Isn’t justice equal for all?……………………………….
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు కీలక సంఘటనల ఆధారంగా ఈ ’23’ సినిమా రూపొందింది. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ రంగావజ్జల రాసిన కథను ఆసక్తికరంగా దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించారు. ఇది ప్రశ్నించే సినిమా..అయితే ఈ ప్రశ్నలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చవచ్చు.మరికొందరు ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు.
ఉన్నత వర్గాల వారికి సంబంధించిన తీర్పులలో చూపే ఔదార్యం కోర్టులు అట్టడుగు వర్గాల కేసుల పట్ల చూపడటం లేదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి.అలాంటి వాదనను బలపరిచే విధంగా తెరకెక్కిన సినిమానే ఈ ’23’ . ఈ టైటిల్ ఎందుకు పెట్టారనే విషయం సినిమా చూస్తే అర్ధమౌతుంది.
చుండూరు ఘటన, చిలకలూరి పేట బస్ దగ్ధం కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ బాంబ్ పేలుడు కేసు ను లింక్ చేస్తూ కథ అల్లుకున్నారు. 1991 చుండూరులో 8 మంది దళితులను చంపిన కేసులో.. నిందితులకు దిగువ కోర్టు శిక్ష విధించింది. వారు హైకోర్టులో అప్పీల్ చేసి బయటికి వచ్చారు. 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 26 మంది చనిపోతే.. అందులో కూడా నేరస్తులు బయటికి వచ్చారు.
చిలకలూరిపేట కేసులో మటుకు నిందితులు 32 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ మూడు కేసుల్లో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది..? నిజంగా న్యాయం ఎవరి వైపు నిలబడింది అనేది అసలు కథ. చట్టం,న్యాయం అందరికి సమానమని చెబుతున్నప్పుడు శిక్ష కూడా ఒకే విధంగా పడాలి కదా అన్నది సినిమా ఉద్దేశం.దర్శకుడు చాలా కన్విన్సింగ్ గా ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాడు.
నేరానికి ఉసిగొలిపిన కారణాలు.. ఎదురైన అవమానాలు.. ఎదుర్కొన్న పరిస్థితులు.. చివరికి వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వాటి పరిణామాలు ఏమిటి ? తదితర అంశాలను టచ్ చేసాడు రాజ్ రాచకొండ. ఇవన్నీ చూసాక ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలుగుతుంది.సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది.
రాజ్ దర్శకుడిగా తన ఆలోచనను తడబాటు లేకుండా తెరకెక్కించాడు. మూడు ఘటనల్లో ఎవరికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది చూపించాడు. స్క్రిప్ట్ పై బాగానే కసరత్తు చేశారు. సినిమా ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. సెకండాఫ్ స్పీడ్ అందుకుంటుంది.
కొత్త నటులు తేజ, తన్మయ ల నుంచి దర్శకుడు మంచి నటన ను రాబట్టారు. ఇద్దరివి మంచి పాత్రలు.యాంకర్ ఝాన్సీ కాసేపు కనిపిస్తుంది. పవన్ రమేశ్… దాసు పాత్రలో లీనమైపోయాడు. తాగుబోతు రమేశ్ సంగతి చెప్పనక్కర్లేదు.
మార్క్ కే రాబిన్ సంగీతం.. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. చంద్రబోస్, రెహమాన్, సింధు మార్టిన్ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఇండస్ మార్టిన్ సంభాషణలు అర్థవంతంగానూ, ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి.
పరిమితమైన బడ్జెట్ లో సహజత్వానికి దగ్గరగా సినిమాను తెరకెక్కించారు. ఇదో కొత్త తరహా సినిమా . చూడొచ్చు.
———– Siva