Subramanyam Dogiparthi……………………… Award winning movie
బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట.సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక చిత్ర. కమర్షియల్ గా కూడా నిరుత్సాహపరచలేదట. ఈ 18 మంది నిర్మాతల్లో వేజెళ్ళ సత్యనారాయణ కూడా ఉన్నారు .తర్వాత కాలంలో వేజెళ్ళ చాలా సందేశాత్మక సినిమాలనే తీసారు.
మంధా వెంకట రమణారావు వ్రాసిన ‘కొలువు’ అనే కధ ఆధారంగా ఈ చలిచీమలు సినిమా తీశారు. 1978 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ‘దేవదాస్ కనకాల’ దర్శకుడు.స్క్రీన్ ప్లేను వేజెళ్ళ సత్యనారాయణే తయారు చేసారు. దేవదాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే . ఈ సినిమాకు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి. రెండవ ఉత్తమ చిత్రంగా , ఉత్తమ కధగా అవార్డులు వచ్చాయి. పరుచూరి వెంకటేశ్వరరావు ఈ సినిమా ద్వారానే డైలాగుల రచయితగా తెరంగేట్రం చేశారు.
‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే నూతన్ ప్రసాద్ డైలాగ్ ఈ సినిమా లోనిదే . అలాంటిదే మరో మాట ‘పొజిషన్’. ఈ రెండు డైలాగులు నూతన్ ప్రసాద్ చక్కగా చెప్పి బాగా పాపులర్ అయ్యారు. పట్నంలో అతని ఉంపుడుగత్తెగా తాతినేని రాజేశ్వరి బాగా నటించింది .
ఈమెకు కూడా ఇదే మొదటి సినిమా అనుకుంటా. తర్వాత చాలా సినిమాల్లో నటించింది . కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర లాగా మలచాలని దేవదాస్ కనకాల ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. ఎక్కడ కుదురుతుంది !? సావిత్రి లాగా మరెవరు నవ్వగలరు?
ఊరుమ్మడి బతుకులు’ సినిమా హీరో సత్యేంద్రకుమార్ ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రధారుడు.బాగా నటించాడు.అతని భార్యగా శైలజ.వారి కొడుకు సాంబయ్యగా నటించిన బాలనటుడు పాత్రల్లో ఇమిడిపోయారు. ఆ పిల్లవాడి చదువుకోవాలి అనుకునే తపనను దర్శకుడు బాగా చూపారు .శివకృష్ణకు కూడా మొదటి సినిమాయే.
చాలామందికి ఈ విషయం తెలియదు . ఈ సినిమాలో ముందు రెవెన్యూ ఇనస్పెక్టరుగా , తర్వాత తాసిల్దారుగా నటించారు. ఈ సినిమాలో మనకు తెలిసిన మరో నటుడు రాళ్ళపల్లి. అతనిది కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రే. ఈ సినిమాలో ఆయన ఒక పాటను వ్రాసి. ఆయనే పాడారు కూడా. ఇక ఇతర నటీనటులు మనకు తెలిసినవారు కాదు . బహుశా ఔత్సాహిక నటులు , బాగా జూనియర్ ఆర్టిస్టులు అయిఉండాలి.
యాభై ఏళ్ళ కింద గ్రామాల్లో ఉండే సామాజిక , ఆర్ధిక దోపిడీలకు వ్యతిరేకంగా వచ్చిన సినిమాలలో ఇదొకటి . ఇలాంటి సినిమాల ఒరవడి 80 వ దశకం చివరిదాకా కొనసాగింది. తర్వాత తర్వాత మధ్య తరగతి జనాభా పెరిగాక భ్రమల్లో తేలాడే మనస్తత్వం పెరిగిపోవటం , ఈ బక్క సినిమాలకు , ఎర్ర సినిమాలకూ ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయింది.
బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా ; బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ . వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో సరి . ప్రపంచంలో రాజకీయ , సామాజిక , ఆర్ధిక చరిత్ర అంతా ఈ సందేశలతోనే నిండిపోయింది .
ప్రతి బలిసినవాడు ఈ నగ్నసత్యానికి మినహాయింపు అనుకుంటాడు . ఈ చలిచీమలు సినిమా యూట్యూబులో ఉంది. సామాజిక స్పృహ లేనివాళ్ళకు నచ్చదు, అర్థం కూడా కాదేమో ! ఈ సినిమాలో తోలుబొమ్మలాట కాసేపు ఉంటుంది . ఇప్పటి తరం వారు చూసి ఉండరు . చూడాలనే ఆసక్తి ఉంటే చూడండి .