A must visit tourist spot……………………………
గుజరాత్ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన అద్భుత కట్టడం ఒకటి ఉంది. భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి అది. ఈ దిగుడు బావి 7 అంతస్తుల దేవాలయాన్నితిరగేసి నిర్మిస్తే ఎలా ఉంటుందో ?ఆ విధంగా భూమి లోపల నిర్మించారు. ఇదొక అపూర్వ కట్టడం అని చెప్పుకోవాలి. దీనిని “రాణి కి వావ్” అని పిలుస్తారు.
ఈ ‘రాణి కి వావ్’ చాళుక్య రాజవంశం పాలనలో నిర్మితమైంది. ఇది పటాన్ జిల్లాలో సరస్వతీ నది ఒడ్డున ఉంది. 1304లో జైన సన్యాసి మేరు తుంగ స్వరపరిచిన ప్రబంధ-చింతామణి లో దీని గురించి వివరించారు. ఈ మెట్ల బావి నిర్మాణాన్ని 1063 లో ప్రారంభించి .. 20 సంవత్సరాలలో పూర్తి చేశారు. దీనిని భీమ రాజు గారి జ్ఞాపకార్థం రాణి ఉదయమతి నిర్మించారు.ఈ మెట్లబావి కాలక్రమంలో సరస్వతి నదికి వచ్చిన వరదల కారణంగా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయింది.
1890లలో బ్రిటీష్ పురాతత్వ శాస్త్రవేత్తలు హెన్రీ కౌసెన్స్ , జేమ్స్ బర్గెస్ దీనిని గుర్తించారు. కొంత మేర బావి కొన్ని స్తంభాలు మాత్రమే కనిపించాయని చెప్పారు. దీనిని 285 అడుగులు లోతు భారీ గొయ్యిగా మాత్రమే ఆయన అభివర్ణించారు. అయితే 1940 లో అప్పటి బరోడా స్టేట్ ఆర్కియాలజికల్ సర్వే సంస్థ జరిపిన త్రవ్వకాల్లో ఈ మెట్ల బావిని గుర్తించారు. చివరిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1981 నుండి 1987 వరకు తవ్వకాలు.. పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. ఈ తవ్వకాల్లో రాణీ ఉదయమతి చిత్రం కూడా లభించింది. ఈ మెట్ల బావిని 22 జూన్ 2014న UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది.
@అప్పట్లో ఈ బావి నిర్మాణ ఆలోచనే అద్భుతం. దేవాలయాన్ని తిరగేసి అంటే ఇంగ్లీషు ‘V’ ఆకారంలో భూమిలో నిర్మిస్తే ఎలా ఉంటుందో .. ఆ మాదిరిగా 7 అంతస్తుల తో దీనిని నిర్మించారు. దీనిని 92 అడుగుల లోతు, పైన 213 అడుగుల పొడుగు, 66 అడుగుల వెడల్పు తో నిర్మించారు.
@ ఈ బావి ప్రతీ అంతస్థులో భారీ స్తంభాల ఆధారంగా మండపాలు నిర్మించారు. వీటిల్లో స్తంభాలు, గోడలు, పై కప్పులు పూర్తిగా చెక్కిన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ మెట్ల బావిలో మొత్తం 212 స్తంభాలు ఉన్నాయి.
@ ఈ శిల్పాలలో హిందూ దేవతలైన బ్రహ్మ , విష్ణువు , శివుడు , గణేశుడు , కుబేరుడు , భైరవుడు , సూర్యుడు , ఇంద్రుడు.. హయగ్రీవుడు, లక్ష్మీ , పార్వతి , సరస్వతి , చాముండి, క్షేమంకరి, సూర్యాణి, సప్తమాత్రికలు .. దుర్గ వంటి దేవీ దేవతల శిల్పాలు ఉన్నాయి. విష్ణువుకి సంబంధం ఉన్న శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. శిల్పాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి .. శేషశాయి, విష్ణువు, దశావతారాలు, నాగ కన్యలు, అప్సరసలు మొదలైనవి ఉన్నాయి.
@ దేవతలకు చెందిన శిల్పాలు మాత్రమే కాకుండా వివిధ జంతువుల, పక్షుల, జలచరాల, వృక్షాలకు చెందిన శిల్పాలు ఉన్నాయి. @ అంతే కాక అక్కడ స్థానిక చేతి వృత్తులు వారు బట్టల మీద వివిధ వస్తువుల చిత్రీకరించే రక రకాల గణిత రేఖాచిత్రాలు, డిజైన్లు అక్కడ చెక్కిన శిల్పాలలో చూడవచ్చు.
@ ఆ ప్రాంతంలో నాటి సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు కూడా చాలా వున్నాయి. అంటే స్త్రీలు తల దువ్వుకోవడం, వివిధ అలంకరణలు చేసుకోవడం, సేవకులతో పరిచర్యలు చేయించుకోవడం, నృత్య భంగిమలు మొదలగునవి ఉన్నాయి.@ ఈ శిల్పాలలో స్త్రీలు ధరించే కంకణాలు, చెవిపోగులు, హారాలు, నడుము నడికట్టు, చీలమండలు, సొగసైన బట్టలు, చక్కగా బాగా దువ్విన జుట్టు, వివిధ డిజైన్లు లో నగలు కనిపిస్తాయి. సుమారు 500 కంటే ఎక్కువగా ప్రధాన శిల్పాలు ఉంటే.. వెయ్యికి పైగా చిన్నవి ఉన్నాయి,
గుజరాత్ యాత్రలకు వెళ్లేవారు తప్పక చూడవలసిన అద్భుతమైన నిర్మాణం ఇది. పక్కాగా ప్లాన్ చేసుకుని వెళితే అన్ని చూసి రావచ్చు. పటాన్ కోట పట్టణంలో ఉన్న ఈ బావికి సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలో పటాన్ రైల్వే స్టేషన్ ఉంది.
ఆమధ్య భారత్ .. ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల కెప్టెన్స్ ఇద్దరూ ‘రాణి కి వావ్’ కట్టడం వద్ద వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని ప్రదర్శించారు. మన దేశంలోనే చాలా మందికి ఈ ‘రాణి కి వావ్’ కట్టడం గురించి తెలియదు.దీనికి ప్రచారం కల్పించే ఉద్దేశ్యం లో భాగంగా భారత ప్రభుత్వం నాడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసింది.