ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు ఇచ్చిన మూవీ !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………………  musical entertainer

1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు.

ఈ సినిమా ప్రేక్షకులకు , బహుశా మహిళలకు , బాగా నచ్చింది . ఆలుమగలు ఇగో గొడవలతో కీచులాడుకోవటం , కొట్టుకోవటం , విడిపోవటం , సినిమా ఆఖరికి ఎవరో ఒకరు కలపటం , లేదా వాళ్ళకే ఙానోదయం కావటం అప్పట్లో ఇదే మొదటి సినిమాయేమో ! తర్వాత ఇలాంటి స్టోరీ లైన్ తో చాలా సినిమాలే వచ్చాయి .

32 కేంద్రాల్లో రిలీజయితే 23 కేంద్రాలలో యాభై రోజులు , 15 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . హైదరాబాదులో నూన్ షోలతో సిల్వర్ జూబిలీ ఆడింది . 1979 లో నల్లతోరు కుటుంబం అనే టైటిల్ తో తమిళంలో , 1980 లో జుదాయి అనే టైటిల్ తో హిందీలో , 1987 లో శుభా మిలన అనే టైటిల్ తో కన్నడంలోకి రీమేక్ అయింది . అన్ని భాషల్లోను సక్సెస్ అయింది . హిందీలో జితేంద్ర , రేఖలు నటించారు . తమిళంలో శివాజీ గణేశన్ , వాణిశ్రీలు నటించారు . కన్నడంలో విష్ణువర్ధన్ , అంబిక నటించారు.  

తాతినేని చలపతిరావు ఈ సినిమాకు మంచి ట్యూన్స్ అందించారు. పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. నాకైతే చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే అనే పాట చాలా చాలా ఇష్టం . సి నారాయణరెడ్డి వ్రాసారు . వేటూరి వారు వ్రాసిన ఎరక్కపోయి వచ్చాను ఇరక్కపోయాను పాట లోని ఆ డైలాగ్ జనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. ఈ పాటకు ఆరేడు పల్లవులు ఇస్తే చివరికి అది ఒకే అయింది.

సినారె వ్రాసిన మరో పాట ఒక్కరిద్దరముగా మారేది ఇద్దరు ఒక్కటవ్వాలని చిత్రీకరణ బాగుంటుంది . పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది . కుర్ర జంటలు నారాయణరావు-సంగీత , లక్ష్మీకాంత్-రోజారమణిల మీద పాట పరుగెత్తి పాలు తాగేకంటే హుషారుగా ఉంటుంది . శ్రీశ్రీ వ్రాసిన తెలుసుకో ఈ జీవిత సత్యం పాట బాగుంటుంది. 

ప్రత్యేకంగా చెప్పాల్సింది సినారె వ్రాసిన రా రా రా రా రంకే వేసాడమ్మో అనే జయమాలిని మీద పాట . ఈ పాటలో పోటీకి రమ్మని సవాలు విసురుతుంది . డాన్స్ పోటీలో నారాయణరావు ఓడిపోతాడు . ఇదే కనుక నేనయితేనా అని ఊహించుకొని చేసే ANR డాన్స్ గురించి చెప్పుకోవలసిందే . గుండె ఆపరేషన్ అయ్యాక , 53 ఏళ్ల వయసులో అంత గొప్పగా డాన్స్ చేసే సాహసం చేయటం . ఆరోగ్య రీత్యా ధైర్యం ఉండాలి కదా ! Hats off to ANR and his determination and dedication to profession. 

ఇక వాణిశ్రీ నటన గురించి చెప్పేదేముంది . మొదట్లో అల్లరి చేస్తూ , ఊరకూరకే పేచీలు పెడుతూ , పెట్టుబడి లేని ఓవర్ ఆత్మాభిమానంతో సతమతమవుతూ , వయసు ఉడికాక కూడా ఇగోతో సపర్ అవుతూ , సినిమా పూర్తి కావాలి కాబట్టి ఆనాటి సగటు స్త్రీ లాగా భర్త సన్నిధే ఆడవారికి ఫైనల్ డెస్టినేషన్ అని భావించే పాత్ర . అలవోకగా చేసేసింది . గ్లామర్ + ఏక్షన్ = వాణిశ్రీ .

అలాగే అక్కినేని . గోపాలకృష్ణుని పాత్రలకు పెట్టింది పేరు . ఈ సినిమాలో పాత్ర పేరు కూడా అదే . చాలా హుషారుగా , ఎనర్జిటిక్ గా నటించారు. ఇతర పాత్రల్లో గుమ్మడి , నాగభూషణం , కాకరాల , విజయలలిత , హలం ప్రభృతులు నటించారు . రాజబాబు-రమాప్రభల పాత్రలు . రాజబాబు పాత్రని రచయిత బాలమురుగన్ అంత చీపుగా ఎందుకు షేప్ చేసారో అర్థం కాదు.

మరి సీనియర్ డైరెక్టర్ తాతినేని రామారావు , సీనియర్ నిర్మాత ఏ వి సుబ్బారావులు ఎందుకు అంగీకరించారో తెలియదు. సినిమా బాగా ఆడింది కాబట్టి ఇలాంటివన్నీ కొట్టుకుపోతాయి. సినిమాకు సంభాషణలు ఆత్రేయ,జంధ్యాల సమకూర్చారు. మొత్తం మీద సినిమా బాగుంటుంది . ఆనాటి మహిళలకు నచ్చింది . యూట్యూబులో ఉంది . ANR , వాణిశ్రీ , జయమాలిని అభిమానులు ఎవరయినా చూడకుండా ఉంటే తప్పక చూడండి . A feel good , watchable musical entertainer .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!