Dr.V.Ramakrishna …………………… Kurukshetra battlefield
18 అక్షౌహిణుల సైన్యం ప్రాణార్పణ చేసిన కురుక్షేత్ర రణరంగానికి తొలిగా బలి అయినవాడు ఎవడు? కురువీరుడా..? పాండవ వీరుడా..?పాండవ వీరుడే..! కృష్ణుడంతటివాడు ఉన్నా..ధర్మం వారి పక్కనే ఉన్నా యుద్ధం ఇంకా మొదలుకాకుండానే తొలి సమర్పణగా తనకుతానుగా రాలిపోయిన వీరుడు ఈ పాండవ వీరుడు.
పాండవ పక్షంలో మొదట బలైన వీరుడు అనగానే అందరూ అభిమన్యుడంటారు కానీ చరిత్ర ఆయనను కాదంటోంది. మరి ఎవరు? భీముని మనవడు … బర్బరీకుడు. ఇతను ఘటోత్కచుని కుమారుడు. ఇతని తల్లి పేరు మౌర్వి. ఈమెనే అహిలావతి, కామకాంత అని కూడా పిలుస్తారు. తండ్రి మురుడు. మేఘవర్ణ, అంజనపర్వన్ తమ్ముళ్లు.
బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో మంచి ప్రతిభను కనబరిచేవాడు.అస్త్రశస్త్రాల మీద ఆయనకు ఉన్న పట్టుని చూసి దేవతలు మూడు బాణాలు ఇచ్చి ఇక ముల్లోకాలలో నీకు తిరుగులేదన్నారు.
బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం రానే వచ్చింది. ప్రతీ వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన పరిస్థితి. ఏ పక్షం బలహీనంగా ఉంటే దానికి సాయం చేయమంది తల్లి. సంఖ్యాపరంగా పాండవుల పక్షం బలహీనం కాబట్టి వారికి సాయం చేయాలని బయల్దేరతాడు బర్బరీకుడు.
ఇలాంటి యోధుడు వస్తే ఫలితాలు తారుమారై పోతాయని గ్రహించిన కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో ఎదురుపడతాడు. ‘మూడంటే మూడు బాణాలతో ఏం యుద్ధం చేస్తావు అన్నాడు కృష్ణుడు హేళనగా!
‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు.మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అన్నాడు బర్బరీకుడు నమ్మకంగా..!
‘నువ్వు చెప్పేదే నిజమైతే ఈ రావిచెట్టు ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించి చూపించు’ అన్నాడు కృష్ణుడు.తొలి బాణాన్ని విడిచాడు బర్బరీకుడు.ఆ బాణం చెట్టు మీద ఆకులన్నిటి మీదా తన గుర్తుని వేసి కృష్ణుని కాలి చుట్టూ తిరిగింది.
‘అయ్యా! నీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది..పాదాన్ని పక్కకు తియ్యి ’ అన్నాడు బర్బరీకుడు.శ్రీకృష్ణుడు పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు కనిపించింది.
శత్రువుల్ని ఇలా ఏరిపారేసే బర్బరీకుడు పొరపాటున కౌరవుల పక్షాన పోరాడాల్సి వస్తే..! విషయం అర్థమైంది కృష్ణునికి.
బర్బరీకా! నువ్వు ఏ పక్షానికి సాయం చేస్తే ఆపక్షం తక్షణం బలమైనదిగా మారిపోతుంది. అలాంటప్పుడు బలహీన పక్షం పక్షాన ఎలా పోరాటం చేస్తావు? అని అడిగాడు కృష్ణుడు.
“అవునా..మరి నేనేం చేయాలి?” అని అడిగాడు బర్బరీకుడు.
‘మహాభారత యుద్ధానికి ముందు రంగశాంతికి ఒక వీరుడి తల బలి ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకంటే వీరుడు ఇంకెవరున్నారు చెప్పు’అన్నాడు కృష్ణుడు.మారుమాటాడకుండా తన తలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు బర్బరీకుడు. అపుడే బర్బీకుడికి అర్ధమైంది బ్రాహ్మణుని రూపంలో ఉన్నది శ్రీకృష్ణుడే అని.. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని ఆయన ఆశ.
‘శిరస్సుతో చూసే అవకాశం కల్పించమని’ కోరతాడు బర్బరీకుడు. ‘తథాస్తు’ అన్నాడు కృష్ణుడు.
“బర్బరీకా..! నువ్వు గత జన్మలో యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది కాపాడమంటూ బ్రహ్మను వెంట పెట్టుకుని దేవుళ్లంతా వైకుంఠానికి వచ్చినప్పుడు వారిలో నువ్వు కూడా ఉన్నావు.
‘ఈ మాత్రం దానికి విష్ణువు దిగి రావాలా.. నేను చాలనా‘ అన్నావు. బ్రహ్మకు కోపం వచ్చి “ధర్మానికీ, అధర్మానికీ జరగబోయే పోరులో మొదట బలయ్యేది నువ్వే మూర్ఖుడా” అని శపించాడు. అందుకే ఈ ‘తలత్యాగం.. అయినా నీ త్యాగం ఊరికే పోదు. కలియుగంలో పూజలందు కుంటావు. నిన్ను తల్చుకుంటే చాలు కష్టాలు చిటికెలో తీరిపోతాయి’ అని వరమిచ్చాడు కృష్ణుడు.
అప్పటికే బర్బరీకుడు వేసిన తొలి బాణం కృష్ణుడి కాలి చుట్టూ తిరగడం వల్ల ఆ కాలు మిగతా శరీరంకంటే బలహీనపడింది. కృష్ణుడు అవతార సమాప్తి చేయవలసి వచ్చినప్పుడు కిరాతుని బాణం ఆ కాలివేలికే తగిలింది.
కురుక్షేత్రం కోసం తెగిన బర్బరీకుని తల రాజస్థాన్ లోని ఖాటు గ్రామంలోని చెరువులో పడిందట. ఆ చెరువులో ఉండి తమ కోరికలు తీరుస్తున్నందుకు ప్రజలు బర్బరీకుని బాబా అని పిలుచుకుంటున్నారు.
శివాలయం పక్కన ఉన్నందుకు శ్యాంబాబా అనీ, ఖాటు గ్రామంలో ఉన్నందున ఖాటు శ్యాం బాబా అనీ, చెరువులో ఉన్నందున శ్యాం కుండ్ బాబా అని పిలుచు కుంటున్నారు.. భక్తితో కొలుచుకుంటున్నారు. శ్యాంబాబాను దర్శించుకోడానికి ఏటా 40 లక్షల మంది వస్తారు.
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులలో అందరి కన్నా ఎక్కువగా ముగ్గురు బిడ్డలను పోగొట్టుకున్న దురదృష్టవంతుడిగా భీముడు మిగిలిపోయాడు. హిడింబితో కన్న ఘటోత్కచుడు, ద్రౌపదితో కన్న ఉపపాండవుడు శ్రుతసోముడు, ఘటోత్కచుని కొడుకు తనకు మనవడైన బర్బరీకుడు, తన కళ్ళముందే బలైపోయినా ఏమీ చేయలేని దీనస్థితిలో రక్తకన్నీరు కార్చుకున్నాడు.