An unprecedented event…………..
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి సోమవారం ప్రాణప్రతిష్ట జరగనుంది. ఇప్పటికే బాల రాముడి విగ్రహాన్ని గర్భ గుడిలోకి చేర్చారు. పెద్ద కృష్ణశిలపై చెక్కిన బాల రాముడి విగ్రహం ముగ్ధ మనోహరంగా ఉంది. అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉంది. బాల రాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ అద్భుతంగా ఉన్నాడు. చేతిలో బంగారు విల్లు, బాణం అదనపు ఆకర్షణలు.
వీటిని అయోధ్యలోని అమావా రామాలయం బహుమతిగా పంపింది. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ 51 అంగుళాల విగ్రహాన్ని రూపొందించారు..ప్రస్తుతం విగ్రహం కళ్లను పసుపు వస్త్రంతో కప్పి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఆలయ ట్రస్ట్ మూడు విగ్రహాలు తయారు చేయించగా.. వాటిల్లో అరుణ్ యోగిరాజ్ మలచిన బాల రామయ్య విగ్రహం ఎంపిక అయింది. రామయ్య చిన్నతనంలో ఇలాగే ఉండేవారా అన్నట్లు జీవం ఉట్టి పడటం ఈ విగ్రహం ప్రత్యేకత.
ప్రతిష్ఠాపన ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో రామయ్యకు కానుకలు,బహుమతులు పెద్ద ఎత్తున అందుతున్నాయి. ప్రధాని మోదీ రామాలయాన్ని సోమవారం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న మోదీ 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేస్తున్నారు. ప్రధాని కఠిన నియమాలను పాటిస్తున్నారు.
యోగా, ధ్యానంతో పాటు కఠినమైన కొన్ని ఇతర ప్రక్రియలను ఆచరిస్తున్నారు. బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొని .. కాలకృత్యాలు ముగించి , ధ్యానం, సాత్వికాహారం తీసుకోవడం మోదీ దినచర్యలో భాగంగా మారాయి. మోదీ ఈ 11 రోజులూ నేలపైనే నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరినీళ్ల ను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.