Is there no protection in prisons?………………………….
నాగరిక సమాజంలో మహిళలపై ..బాలికలపై లైంగిక దోపిడీ జరగడం సర్వసాధారణమై పోయింది.బయట ప్రపంచంలో అంటే రక్షణ లేదని అనుకోవచ్చు. చివరికి పోలీసు పహారాలో ఉన్న కారాగారాల్లో ఉన్న మహిళా ఖైదీలపై కూడా లైంగిక దోపిడీ జరుగుతోంది. ఎంత ఘోరమైన దుస్థితి ?
పోలీసు వ్యవస్థ రక్షణలో శిక్ష అనుభవిస్తున్న మహిళలు జైళ్లలోనే గర్భం దాల్చి .. అక్కడే పిల్లలను కంటున్నారు. శిశువులతోనే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లోని కారాగారాల్లో .. కరెక్షనల్ హోమ్స్ లో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భం దాల్చిన వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి కలకత్తా హైకోర్టులో ఒక కేసు కూడా దాఖలు అయింది ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని జైల్లో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కారాగారాలలో మహిళా ఖైదీలు ఏకంగా 196 మంది పిల్లలకు జన్మ ఇచ్చినట్లు హైకోర్టు ఏర్పాటు చేసిన అమికస్ క్యూరీ కోర్టుకు నివేదికను సమర్పించింది మహిళా ఖైదీలు జైల్లో ఉండగానే గర్భం దాల్చి పిల్లలను ప్రసవిస్తున్నట్టు … పలు జైళ్లలో 196 మంది పిల్లలు పుట్టారని నివేదిక లో అమికస్ క్యూరీ ప్రస్తావించారు. ఈ సమస్య నివారణకు మహిళా ఖైదీలు ఉన్న ఎంక్లోజర్లలోకి పురుష ఉద్యోగులు ప్రవేశించకుండా నిషేధాన్ని ప్రతిపాదించారు.
అమికస్ క్యూరీ ఇచ్చిన మరో సూచన ఏమిటంటే దిద్దుబాటు గృహాలలో ఉన్న సమయంలో ఎంతమంది మహిళా ఖైదీలు గర్భం దాల్చారో ? తెలుసుకునేందుకు అన్ని జిల్లాల న్యాయమూర్తులు వారి అధికార పరిధిలోని హోమ్స్ ను సందర్శించి సమాచారాన్ని తెలుసుకోవాలి. అలాగే ఖైదీలపై లైంగిక దోపిడిని అరికట్టేందుకు మహిళా ఖైదీలను కారాగారాలకు పంపే ముందే వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్ని జిల్లాల న్యాయమూర్తులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలి.
పశ్చిమ బెంగాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ద్వారా ఈ గర్భ పరీక్షలను నిర్వహించాలి.. ఈ మేరకు న్యాయస్థానం అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అమికస్ క్యూరీ నివేదిక పేర్కొంది. క్రిమినల్ కేసులను విచారిస్తున్న డివిజన్ బెంచ్ ముందు ఈ కేసును ఉంచారు.వచ్చే సోమవారం విచారణకు రానుంది. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి ..

