చలో లంబసింగి ..ఇదే సరైన సీజన్ !

Sharing is Caring...

పై ఫోటో లో మంచులో తడిసి ముద్దయిన ఆప్రదేశాన్ని గమనించండి.  

అక్కడి ప్రకృతి అందాలు చూడాలనుకుంటే  ఇది కరెక్ట్ సీజన్. 

మంచు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎందుకు ఆలస్యం ?

అరుదైన అనుభూతులను సొంతం చేసుకోండి .. …... 

శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలు నమోదు అవుతాయని అంటారు.అది నిజమో కాదో కానీ ‘అతి చల్లని ప్రదేశం ‘అనే మాట వాస్తవం.మన్యం చుట్టు ఉన్న కొండలు, అడవులు ఇరువైపులా లోయలు.  ఓహో కారులో అక్కడికి వెళ్తుంటే  ప్రయాణం  ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసు కొత్త అనుభూతులతో ఉరకలేస్తుంది. 

ఆ ప్రాంతమంతా   వైజాగ్ జిల్లా మన్యం ఏరియా పరిథిలోకి వస్తుంది.  దీనినే ముద్దుగా ‘కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ గా లేదా ‘ఆంధ్రా ఊటీ’ గా పిలుస్తారు.ఈ గ్రామానికే ‘కొర్రబొయలు’ అనే మరో పేరుకూడా ఉంది.అసలు పేరు మటుకు  ‘లంబసింగి’ అన్న మాట .. దీన్నే ‘లమ్మసింగి’ అనికూడా అంటారు.  

ఇక్కడ మిగతా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు  ఉంటాయి. ఎత్తులో ఉన్న ‘లంబసింగి’ చేరుకొనేటప్పుడు చల్లని గాలులు, మంచుపొరలు మనల్ని తాకుతూ వెళుతుంటాయి. అదొక అద్భుతమైన అనుభూతి. స్వయంగా అనుభవించి తీరాల్సిందే. 

దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా శీతాకాలంలో ‘లంబసింగి’ లో మంచు వర్షం కురుస్తుంది. మిగతా ప్రపంచానికి రెగ్యులర్ గా ఉదయం 6 ఆరు గంటలు అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనం ఇస్తాడు. శీతాకాలంలో  మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు.

మధ్యాహ్నం మూడుగంటలకే  సూర్యుడు మాయమై పోతాడు.సాయంత్రం అయ్యేసరికి మెల్లగా చలి ప్రారంభమవుతుంది.సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ‘లంబసింగి’కి వెళుతున్నకొద్దీ.. మలుపు మలుపులో  ప్రకృతి సొగసులు మనసును హత్తుకుంటాయి. 

మరోలోకంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మధ్యాహ్న భానుడి ఎండకు మిల మిల మెరిసే గిరి శిఖరాలు.. కనువిందు చేస్తూ పచ్చని తివాచీలు పరిచినట్టు ఉండే లోయలు.. దోబూచులాడే  మంచు పరదాలు.. మలుపు తిరిగే కొండ అంచులు, మంచు తో మెరిసే అటవీ అందాలు మనల్ని కట్టిపడేస్తాయి.  ఇవన్నీ ‘లంబసింగి’ అద్భుతాలు . ఇక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే అక్టోబర్ —-జనవరి మధ్యకాలం అనువైనది.

అదలా ఉంటే లంబసింగిలో జీరో టెంపరేచర్ నమోదు విషయం నిజం కాదని అంటారు.లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్ అనేది నిజమో అబద్దమో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదట.లంబసింగి ఉష్ణోగ్రతల గురించి అధికారికంగా ప్రకటించే వాతావరణ సంస్థ అక్కడ లేదు.

అయితే  జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదు అయినట్టు మీడియాలో వార్తలు వెలువడినప్పటి నుంచే లంబసింగికి  పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది.తొలిసారిగా 2012 లో ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కథనం ప్రచారంలో కొచ్చింది. 

అంతే ఇక … లంబసింగి  ఫేమస్ పర్యాటక ప్రాంతం అయిపొయింది. జనం పోటెత్తుతున్నారు.  లంబసింగి ని  పర్యాటక ప్రాంతంగా పరిగణించి  డెవలప్ చేస్తే  టూరిస్ట్ సెంటర్ గా మరింత గుర్తింపు పొందుతుంది  ప్రభుత్వం ఈ ప్రదేశంపై దృష్టి పెట్టి అభివృద్ది కోసం కొన్ని చర్యలు చేపడితే చాలు ఇది మంచి టూరిస్ట్ సెంటర్ గా ఎదుగుతుంది. 

పర్యాటకులు  తరలి వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.లంబసింగిలో సరైన వసతి,సదుపాయాలు, చిన్నహోటళ్లు, రెస్ట్ హౌస్లు పెద్ద సంఖ్యలో లేవు. ఇపుడిపుడే సదుపాయాలు ఏర్పడుతున్నాయి. నైట్ స్టే కోసం గుడారాలు అందుబాటులో ఉంటాయి. అది లంబసింగి కథ క్లుప్తంగా.

 

———-  K.N.Murthy

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!