Govardhan Gande …………………………………………..
విద్యార్థులు నష్టపోకుండా అవి నకిలీ యూనివర్శిటీలు అని UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది.ఆ సంస్థలు ఇచ్చే పట్టాలు /డిగ్రీలు పై చదువులు చదవడానికి, ఉద్యోగావకాశాలకు పనికిరావని/ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది యూజీసీ. ఇప్పటికైనా ఈ సంగతిని చెప్పి యూజీసీ మంచి పని చేసింది.
విద్యార్థులు తమ సమయాన్ని,డబ్బును,జీవితాన్నినష్టపోకుండా అప్రమత్తం చేసే ప్రకటన ఇది. (గతంలో ఇలాంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అనేక మంది తమ డబ్బు,సమయాన్ని వృధా చేసుకొని మోసపోయిన ఉదంతాలు చాలానే ఉన్నాయి.) అయితే ఈ సంస్థలు నకిలీవైతే వాటిని నియంత్రించే,నిలువరించే వ్యవస్థ ఏమి చేస్తున్నట్లు. అలాంటి వ్యవస్థ ఉనికిలో ఉన్నట్లా? లేనట్లా ? ఒకవేళ ఉంటే ఆ వ్యవస్థ తన విధిని మరచిపోయినట్లు భావించాలా ? అదీ కాకుండా చర్యలు తీసుకోగలిగే అధికారాలు లేని వానపాము లాంటి సంస్థనా?
ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఆ 24 లో 7 యూనివర్సిటీలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నాయట మరో 8 యూనివర్సిటీలు ఢిల్లీకి అనుకొనే ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాయి. ఒక యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉందట! ఇంత బహిరంగంగా యూనివర్సిటీల బోర్డులను తగిలించుకుని దందా/వ్యాపారం చేసుకుంటూ ఉంటే నియంత్రించలేని దీనావస్థలో మన వ్యవస్థ ఉందని భావించాలా? ఇక్కడ ఇంకో సంగతి ని కూడా ప్రస్తావించాలి.
యూజీసీ ఈ ప్రకటనను తనంతట తానుగా చేయలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు ప్రజలు, పత్రికలు చేసిన పలు పిర్యాదులను పరిశీలించి విచారించి ఈ నకిలీల జాబితాను ప్రకటించిందట! ఎంత ఘనమైన వ్యవస్థనో కదా. ఈ స్థితిని తప్పకుండా అభినందించాలి కదా?
నకిలీ సంస్థల వివరాలు ……
ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా ఎనిమిది నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి – వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి; మహిళా గ్రామ విద్యాపీఠం, అలహాబాద్; గాంధీ హిందీ విద్యాపీఠ్, అలహాబాద్; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీఘర్; ఉత్తర ప్రదేశ్ విశ్వవిద్యాలయ, మధుర; మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్ … ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా.
ఢిల్లీలో నకిలీ యూనివర్సిటీలు ఏడు ఉన్నాయి – కమర్షియల్ యూనివర్సిటీ , యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఎడిఆర్ సెంట్రిక్ జుడిషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం.
ఒడిషా …. పశ్చిమ బెంగాల్లో రెండు విశ్వవిద్యాలయాలు చొప్పున ఉన్నాయి. అవి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా, అలాగే నవ భారత్ శిక్షా పరిషత్, రూర్కెలా… నార్త్ ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ.
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి చొప్పున నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అవి – శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి; క్రైస్ట్ న్యూ టెస్టా మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ.. ఆంధ్రప్రదేశ్; రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగపూర్; సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కేరళ … బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కర్ణాటక.