Manipur iron lady away from politics……………
ఈ ఫొటోలో కనిపించే మహిళను గుర్తుపట్టారా ? అదేనండీ మణిపూర్ ఉక్కుమహిళ షర్మిల. అసాధారణ రీతిలో అనుకున్నది సాధించడానికి ఏకంగా 16 సంవత్సరాలు ‘దీక్ష’ చేపట్టి ఉక్కు మహిళగా ఖ్యాతి గాంచింది.
చలనం లేని ప్రభుత్వవైఖరిపట్ల విసుగు చెంది, దీక్ష విరమించి రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగింది.అయితే ఓటర్లు ఆమెను పట్టించుకోలేదు. ఎవరి కోసమైతే ఆమె పోరాటం చేశారో ఆ ప్రజలే ఆమెను దారుణంగా ఓడించారు. పట్టుమని 100 మంది కూడా ఓట్లు వేయలేదు. ఎంత అవమానం. ఎంత పరాభవం..
ఇక అసలు విషయంలో కెళ్తే …
మణిపూర్‌లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల 2 నవంబర్ 2000 నుంచి నిరవధికంగా నిరాహార దీక్ష చేపట్టింది. ఇంపాల్‌కు సమీపంలోని మలోమ్ వద్ద 2000లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో పదిమంది వ్యక్తులు చనిపోయారు.వారిలో మహిళలు, జాతీయ ‘సాహస’ అవార్డు అందుకున్న బాలుడు కూడా ఉన్నాడు.
ఈ ఘోరం పై ఎవరూ స్పందించని నేపధ్యం లో షర్మిల ప్రత్యేక సాయుధ బలగాల చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగింది.ఆ మరుసటి రోజే ఆమెపై ఆత్మహత్యా యత్నం నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపర్చారు.నాటి నుంచి 16 ఏళ్ళు ఆమె నీళ్ళుసైతం ముట్టలేదు.అప్పటి నుంచి ఆమెకు బలవంతంగా ఫ్లూయిడ్స్ రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహారాన్ని అందించారు.
కాగా ఈ దీక్షకు మీడియా కూడా తగినంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.సాంఘిక సేవా కార్యకర్త, కాలమిస్ట్ అయిన షర్మిల అనేక అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు.నిజంగా ఈ కాలంలో అంతటి సంకల్ప సిద్ధి గల మహిళలు ఉన్నారా అనిపిస్తుంది.
తర్వాత కాలంలో మణిపూర్ కోర్టు ఆమెను విడుదల చేయాలని ఆదేశించడంతో షర్మిల బయటి ప్రపంచం లో కొచ్చింది. ఆ తర్వాత షర్మిల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. 2016లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీని స్థాపించింది.ఏకంగా మణిపూర్ సీఎం ఇబోబి సింగ్ పై పోటీకి దిగింది. కానీ దారుణంగా ఓడిపోయింది.
ఆమె పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆమెకు కూడా కేవలం 90 ఓట్లే వచ్చాయి. అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమిటో ఆమెకు కూడా అర్ధంకాలేదు. దీక్ష విరమించిన వెంటనే పెళ్లి చేసుకుంటాని ప్రకటించడంతో ప్రజలు ఆమె పట్ల నమ్మకం కోల్పోయారని అప్పట్లో మీడియా రాసుకొచ్చింది.
తొందరపాటుతనం,సీఎం పైనే పోటీ చేయడం,చేతిలో సొమ్ము లేకపోవడం వంటి అంశాలు ఆమె ఓటమికి కారణాలైనాయి. బయటకు రాని బలమైన కారణాలు కూడా ఉండొచ్చు.మొత్తం మీద ఊహించని పరాభవంతో ఆమెకు ఉద్యమాలపట్ల, రాజకీయాలపట్ల విరక్తి కలిగింది.సొంత రాష్ట్రం, ప్రజల పట్ల విముఖత తో పరాయి రాష్ట్రం వెళ్ళింది. మళ్ళీ మణిపూర్ మొహం కూడా చూడలేదు.
ముందు కేరళ వెళ్లి కొన్నాళ్ల పాటు ప్రకృతి వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత చక్కగా తన చెలికాడు కౌటింహో ను పెళ్లి చేసుకుంది. ఏడాది తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చి ప్రశాంతంగా మొగుడితో కాపురం చేసుకుంటోంది. షర్మిల భర్త తో కొడైకెనాల్ లో కొన్నాళ్ళు గడిపారు .. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఒకటి రెండు సందర్భాలలో ప్రజా సమస్యలపై స్పందించారు.