ఈ కార్డిసెప్స్ కథేమిటి ?

Sharing is Caring...

Cordyceps…………………… 

ఫొటోలో కనిపించే వాటిని కార్డిసెప్స్ అని పిలుస్తారు. పుట్టగొడుగుల రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ (Himalayan Gold) అని కూడ అంటారు.అత్యంత అరుదుగా లభించే ఈ కార్డి సెప్స్ కు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులు గా కనిపించే వీటిని సూపర్ మష్రూమ్స్ అని కూడా పిలుస్తారు. ఔషధాలలో వినియోగించే ఈ కార్డిసెప్స్ అత్యంత ఖరీదైనవి. బంగారం కంటే వీటి ధర ఎక్కువ.కార్డిసెప్స్ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లకు (రూ. 56 వేలు) ఉంటుంది.సహజసిద్ధంగా హిమాలయాల్లో దొరికే అత్యంత నాణ్యమైన రకం ధర లక్షల్లో (సుమారు కిలో ₹10 లక్షల నుండి ₹15 లక్షల వరకు) ఉంటుంది. 

భారత్లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై – టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.ప్రధానంగా 3000 మీటర్ల ఎత్తులో ఉన్న గడ్డి భూముల్లో క్వింఘై, టిబెట్, సిచువాన్, గన్సు, యునాన్‌లలో పెరుగుతాయి.

చైనాలో వీటి సాగు ఎక్కువగా ఉంది. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందంజలో ఉంది. కార్డిసెప్స్ సినెన్సిస్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో బాగా పెరిగింది. దీని మార్కెట్ వాల్యూ 2023లో $1.12 బిలియన్లు కాగా, 2024లో $1.23 బిలియన్లకు పెరిగింది.

అయితే అత్యధికంగా ఉత్పత్తయ్యే కింగై ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా వీటి సాగు బాగా తగ్గిపోయింది. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. చైనా ఆయుర్వేద మందుల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.

ఈ కార్డిసెప్స్‌ అలసటను తగ్గిస్తాయి. శరీరానికి బలం చేకూరుస్తాయి.సెక్స్ డ్రైవ్‌ను పెంచే వయాగ్రా మందుల్లో కూడా ఈ కార్డి సెప్స్ ను వాడుతారు. అలాగే యాంటీ ఏజింగ్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతాయి. జ్ఞాపకశక్తి ని మెరుగు పరుస్తాయి. వీటిని పొడి చేసి వివిధ ఔషధాల్లో మిక్స్ చేస్తారు.

ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, చర్మం, కాలేయ క్యాన్సర్‌లతో సహా అనేక రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ కార్డిసెప్స్ పేరుతో రకరకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. ఆ మధ్య వీటిని అన్వేషిస్తూనే అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఇండో – పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్స్ (IPCSC) సంస్థ ప్రకటించింది. అడవుల సంరక్షణకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఇండియాలో వీటి గాలింపు చర్యలపై నిషేధం విధించారు.అయినా దొంగ చాటుగా వీటికోసం వెతుకుతూనే ఉంటారు.

2018లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనిని ‘నాన్-టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్’ (NTFP) గా గుర్తించి, స్థానిక గిరిజనులు, గ్రామస్థులు నిబంధనల ప్రకారం సేకరించి విక్రయించుకోవడానికి చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించింది.

ల్యాబ్‌లలో కృత్రిమంగా పెంచే కార్డిసెప్స్ మిలిటారిస్ (Cordyceps Militaris) సాగుపై ఎలాంటి నిషేధం లేదు. ప్రస్తుతం ఐ.సి.ఏ.ఆర్ (ICAR) వంటి ప్రభుత్వ సంస్థలే దీని సాగును ప్రోత్సహిస్తూ రైతులకు శిక్షణ ఇస్తున్నాయి.. ప్రధానంగా కార్డిసెప్స్ మిలిటారిస్  అనే రకాన్ని ల్యాబ్ లేదా గదుల్లో కృత్రిమ వాతావరణంలో సాగు చేస్తున్నారు.ఎండిన పుట్టగొడుగులు (Dried Mushrooms) పౌడర్ లేదా హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్ రూపంలో ఎగుమతి కూడా చేస్తున్నారు.

post up dated on 29-12-25

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!