Happiness is the result of hard work ……………………..
పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దేవ్ రాతూరి .. ఇండియాలో పుట్టి చైనాలో నటుడిగా బిజీగా ఉన్నాడు. 35 కి పైగా సినిమాలు, మరెన్నో వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అక్కడి లోకల్ స్టార్స్ తో కూడా కలిసి పనిచేశాడు.
తొలుత ఆతిధ్య రంగం లో నిలదొక్కుకుని తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి విజయాలు సాధిస్తున్నాడు. కృషి, పట్టుదల ఉంటే దేన్నీ అయినా సాధించవచ్చని నిరూపించిన దేవ్ రాతూరి యువతకు ఆదర్శంగా నిలిచాడు.
దేవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టాలే పడ్డాడు.ఉత్తరాఖండ్ తెహ్రి గర్వాల్ జిల్లాలోని కెమ్రియా-సౌర్ అనే పల్లెటూరిలో పుట్టిన దేవ్ రాతూరి కి సినిమాలంటే పిచ్చి.బ్రూస్ లీని చూసి యాక్టర్ అవుదామనుకున్నాడు.ముంబయికి వెళ్ళాడు.
అక్కడ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.ఒకటి రెండు ఆడిషన్ టెస్టులకు వెళ్ళాడు.కొన్నాళ్ల తర్వాత అసలు విషయం బోధపడింది. బాలీవుడ్లో నటుడు కావడం అనుకున్నంత ఈజీ కాదని గ్రహించాడు.
గుంపు జనాల్లో కనిపించడం, చప్పట్లు కొట్టడం,పరుగెత్తడం లాంటి పాత్రలే వచ్చాయి తప్పితే కెమెరాలో నేరుగా కనిపించే అవకాశం రాలేదు.ఇక ఇక్కడ ఉంటే లాభం లేదనుకుని ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ బంధువుల ఇంట్లో ఉంటూ ఆరు నెలలపాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు.
డబ్బుల కోసం హోటల్ లో వెయిటర్ గా పనిచేశాడు. ప్లేట్స్ కడిగాడు..టేబుల్స్ తుడిచేవాడు.. ఏ పని చేస్తున్నా బ్రూస్ లీ, చైనానే కంటి ముందు కదిలేవి..దేవ్ డ్రీమ్స్ గురించి బాగా తెల్సిన మిత్రుడు 2005లో టికెట్ తీసివ్వడంతో చైనా ఫ్లైట్ ఎక్కేసి, అక్కడ దిగాడు.
కట్టుబట్టలతో చైనా వెళ్లిన దేవ్ గత్యంతరం లేక .. చేతిలో డబ్బుల్లేక ఓ రెస్టారెంట్ లో చిన్న ఉద్యోగంలో చేరాడు. రెండేళ్లలో చైనీస్ భాష నేర్చుకున్నాడు. జీతం పెరిగింది. మేనేజర్ అయ్యాడు.. దాదాపు ఏడేళ్లపాటు పనిచేశాడు.
అలా వచ్చిన అనుభవంతో,దాచుకున్న డబ్బుతో 2013లో ఓ చిన్నహోటల్ ప్రారంభించాడు.సరిగ్గా అపుడే దేవ్ ని అదృష్టదేవత వరించింది. హోటల్ బిజినెస్ క్లిక్ అయింది. దశలవారీగా ఎనిమిది నగరాల్లో రెస్టారెంట్లు మొదలెట్టాడు. ఇప్పుడవి ఎనిమిది అయ్యాయి. బిజినెస్ లో బిజీ అయిపోయిన దేవ్.. నటన గురించి మర్చిపోయాడు.
ఏదైనా మనది అని రాసుంటే, అది మన దగ్గరకే నడుచుకుని వస్తుందనే సామెత నిజమైంది.ఓసారి దేవ్ రెస్టారెంట్ కి వచ్చిన ఓ చైనీస్ డైరెక్టర్ .. లో బడ్జెట్ మూవీ కోసం లోకేషన్, నటుడి కోసం వెతుకుతున్నానని మాటల్లో దేవ్ తో అన్నాడు. నటన పట్ల తనకున్న ఆసక్తి విషయం షేర్ చేసుకున్నాడు. ఆ డైరెక్టర్ కి దేవ్ కూడా నచ్చాడు.
అంతే .. అతనికి SWAT అనే టీవీ సిరీస్‌లో చిన్న పాత్ర లభించింది.అది క్లిక్ అవడంతో వరుసగా 35 కి పైగా చైనీస్ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ‘మై రూమ్మేట్ ఈజ్ ఎ డిటెక్టివ్’ వంటి హిట్ మూవీలో దేవ్ ప్రముఖ పాత్ర పోషించాడు. చైనీస్ భాష వచ్చి ఉండటం అతనికి సినిమా రంగం లో ప్లస్ అయింది.
దేవ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా సంపాదించాడు.భార్య అంజలి, ఇద్దరు కుమారులతో కలసి జియాన్ లో నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్ నుంచి దాదాపు 150 మంది నిరుద్యోగులను చైనాకు పిలిపించి వారికి తన రెస్టారెంట్లలో ఉద్యోగాలు ఇచ్చాడు.అలాగే కొంతమంది చైనీయులకు అవకాశాలు కల్పించాడు. దేవ్ సక్సెస్ స్టోరీని 7వ తరగతి ఆంగ్ల పాఠ్యపుస్తకంలో చేర్చారు.జియాన్ విద్యార్థులు ఆసక్తిగా దేవ్ సక్సెస్ స్టోరీ ని చదువుతున్నారు.