన డైలాగ్ డెలివరీలో ఆ పాత్రను అమితాబ్ అద్భుతంగా చూపించారు. వీరుతో అతని స్నేహం, రాధ పట్ల అతని నిశ్శబ్ద ప్రేమ – ఇవన్నీ అమితాబ్ నటనలో స్పష్టంగా కనిపిస్తాయి. ‘సుసైడ్ సీన్’లో అతని కామిక్ టైమింగ్, క్లైమాక్స్ లో అతని త్యాగం – ఇవన్నీ జై పాత్రను మర్చిపోలేనిదిగా మార్చాయి. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
గబ్బర్ సింగ్ పాత్రలో అంజాద్ ఖాన్ చెలరేగిపోయి నటించాడు. ‘షోలే’కు ముందు అంజాద్ ఖాన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ సినిమా తర్వాత ‘గబ్బర్ సింగ్’ అనే పేరు విలన్లకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. గబ్బర్ సింగ్ నడక, క్రూరమైన నవ్వు, ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి.
ముఖ్యంగా “కిత్నే ఆద్మీ థే?”, “తేరా క్యా హోగా కాలీయ?”, “బసంతి, ఇన్ కుత్తేకే సామ్నే మత్ నాచ్ నా!” వంటి సంభాషణలు – ఇవన్నీ గబ్బర్ సింగ్‌ను ఒక ఐకానిక్ విలన్‌గా మార్చాయి. గబ్బర్ సింగ్ పాత్ర భారతీయుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. గబ్బర్ సింగ్ పాత్ర ఎంత భయానకమో, అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. అరే ఓ సాంబా అనే డైలాగు ఇప్పటికి వినబడుతుంటుంది.
బసంతి పాత్రకు హేమమాలిని కరెక్టుగా సూట్ అయ్యారు. ఆమె అందం, ఉల్లాసం, అమాయకత్వం, కొంటెతనం అన్నీ మిళితమై అద్భుతంగా సరిపోయాయి. ఆమె మాటకారి స్వభావం, వీరుతో ఆమె ప్రేమ కథ – ఇవన్నీ సినిమాకు కావలసిన హాస్యాన్ని, ప్రేమను అందించాయి. టాంగా నడుపుతూ “చల్ ధన్నో!” అనే ఆమె మాట, గబ్బర్ సింగ్ ముందు నాట్యం చేసే సన్నివేశం – ఇవన్నీ ప్రేక్షకులను మురిపించాయి.
జయబాధురి రాధ పాత్రకు తన నిశ్శబ్దంతోనే ప్రాణం పోసింది. పతిని కోల్పోయిన బాధ, తన మామ ఠాకూర్ పట్ల గౌరవం, జై పట్ల ఆమె నిశ్శబ్ద ప్రేమ – ఈ భావోద్వేగాలను ఆమె తన కళ్ళతో, సూక్ష్మమైన హావభావాలతో అద్భుతంగా వ్యక్తీకరించింది.తన పరిథిలో బాగా నటించింది.
వీరితో పాటు అహ్మద్ (రామ్‌లాల్), లీల మిశ్రా (మౌసి), జగదీప్ (సూరమ్ భోపాలి), వికాస్ ఆనంద్ (ట్రైన్ డ్రైవర్), మాక్ మోహన్ (సాంబ), కేష్టో ముఖర్జీ (హావల్దార్) వంటి సహాయ పాత్రలు కూడా సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రతి చిన్న పాత్ర కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంటాయి.



