కొన్నిపాటలు మనసుకు హత్తుకు పోతాయా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………

Heart touching songs……………………………..

కొన్ని పాటలు అంతే.మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు.లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు…’కలనైనా నీ వలపే’ … పాట తొలిచేస్తాందని చెప్పానుగా …ఈ పాటలో ..’కళలూ కాంతులు నీ కొరకేలే’ అని లీలగారు పాడేప్పుడు …ఠక్కున మనసు’ రామకథను వినరయ్యా ‘లోకి దూకేస్తుంది.

అదే లైనును పై స్థాయిలో కాక కోమలంగా పాడినప్పుడు అదే మనసు ‘పూజాఫలం’లో … ‘పగలే వెన్నెల’ లోకి జారుతుంది. ఏమిట్రా ఈ గోల అని తరచి చూడగా …ఈ పాటలు హిందోళంలో స్వరపరచారు అని అర్ధమవుతుంది.ఈ హిందోళం అనే రాగమేదైతే ఉందో … అది చాలా హంటింగ్ స్వీటు రాగమన్నమాట …

బాదం బర్ఫీ తింటున్నప్పుడు ఇంకో రెండు అయినా పర్లేదని ఎన్ని తిన్నా అనిపిస్తుంది కదా అలాన్నమాట … ఇలా ఆవేశపడి తినేసి ఆరోగ్యాలు పాడుచేసుకుంటారనే దాని రేటు కాస్త ఎక్కువ పెట్టారు తప్ప మిఠాయి కొట్టు వాళ్ల స్వార్ధం ఏ మాత్రం లేదనే చెప్పాలి.

ఇంకా… ఈ హిందోళ రాగంలో నాయనా …అన్నీ కూడానూ కోమల స్వరాలే …అందువల్ల రుచిగా తీయగా ఉండుద్దన్నమాట … అంచేత మనాళ్లు కరుణ, భక్తి, శృంగార రసాలను ఆవిష్కరించడానికి ఠక్కున ఈ రాగంలోకి వెళ్తారన్నమాట … అవ్విధంబుగా … హిందూస్తానీ సంగీతంలోని “మాల్‌కోన్స్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని హిందోళం రాగానికి సమానం అంటారు పెద్దలు. నాకు పెద్దగా తెల్దు .

సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అనే కుర్రాడూ …ఎక్కువగా హిందూస్తానీ పోకడల్లోనే స్వరాలు కూర్చేవారు. కారణం ఏమిట్రా భగమంతుడా అంటే ఆయన రంగస్థలం నుంచీ రావడమే … అన్జెప్పాడు భగమంతుడు. అంటే ఏంటీ ?

మన నాటకాల్లో ఉండేటువంటి పాటలకు పారశీక సంగీతం ప్రేరణగా ఉండేది …ముఖ్యంగా నాటకం లో కానీ సినిమా లో కానీ…పాట సంభాషణాత్మకంగా సాగాలి… కనుక ఖవ్వాలీ తరహా ట్యూనులను అధికంగా ఉపయోగించుకునేవారు …

అంచేత గురువుగారికి అలా అవి ఒంటపట్టాయి. “మాల్‌కోన్స్‌” రాగంలో కంపోజ్ చేయడం వల్లనే ‘సువర్ణ సుందరి’ సినిమాలో ‘పిలువకురా అలుగకురా’… అంటూ సుశీల గారు పాడిన పాట కూడా మనకి ‘కలనైనా నీవలపే’ కు దగ్గరగా అనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ‘సమయము కాదురా’ అన్న దగ్గర మనకి ఠక్కున ‘కలనైనా నీ వలపే’ గుర్తొస్తుంది.

ఆ సంగతి అలా వదిలిపెడితే …తెలుగు సినిమాల్లో హిందోళాన్ని అధికంగా వాడుకున్న సంగీత దర్శకుల్లో ఘంటసాల , రాజేశ్పర్రావు లు ముఖ్యులు. ఆ విషయం నాకు లీలగా గుర్తుంది అని ఎవరేనా అంటే.. ఏడ్చావులే … ఘంటసాలలా గుర్తు లేదూ అనే వారు కదా …ఊర్నే జోగ్గా … అలా … లీల అనే ఆవిడ పాడే పద్దతి ఘంటసాల గారు పాడే పద్దతికి ఒక రకమైన అనుసరణలానే అనిపిస్తుంది.

ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఘంటసాల అన్నమాట …దీనికి కారణం ఆ మధ్య భార్గవి గారు వివరించారు. ఇలాంటి అనుసరణలు సినిమాల్లో చాలానే కనిపిస్తాయి. ఉదాహరణకి … ‘కాంచన’ అనే హీరోయిన్ను డైలాగు చెప్పే పద్దతి అక్కినేని నాగేస్పర్రావు ఇమిటేషన్ లోనే నడుస్తుంది …అబ్జర్వ్ చేయండి .. తెల్సిపోతుంది …

అట్టాగే …కమలహసనూ అనబడే మహా నటుడు డైలాగు చెప్పే పద్దతి వీరోయిన్ లక్ష్మి అని ఒకావిడ ఉండుద్ది కదా ..ఆ మధ్య ఏదో బేబి సినిమాలో కూడా ఏసింది కదండీ ఆవిడ డైలాగ్ చెప్పే పద్దతిలోనే నడుస్తుంది … ఇట్టా బోల్డు మంది ఉన్నారు. అయినా నాకెందుకు ..

ఇలా ఈ కలనైనా పాటను పట్టుకుని ఏడుస్తున్నాను ఎప్పుడైనా సరే ఈవాళ్టికి ఇంతే … అనుకోవడమే…రేత్రికి నిద్రలోగానీ ఇది వదల్దు … చిన్నప్పుడు పొద్దున్న లేవగానే మెడ నెప్పిగా ఉంది ఉంటే … మా అమ్మ అనేదీ … నిద్రలో పట్టేసి ఉంటుంది … అది నిద్రలోనే పోవాలి … పట్టించుకోకు స్నానం చేసి బడికి బయల్దేరు అని … అలాన్నమాట …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!