Bharadwaja Rangavajhala………………………… A director who made realistic films
సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న కోరికతో ఇండస్ట్రీ ప్రవేశం చేశారు బిఎస్ నారాయణ. ఆయన మిత్రులు ఆదర్శం అనే సినిమా తీస్తున్న రోజులవి. అంటే 1951 అన్నమాట. ఆ సినిమా ద్వారానే నారాయణ సినిమాల్లోకి వచ్చి పడ్డారు.
ఈయన స్వస్థలం కరీంనగర్. వరంగల్లుకు చెందిన ఎడిటరు, ఆదుర్తి దగ్గర సహాయకుడు టి. కృష్ణ ద్వారా సినిమా పరిశ్రమలో ప్రయాణించడం బిఎస్ నారాయణకు సాధ్యమైంది. ఆదర్శం తర్వాత కెఎస్ ప్రకాశరావు దగ్గర ‘మేలుకొలుపు’ చిత్రానికీ, తిలక్ దగ్గర ‘ముద్దుబిడ్డ’, ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాలకు అసిస్టెంటుగా పనిచేశారు.
‘కన్నకొడుకు’, ‘ఆలుమగలు’, ‘ముందడుగు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణారావు దగ్గర కూడా పనిచేశారు. ఆ తర్వాత సేలంకు చెందిన ఎమ్ ఎ వి లో రెండు చిత్రాలకు పనిచేయడంతో తొలి దర్శకత్వపు అవకాశం దొరికేసింది. ఆయన తొలి చిత్రం ‘మాంగల్యం’.తర్వాత సినిమా కాంతారావు నటించిన ‘ఎదురీత’. ఎన్టీఆర్ నటించిన ‘విశాల హృదయాలు’, ‘తిరుపతమ్మ కథ’ చిత్రాలు నారాయణే తీశారు.
‘ఓ కౌన్ థీ’ చిత్రం తెలుగు రీమేకు ‘ఆమె ఎవరు?’ చిత్రం బిఎస్ నారాయణ తీసినదే. ‘శ్రీదేవి’, ‘మేనకోడలు’, ‘శ్రీవారు మావారు’ ‘ఆనంద నిలయం’ , ‘అత్తను దిద్దిన కోడలు’ లాంటి కమర్షియల్ చిత్రాలు తీసిన బిఎస్ నారాయణ గారు ఆ తర్వాత రూటు మార్చి ‘ఊరుమ్మడి బ్రతుకులు’ అన్నారు. వాస్తవికవాద చిత్రాలు తీయడం రిస్కే అయినప్పటికీ తక్కువ ఖర్చుతో కనుక సినిమా తీస్తే రిటన్స తప్పకుండా బావుంటాయనేవారు నారాయణ.
స్టేజ్ మీద ఆడిన నాటకం సిఎస్ రావు రాసిన ‘ఉరుమ్మడి బతుకులు’ లాంటి సినిమాలు తీయాలి అనే ఆలోచన తాను ఇందస్త్రీలో కాలు పెట్టినప్పట్నించి ఉన్నా తమాయించుకున్నాను అని వారు ఓసారి బెజవాడ లక్ష్మీ టాకిసులో కలసినప్పుడు చెప్పారు.
లాయర్ అక్కిపెద్ది రమణ గారి తండ్రిగారి దగ్గరకు వచ్చేవారు ఈయన. రమణ తండ్రిగారూ లాయరే… ఏవైనా కేసులు ఉండి వచ్చేవారేమో .కమ్యూనిస్ట్ రాజకీయాలతో పరిచయం ఉన్నా…సాయుధ పోరాటం పట్ల కొన్ని రిజర్వేషన్స్ఉండేవి ఆయనకు. వ్యాపార చిత్రాలే కాదు అప్పుడప్పుడూ ఇలాంటి చిత్రాలూ తీయాల్సి ఉంటుందనేవారు.
‘ఊరుమ్మడి బ్రతుకులు’ తర్వాత ‘నిమజ్జనం’ కూడా వాస్తవిక వాద ధోరణిలోనే తీశారు. కంటిచూపు కోల్పోయిన తర్వాత ఆయన సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా పేరు ‘మార్గదర్శి’. బి.ఎస్ నారాయణ కు చలన చిత్ర ప్రవేశానికి సహకరించిన టి కృష్ణ కూడా ఎడిటింగు నుంచీ దర్శకత్వం వైపు వచ్చారు.
శోభన్ బాబుతో ఖైదీ బాబాయ్, మంచి బాబాయ్ లాంటి సినిమాలు తీశారు. ఆ తర్వాత ఇంకో టి.కృష్ణ రావడంతో … నారాయణరెడ్డి వీరిద్దరినీ గుర్తు పట్టడానికి కొత్త టి.కృష్ణను నేటి కృష్ణ అనీ పాత టి.కృష్ణను నాటి కృష్ణగానూ సంబోధించేవారు.