సమాధులకు పూజలు !

Sharing is Caring...

శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు.

సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి నృత్యాలు చేస్తారు. అది అక్కడి ప్రజల ఆచారమట.2 రోజుల పాటు జరిగే ఆ వేడుకలు ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో జరుగుతాయి.

మంచి భవిష్యత్తు, ఉద్యోగం, ఆరోగ్యం కోసం సమాధులవద్ద పెద్దలను ప్రార్థిస్తారు హైతీవాసులు. కొందరైతే సమాధులపై మద్యం పోసి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిని ‘ఊడూ’ సంప్రదాయమంటారు. కొందరు భక్తితో మైమరిచిపోయి నృత్యాలు చేస్తారట.

మరికొందరు సమాధుల ముందు నిశ్శబ్దంగా నిల్చొని.. తమకు సహాయం చేయాలని ఆత్మలను వేడుకుంటారు.క్రైస్తవ సిద్ధాంతాలు, బానిసలతో కూడిన ఆఫ్రికన్ మతాల కలయిక ఈ ఊడూ. ఈ సంప్రదాయాన్ని హైతీలోని దాదాపు 90 లక్షలమంది పాటిస్తారు.

ఇది క్షుద్ర పూజలకు సమానమని.. అనేక మంది ఊడూను కొన్నేళ్ల పాటు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఊడూకు పెరుగుతున్న ఆదరణ వల్ల 2003లో అక్కడి ప్రభుత్వం ఈ సంప్రదాయం ఒక మతంతో సమానం అని ప్రకటించింది.

క్రైస్తవ మత స్వీకరణ(బాప్తిజం), వివాహాలు చేయించడానికి అక్కడి పూజారులకు అనుమతినిచ్చింది. దీంతో అక్కడి ప్రజలు ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.  సరిగ్గా అదే రీతిలో కాకపోయినా కొంచెం అటు ఇటుగా చాలా దేశాల్లో ఇలాంటి ఆచారాలు అమలులో ఉన్నాయి. 

ఇక మనదేశంలో కూడా అక్కడక్కడా ఇలాంటి ఆచారాలు కొనసాగుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఆ ఆచారాలు ఉన్నాయి. ఈస్టర్ వేడుకల సందర్భంగా చాలామంది క్రైస్తవులు తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తారు. ప్రార్ధనలు చేస్తారు. ముస్లిములు కూడా రంజాన్ సందర్భంగా పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్ధనలు చేస్తుంటారు. 

కర్నూల్ జిల్లాలోని గోనెగండ్ల మండలం పంచాయితీ లోని అయ్యకొండ లో ఒకే తెగకు చెందిన 620 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఊర్లో దాదాపు 90 ఇళ్ళు ఉండగా ప్రతి ఇంటి ముందు సమాధులు కనిపిస్తాయి. పెద్ద వాళ్ళు ఎవరు మరణించినా ఇళ్ళముందే సమాధులు కట్టించుకుంటారు.

ప్రతి శనివారం ఈ సమాధుల ముందు దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఉదయం సమాధులముందు నైవేద్యం పెట్టకుండా ఏమి తినరు. పెద్దలను చూడటమే కష్టంగా భావిస్తున్న ఈ రోజుల్లో సమాధులను కూడా జాగ్రత్తగా చూసుకోవడం గొప్ప విషయమే.

కరీం నగర్ లో కార్ఖానా గడ్డ సమాధుల వద్ద కూడా దీపావళి రోజున పెద్దలను తలచుకుంటూ పూజలు చేస్తారు. పెద్ద ఎత్తున జనం పాల్గొంటారు. పండుగ కు ముందే మునిసిపాలిటీ వారు సమాధులను శుభ్రం చేస్తారు. లైటింగ్ ఏర్పాటు చేస్తారు.

ఆ పండుగ రోజు పెద్దలకు ఇష్టమైన ఆహారపదార్ధాలను తయారుచేసుకొని వచ్చి నైవేద్యంగా పెడతారు. దూర ప్రాంతంలోఉన్న బంధువులు కూడా ఈ కార్యక్రమాలకు వస్తారు. చివర్లో సమాధుల దగ్గరే టపాసులు కాలుస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!