Nirmal Akkaraju………….. A warrior who fought for the protection of fundamental rights
కేశవానంద భారతి. ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక వాదిగానే చాలామందికి ఆయన తెలుసు. కానీ ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం ఆయన సుదీర్ఘకాలం కోర్టుల్లో పోరాడారన్న విషయం చాలామందికి తెలీదు.
ఆ స్వామి గురించి వివరాల్లోకి వెళితే …….
కేశవానంద 1961 నుంచి మొన్న మొన్నటివరకు ఎడనీర్ మఠాథిపతిగా ఉన్నారు . ఈ మఠం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కన్నడ, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాసంస్థలను ,వేదపాఠశాలను కేశవానంద భారతి నెలకొల్పారు.
కేశవానంద స్వయంగా కర్ణాటక ,హిందూస్థానీ సంగీతాల్లో ప్రావీణ్యం ఉన్నవారు. అలాగే మంచి రచయిత కూడా.యక్షగానం లో కూడా కేశవానంద అనుభవం సంపాదించారు. ఆది శంకరాచార్య శిష్యుల్లో ఒకరైన తోటకా చార్య శిష్య పరంపరలో ఒకరిగా ఎడనీర్ పీఠాన్ని కేశవానంద అధిరోహించారు.
ఇక కేశవానంద భారతి 1970 లో కేరళ ప్రభుత్వం తెచ్చిన భూ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడారు. న్యాయవిద్య చదివిన వారు కేశవానంద భారతి పేరు తలుచుకోకుండా పరీక్షలు రాయలేరు. అలాగే రాజ్యాంగ నిపుణులు ఈ కేసును ఉదహరించకుండా వాదించలేరు.
ఈ కేసును న్యాయవాద ఉద్దండులు ఫాలీ నారిమన్, సోలీ సొరాబ్జీ,ఫాల్కీవాలా లాంటి వారు వాదించారు.13 మంది న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం విచారించిన ఏకైక కేసు.68 రోజుల పాటు వాదనలు జరిగిన ఈ కేసుకు సిక్రీ ప్రధాన న్యాయమూర్తి గా ఉన్నారు.
ఈ కేసులో అటార్నీ జనరల్ వాదనలో సుమారు 73 దేశాల రాజ్యాంగాలను వివరించారట.మఠానికి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ స్వాధీనం కాకుండా కేసు వేయడం జరిగింది.ప్రజా ప్రయోజనాల కొరకు భూమి తీసుకుంటే ఆర్టికల్ 31 ప్రకారం కేసు పెట్టాలి,కానీ పాల్కీవాలా ఆర్టికల్ 26 ప్రకారం కేసు ధాఖలు చేయడం జరిగింది.అసలు ఆర్టికల్ 26 అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా మత సంబంధిత ఆస్తుల నిర్వహణ. దీని ప్రకారం తెలివిగా వేయడం జరిగింది.
ఈ కేసు లో పార్లమెంట్ కు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉందా అనే అంశం పై వాదనలు జరిగాయి. దీనిని ప్రధానంగా లాయర్లు ఉదహరిస్తారు.ఇక్కడొక తమాషా కూడా ఉంది.పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గోలక్నాధ్ కేసులో చెప్పారంటారు…ఆ గోలక్నాధ్ తీర్పు ప్రామాణికంగా తీసుకున్నారు..ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ కు రాజ్యాంగం సవరించే హక్కు ఉంది.
కానీ జడ్జిమెంట్ ప్రకారం మౌళిక స్వరూపం మార్చకూడదు తో పాటు ప్రవేశిక (preamble) రాజ్యాంగంలో భాగం అని తీర్పు నిచ్చారు.ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చిన ఒక న్యాయమూర్తి సీనియారిటీ లో నాల్గవ స్థానంలో ఉన్న జస్టిస్ ఎ.ఎన్ రే ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం గమనించదగినది.జస్టిస్ సిక్రీ ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా పోరాడిన రాజ్యాంగ యోధుడైతే,కేశవానంద భారతి రాజ్యాంగ పరిరక్షకుడు.
ప్రధానమంత్రి పై కేసులు లేకుండా ఇందిరాగాంధీ చేపట్టిన 39 వ సవరణ కొట్టివేయడానికి కేశవానందభారతి కేసు ఉపయోగపడింది.కేశవానంద భారతి కేసు తిరగతోడడానికి ఛీఫ్ జస్టిస్ రే ప్రయత్నించినా పాల్కీవాలా కేసు రివ్యూ చేయడానికి వీలు లేదని వాదించి కేసు మూసివేయించారు.
ప్రాధమిక హక్కుల రక్షణ విషయంలో కేశవానంద భారతి వేసిన కేసు దేశ న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.రాజ్యాంగం తో పోలిస్తే ప్రభుత్వ అధికారాలు పరిమితమని దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతం అని చాటింది. స్వామి కేశవానంద భారతి సెప్టెంబర్ పరమ పదించారు