ఈ చరిత్ర ఏ ఉలితో ? -1

Sharing is Caring...

 Thopudu Bandi Sadiq Ali …………………………………

‘శిలల పై శిల్పాలు చెక్కినారూ ‘ పాట గుర్తుంది కదూ. శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న దేవుని గుట్ట ఆలయం పైన శిల్పాలు చూసి అదే అనుమానం నాకూ వచ్చింది.

కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు భారత దేశం మొత్తం మూడుసార్లు చుట్టి వచ్చిన నాకు ఇలాంటి శిల్పాలు ఎక్కడా కనిపించ లేదు.అందుకే వాటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.వీటి మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాను. అందుకు గాను అక్కడ ఉన్న నేపధ్యాన్ని కాస్త వివరిస్తాను.నా దృష్టికి వచ్చిన విశేషాలు అందజేస్తున్నాను. 

దేవునిగుట్ట మీద ఉన్న ఆలయం ఏ కాలానిదో అంచనా వేయలేక పోతున్నా. చతురస్త్రాకారంలో ఉన్న ఒకే ఒక గది 12X12 ఉంటుంది.  పైకి వెళ్తున్న కొద్దీ సన్నగా గోపురం ఆకృతి సంతరించు కుంటుంది. కానీ,దానికి గోపుర లక్షణాలు లేవు. దాని నిర్మాణానికి ఉపయోగించిన మెటల్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.రాయి కాదు,ఇటుక కాదు,కనీసం చెక్క కూడా కాదు.మరేమిటి?

ఆ గుట్ట మీద రెండు రకాల రాళ్ళు ఉన్నాయి.మొదటి రకం మామూలు గుండు రాళ్ళు.ఒక్కోటి సుమారు 10 నుంచి 15 కిలోల బరువు ఉండొచ్చు.అలాంటి రాళ్ళు అన్నీ ఒకదానిమీద మరొకటి పేర్చి కోట గోడలా నిర్మించారు.ఇది శాశ్వత కట్టడం కాదు.ఒక రాయికి,ఇంకో రాయికి ఎలాంటి జాయింట్ లేదు.వేటికవి విడివిడిగానే ఉన్నాయి.ఇక రెండో రకం రాళ్ళు…వీటికే ప్రత్యేకత ఉంది.

ఇవి చాలా పెద్ద సైజుల్లో భూమిలో పాతుకోనిపోయి గుట్టల్లా ఏర్పడ్డాయి.ఇసుక,గులకరాళ్ళు,ఇనుప రజను కలిపి ముద్ద చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి.మరీ ధృడంగా ఉండవు.మరో గట్టిరాయి తీసుకొని కొడితే పప్పుపప్పు అవుతాయి.అచ్చం ఇలాంటి రాళ్ళే మల్లూరు గుట్టల్లో ఉన్నాయి. అక్కడ ఆ రాళ్ళను పిండి చేసి దాన్ని గుండ్రటి ఆకారంగా మలిచి సమాధుల పైకప్పులుగా వినియోగించారు.ఇక్కడ దేవుని గుట్ట మీద ఈ రాళ్ళను మరో రకంగా వినియోగించారు.అదే ఈ ఆలయ విశిష్టత.

ముందు ఈ రాళ్ళను పెద్దఎతున సేకరించి ,పగులకొట్టి పిండి పిండి చేశారు. ఆ పిండిని ప్రత్యెక ద్రావకంతో తడిపారు. తరువాత వాటిని అచ్చు పోశారు.ఒక్కొక్కటీ రెండు అడుగుల పొడవు,రెండు అడుగుల వెడల్పు,ఎనిమిది అంగుళాల ఎత్తూ ఉన్నాయి.(సౌలభ్యం కోసం వీటిని పలకలు అని వాడతాను)

వీటితో ఆలయ ప్రహరీ గోడ కట్టారు.వీటి మీద ఎలాంటి శిల్పాలూ,బొమ్మలూ లేవు.ప్లెయిన్ గా ఉన్నాయి. రెండు అడుగులకు మించి మరింత పెద్ద సైజులో చేస్తే పటిష్టత కోల్పోయి విరిగే అవకాశాలు ఉండటం దీనికి కారణం కావచ్చు.

ఇక ఆలయ గోపురం గురించి చూద్దాం. దీని గోడలు రెండు వరుసల పలకలతో కట్టారు.వీటికి ఉన్న ప్రత్యేకతే ఈ ఆలయ విశేషం.ఒక వరుస పలకల ముఖం బయటికి,మరో వరుస పలకల ముఖం లోపలి వైపుకి ఉన్నాయి.

ప్రతీ పలక మీద ఏదో ఒక శిల్పం ఉంది.లోపలా,బయటా ఎటు చూసినా శిల్పాలే కనిపిస్తాయి.ఒక్క పలక కూడా ఖాళీగా లేదు.ఒక్కో శిల్పం ఎనిమిది,ఆరు,నాలుగు,రెండు అడుగుల ఎత్తు ఉంది.పలక సైజు రెండు అడుగులు,శిల్పం సైజు ఆరు,ఎనిమిది అడుగులు.మరి ఇది ఎలా సాధ్యం?ఇక్కడే ఎక్కడా లేని ప్రతిభ కనబరిచారు. (మిగతాది రెండో భాగంలో చదవండి ). 

PL.READ IT ALSO ……………………... ఈ చరిత్ర ఏ ఉలితో ?-2

Sharing is Caring...
Support Tharjani

No Responses

error: Content is protected !!