వేటపాలెం స్పెషాలిటీ ఏమిటో ?

Sharing is Caring...

ఊరి పేరే చిత్రం గా ఉందికదా. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. అలాగే “ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట” అనే సామెత కూడా ఈ ఊరు పేరు మీద వాడుకలో ఉంది.

వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపి, నౌకా కేంద్రాల్లో కెల్లా మహానౌకా కేంద్రంగా వెలుగొందిన మోటుపల్లి ఉన్నది. ప్రస్తుతం మోటుపల్లి ఒక సామాన్య కుగ్రామంగా మిగిలిపోయింది. ఇక చీరాలకు కేవలం 6 కి.మీ. దూరంలో వాడరేవు బీచ్ ఉంది. ఇక్కడి వాతావరణం కేరళను తలపిస్తుంది. ఈ వాడరేవు పై మరింత శ్రద్ధ పెడితే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.

ఇక వేటపాలెం విషయానికొస్తే ఇటు చీరాల కి అటు ఒంగోలు కి మధ్యలో ఉంటుంది. ఇది మండల కేంద్రం. సముద్ర తీరం నుండి 4.5 కి.మీ. దూరంలో ఉంటుంది.వేటపాలెం జీడిపప్పు కి ప్రసిద్ధి గాంచిన ఊరు. అలాగే 1918 లో స్థాపించిన పెద్ద గ్రంథాలయం కూడా ఇక్కడ ఉంది. ఈ వేటపాలెం జీడిపప్పు కి దేశవిదేశాల్లో చాలా పేరుంది.

జీడిపప్పు పకోడీ..జీడిపప్పు ఉప్మా..జీడిపప్పు మిఠాయి..జీడిపప్పు పాకము..జీడిపప్పు మసాలా…జీడిపప్పు మిక్చరు.ఇలా రకరకాలుగా చేసుకుని జీడిపప్పు ని తినవచ్చు. చెబుతుంటేనే నోరు ఊరుతుంది కదా…జీడి పప్పు రుచే రుచి. ఈ పప్పును వేయించి కానీ పచ్చిగా కానీ తినవచ్చు.

వేరుశనగ …. బాదం పప్పు తో పోలిస్తే జీడి పప్పు ఖరీదు ఎక్కువ. ఇపుడు రెండు దాదాపుగా సమానమైనాయి. భారతీయ వంటకాలలో చాలా వాటిలోజీడి పప్పు వాడతారు, పిండి వంటల్లోకూడా వినియోగిస్తారు.థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పును ఉపయోగిస్తారు.

గోవాలో జీడి పండుని నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతంలో జీడి పండుని ఎండబెట్టి నిల్వచేస్తారు.

తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి… బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తయారు చేస్తారు. దీని పేరు గంగో అంటారట. ముఖ్యంగా వెట్ పార్టీలలో జీడిపప్పు ను ఇష్టంగా ఆరగిస్తారు. ప్రకాశం జిల్లా వేటపాలెం ఫైన్ క్వాలిటీ జీడిపప్పు కి ప్రసిద్ధి.విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.

పూర్వం స్థానికంగా పంట ఎక్కువగా వుండేది. ఇప్పుడు తగ్గింది. వ్యాపారులు ఇతర ప్రాంతాలనుంచి జీడిపప్పు తెప్పించుకొని, సైజుల వారీగా గ్రేడింగ్ చేసి, ప్యాకింగ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ 30 వరకు జీడిపప్పు పరిశ్రమలుండేవి. మాంద్యం ప్రభావంతో నష్టాలు రావడంతో వాటిలో కొన్నిమూత బడ్డాయి.

దీంతో కార్మికులకు కష్టకాలం మొదలైంది. ఇదివరలో వేటపాలెంలో 50 షాపులుండగా కొన్ని దుకాణాలు మాంద్యం కారణంగా ఎత్తేసారు. జీడీ పప్పు కు డిమాండ్ తగ్గడంతో వ్యాపారం కుంటుపడింది. ఇక కరోనా నేపథ్యంలో గత కొద్ది నెలలుగా పరిస్థితి చెప్పనక్కర్లేదు.

ఇక్కడ పరిశ్రమలో బాలకార్మికులు ఎక్కువగా ఉండేవారు. అందరూ జీడిపప్పు పరిశ్రమలో పని చేసేవారు. వాళ్ళను బడి బాట పట్టించడానికి మా హెల్ప్ ఎన్జీవో ద్వారా 2006నుంచి ఒక మూడేళ్లు పాటు పని చేసాం. పిల్లల్లో చైల్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేసాం. వాళ్లకు బాలల హక్కులు గురించి నేర్పించాం. వాళ్ళ కోసం ప్రత్యేకం గా ట్యూషన్ తరగతులు కూడా నిర్వహించాం.

అక్కడి ప్రజల్లో చాలావరకు చైతన్యం తీసుకొచ్చాము. ఎన్జీవో లు పని చేసినంతకాలం ఫర్వాలేదు కానీ ఆ తర్వాత పరిస్థితి మళ్ళీ మామూలే. అయితే ఇపుడు యంత్రాలు రావడంతో ఈ జీడిపప్పు పరిశ్రమలో కార్మికుల సంఖ్య తగ్గింది. అన్నట్టు వేటపాలెం పేరుతో ఒక సినిమా కూడా తీసినట్టున్నారు. ఈ సారి గ్రంధాలయం గురించి చెప్పుకుందాం.

————–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!