PMVVY Scheme……………………………
రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా.? అయితే ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే. ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరుతో ప్రారంభించిన ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చూస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు.
ఈ పథకంపై ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో భాగంగా గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం పదేళ్లు. రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 9250 గ్యారంటీ పెన్షన్ పొందొచ్చు.
ఈ పథకం వచ్చే ఏడాది(2023) మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి పెన్షన్ పొందటానికి కూడా పలు ఆప్షన్స్ ఉన్నాయి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కొకమారు చొప్పున పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎంచుకున్న ఆప్షన్ బట్టి వడ్డీ రేటు మారుతుంది. నెల వారీ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే 7.40 శాతం, మూడు నెలలకు 7.45 శాతం, ఆరు నెలలకు 7.52 శాతం, ఏడాదికి 7.66 శాతం వడ్డీ లభిస్తుంది.
ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పటి వరకు పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఈ పథకంలో నెలకు కనిష్టం రూ. 1000 , గరిష్టం రూ. 9,250 వరకు పెన్షన్‌ను అందిస్తారు. ఇక పథకం గడువు కాలం ముగిశాక పాలసీదారుడికి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.
PMVVY కింద పెన్షన్ మీరు స్కీం లో చేరిన తేదీ నుండి 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు లేదా 1 నెల తర్వాత ప్రారంభమవుతుంది. ఉదాహరణకు మీరు నెలవారీ పెన్షన్ చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటే, మీరు ఇప్పుడు స్కీమ్‌ను కొనుగోలు చేస్తే 1 నెల తర్వాత మీ పెన్షన్ ప్రారంభమవుతుంది.
PMVVY కింద కనీస పెన్షన్ నెలకు రూ. 1000 కాగా, గరిష్ట పెన్షన్ నెలకు రూ. 9250. ఈ పథకం కింద లభించే కనీస కొనుగోలు ధర నెలవారీ పెన్షన్‌కు రూ.1,62,162, త్రైమాసిక పెన్షన్‌కు రూ.1,61,074, అర్ధవార్షిక పెన్షన్‌కు రూ.1,59,574, వార్షిక పెన్షన్‌కు రూ.1,56,658 కట్టాలి.
ఈ పథకం కింద లభించే గరిష్ట కొనుగోలు ధర నెలవారీ పెన్షన్‌కు రూ. 15 లక్షలు, త్రైమాసిక పెన్షన్‌కు రూ. 14,89,933, అర్ధ-వార్షిక పెన్షన్‌కు రూ. 14,76,064 , వార్షిక పెన్షన్‌కు రూ.14,49,086 కట్టాలి. PMVVY ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి సీనియర్ సిటిజన్ రూ. 15 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు అనుమతి లేదు . పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేయవచ్చు. పిల్లలు పెద్దల పేరిట ఈ స్కీం ను తీసుకోవచ్చు. పేరెంట్స్ కి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.