ఏమిటీ డర్టీ బాంబ్ ?

Sharing is Caring...

A new type of bomb…………………………………

ఉక్రెయిన్ పై రష్యా చేసిన ‘డర్టీ బాంబ్’ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజల్లో భయాన్నికూడా కలిగిస్తున్నాయి. రష్యా ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ తనిఖీ నిపుణులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఈ డర్టీ బాంబ్ ఏమిటో ?దాన్నిఎలా తయారు చేస్తారో చూద్దాం.

డర్టీ బాంబ్ తయారీలో యురేనియం వంటి రేడియో ధార్మిక పదార్థాలను వినియోగిస్తారు. దీనిలో అణుబాంబుల్లో వాడే శుద్ధి చేసిన రేడియో ధార్మిక పదార్థాలను వినియోగించరు. వైద్యశాలలు, అణు విద్యుత్తు కేంద్రాలు, పరిశోధనశాలల నుంచి తక్కువస్థాయి రేడియోధార్మిక పదార్థాలను సేకరిస్తారు.

వాటిని సంప్రదాయ పేలుడు పదార్థాలతో కలిపి పేల్చి వాతావరణంలోకి వెదజల్లుతారు. అత్యంత చౌకగా.. అణ్వాయుధాల కంటే వేగంగా వీటిని తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.  వీటిని సాధారణ వాహనాల వెనుక ఉంచి కూడా తరలించవచ్చు. ఈ బాంబ్ లోని రేడియోధార్మిక పదార్థాలు గాలిలో చాలా దూరం వ్యాపిస్తాయి.

ఈ డర్టీ బాంబు కేన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తుంది. అంతేకాదు.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఈ బాంబు పేలిన ప్రదేశం నుంచి చుట్టుపక్కల చాలా భూభాగాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీనిని డీకంటామినేషన్ చేయడం లేదా.. కొన్నేళ్లపాటు ఖాళీగా వదిలేయాలి.

ఈ డర్టీ బాంబులను మిలిటరీ వ్యవస్థలో ఉపయోగించరు. తీవ్రవాద గ్రూపులు ఉపయోగిస్తారని  భద్రతా నిపుణులు అంటున్నారు. ఏదైనా నగరం మీద ప్రయోగిస్తే ఆ నగరం మొత్తం కొన్ని దశాబ్దాలపాటు ప్రజలు జీవించడానికి పనికిరాదు. అందుకే డర్టీ బాంబులను  కూడా సామూహిక జనహనన ఆయుధాలుగా భావిస్తారు.

ఒక క్షిపణి లో కానీ విమానంలో కానీ దీన్ని అమర్చవచ్చు. అధునాతన పేలుడు పరికరంగా ఉపయోగించవచ్చని  వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్-ప్రొలిఫరేషన్  సంస్థ అంటోంది.  ఇది పూర్తిగా కాలుష్యాన్ని సృష్టించి … జనాలను  భయాందోళనలకు గురి చేస్తుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ కి  ఈ తరహా బాంబుల ను సృష్టించే శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యం ఉందని వాదిస్తోంది. ఈ డర్టీ బాంబులను తయారు చేసే సత్తా రష్యాకు ఉంది. 

కాగా పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ కి అందుతున్న సాయాన్ని తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయించడం కోసమే  రష్యా ఈ ఆరోపణలు చేస్తోందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వార్ స్టడీస్ చెబుతోంది. రష్యానే ఉక్రెయిన్లో డర్టీ బాంబ్ ను పేల్చే అవకాశముంది. అప్పుడు నింద ఉక్రెయిన్ పడవచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ బాంబు ప్రయోగించలేదు. కానీ కొన్ని ప్రయత్నాలు మాత్రం జరిగాయి. 1996లో చెచెన్ రెబల్స్ మాస్కోలోని ఓ పార్క్ సీసియం-137ను డైనమైట్ కు అనుసంధానించి పేల్చేందుకు విఫలయత్నం చేశారు. సీసియంను కేన్సర్ చికిత్స పరికరాల నుంచి వెలికితీశారు. భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది.

1998లో చెచెన్యా లోని రైలు మార్గంలో నిర్వీర్యం చేసిన ఓక డర్టీ బాంబ్ ను కనుగొన్నారు. తర్వాత కాలంలో ఒకరిద్దరు ఈ డర్టీ బాంబులను పేల్చే ప్రయత్నాలు చేసి దొరికి పోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని రెండు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!