బాబాజీ గుహల్లో ఏముంది ?

Sharing is Caring...

 Where did this Babaji come from?…………………

బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని  రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ  తపస్సు చేశారట.  ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి వాడో ఎవరికి తెలియదు. ఒక యోగిగా ఇక్కడ కొచ్చి తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారని అంటారు.

బాబాజీ తమిళనాడుకి చెందినవారని … చిన్న తనంలోనే ఇల్లు వదిలి వచ్చేశారని ,1861-65 మధ్యకాలంలో ఆయన చివరిసారి హిమాలయాల్లో కనిపించారని అంటారు. అలా ఆయన గురించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ‘క్రియా యోగం’, ‘క్రియా కుండలిని ‘ దీక్ష గురించి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ బాబాజీ యే అని ఆయన శిష్యులు చెబుతారు.

ప్రస్తుతం బాబాజీ బౌతికంగా లేకపోయినా నిరాకార రూపంలో అక్కడే సంచరిస్తున్నారని భక్తులు నమ్ముతారు. ఆయన అమరుడై ఇక్కడే ఉన్నారని .. ప్రియమైన భక్తులకు కనిపిస్తుంటారని భక్తులు అంటుంటారు. బాబాజీ తపస్సు చేసి తన శిష్యులకు ఉపదేశాలు ఇచ్చిన ప్రదేశం కావడంతో ఈ గుహలకు బాబాజీ గుహలు అనే పేరు వచ్చింది.

బాబాజీ శిష్యుల్లో లాహిరీ ప్రధాన శిష్యుడు. 1861 లో లాహిరి కి బాబాజీ దర్శనం లభించింది. లాహిరీ ఆయన శిష్యుడిగా మారిపోయి క్రియా యోగ విద్యను అభ్యసించారు.ఆయనే ఈ గుహలు ,క్రియాయోగం గురించి దేశానికి, ప్రపంచానికి పరిచయం చేశారు.

కాలక్రమంలో ఆ గుహలు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాబాజీ గుహాలుగా ప్రసిద్ధి చెందాయి.  ఈ గుహల్లో సందర్శకులు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు.. 8 మంది మాత్రమే అక్కడ ధ్యానం చేసుకునే అవకాశం ఉంది.

బాబాజీ గురించి పరమహంస యోగానంద  “ఒక యోగి ఆత్మ” కథ అనే ఒక పుస్తకం రాశారు. యోగానంద గురువు యుక్తేశ్వర్ గిరి కూడా బాబాజీ గురించి తన పుస్తకం ‘ది హొలీ సైన్స్’ లో వివరించారు.సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన “బాబా” సినిమా లో ఈ బాబాజీ ప్రస్తావన ఉంది. హిమాలయాల్లో కనిపించే మహా పురుషుని  రూపం పేరే బాబాజీ.

రజనీ కాంత్ ప్రతి ఏటా ఇక్కడ కొచ్చి కొన్నాళ్ళు ధ్యానం చేసుకుంటారు. అలాగే కొంతమంది ఉత్తరాది తారలు , రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తుంటారు. రాణిఖేత్ నుంచి కుకుచినా ప్రాంతానికి చేరుకుంటే అక్కడికి దగ్గరలోనే బాబాజీ గుహలున్నాయి. ఈ కుకుచినా లో జోషీ రెస్టారెంట్ చాలా పాపులర్. అక్కడ బస చేయడానికి వసతి సౌకర్యం కూడా ఉంటుంది.

ఆయనే యాత్రికులకు  గైడెన్స్ ఇస్తుంటారు. జొషీ రెస్టారెంట్ నుంచి 3 కిలోమీటర్లు నడవాలి. గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు.  దేశ రాజధాని ఢిల్లీ నుంచి బాబాజీ గుహలకు సులభంగా చేరవచ్చు. ఢిల్లీ నుంచి రాణికెత్ 400 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. అక్కడ నుంచి ద్వారహాట్ 35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడనుంచి కుకుచినా 20కిలోమీటర్లు దూరం. కుకుచినా నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి.  
 
———–  KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!