మ్యాప్ లో ఉక్రెయిన్ లేకుండా చేయడమే లక్ష్యమా ?

Sharing is Caring...

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నియమాలను విస్మరించి ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. యుద్ధం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. పౌరులపై దాడి చేయకూడదు.అలాగే మహిళలు, వృద్ధులు, పిల్లల జోలికి వెళ్ళకూడదు. జనావాసాలపై దాడులు చేయడం కూడా తప్పే.వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా పుతిన్ ధ్వంస రచనకు పాల్పడుతున్నారు.  

పుతిన్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.పుతిన్ యుద్ధ శైలి చూస్తుంటే .. ఉక్రెయిన్ నగరాలన్ని నేలమట్టం అయి శ్మశానాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం ఉక్రెయిన్ దేశాన్నే మ్యాప్ లో లేకుండా చేసే యోచనలో పుతిన్ ఉన్నట్టు కనబడుతోంది. దాడులు జరుగుతున్న తీరు అదే రీతిలో ఉంది. 

ఇప్పటివరకు రష్యా భీకర బాంబుల దాడులలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రధాన నగరాల్లో నివాస భవనాలు, ఆస్పత్రులపై కూడా మిస్సైల్స్‌తో రష్యా దాడులు చేస్తోంది.  సామాన్య పౌరులను కూడా రష్యన్ సైనికులు వదలడం లేదు.

ఉక్రెయిన్‌లో ఎటు చూసినా భయానక పరిస్థితులే గోచరిస్తున్నాయి. జనం ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రాణ భయంతో లక్షలాది మంది ప్ర‌జ‌లు సరిహద్దు దేశాలకు వలస పోతున్నారు. 

మేరియుపోల్‌లో  సైనిక దాడులతో భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. వేలమంది అమాయకులు  ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా రోడ్లపై శవాలే.  స్థానిక నగర అధికారులు .. మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మేరియుపోల్‌లో రష్యా దాడులు మొదలైనప్పటినుంచి 1582 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉక్రెయిన్‌ను ఎదుర్కోవడం చేతగాక రష్యా నిరాయుధులపై బాంబులు, క్షిపణులు, మిస్సైల్స్‌తో దాడులు చేస్తోంది. సామాన్య ప్రజలకు అందుతున్న సాయాన్నిసైతం అడ్డుకుంటూ క్రూరం గా వ్యవహరిస్తోంది. 
పశ్చిమ ఉక్రెయిన్ లోని ల్వీవ్‌కు సమీపంలో ఉన్న మిలటరీ ట్రైనింగ్ సెంటర్‌పై క్షిపణులతో రష్యా బలగాలు దాడులు చేశాయి. 

ఈ దాడుల్లో సుమారు 35 మంది చనిపోగా.. మరో 134 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సైనిక శిక్షణా కేంద్రం పోలాండ్ కు సరిహద్దు ప్రాంతంలో ఉంది. మిలటరీ శిక్షణా కేంద్రంపై  30కి పైగా క్రూయిజ్ క్షిపణులతో రష్యా దళాలు దాడి చేశాయి.ఇంకా ఎన్నాళ్ళు ఈ యుద్ధం సాగుతుందో ఏమో కానీ .. ఉక్రెయిన్ సర్వ నాశనం కావడం మాత్రం ఖాయం అనిపిస్తున్నది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!