Govardhan Gande……………………………..
నాలుగు నెలల్లో నష్టాలను పూడ్చుకోలేకపోతే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయక తప్పదు. బాధ్యతలు తీసుకోగానే ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన వ్యాఖ్య.ఇది ఆషామాషీ మాట కాదు. తెలియక,పొరపాటున చేసిన వ్యాఖ్య అనుకోవడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నమాట అని ఆయనే అంటున్నారు. ఈ లెక్కన ఇది చాలా తీవ్రమైన విషయమే అవుతుంది.
ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వం తీవ్రంగానే పరిశీలిస్తున్నదని భావించవలసిన స్థితి.ఈ వ్యాఖ్య తీవ్రమైన కలకలం రేపింది. సంస్థ ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన ను కలిగించింది. నిజంగా ఇది ప్రభుత్వ ఆలోచనేనా? ప్రతిపాదనా? కార్మికుల్లో బాధ్యతను మెరుగు పరిచే బెదిరింపా? లేక మరో వ్యూహమా? అన్న చర్చ విస్తృతంగానే జరుగుతున్నది. సంస్థకు ఇప్పుడున్న అప్పులు షుమారు రూ.6 వేల కోట్లు. ఈ అప్పులకు కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? యాజమాన్య నిర్వహణా వైఫల్యమా? కార్మికుల బాధ్యతా రాహిత్యమా?అధికారుల నిర్లక్ష్యమా? మరొక కారణమా?దీన్ని నిగ్గు తేల్చడం ప్రభుత్వానికి అంత కష్టమైన పనేమీ కాదు.
నష్టాల నుంచి సంస్థను బయట పడేయడానికి అనేక మార్గాలుంటాయి.డీజిల్ పై పన్ను ను తొలగించవచ్చు. మోటార్ రవాణా పన్ను నుంచి సంస్థకు మినహాయింపును ఇవ్వవచ్చు. అనవసరంగా సంస్థకు భారంగా మారిన అధికారుల మందను తొలగించవచ్చును. దుబారా ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని కట్టడి చేయవచ్చును. ప్రయాణికులతో కార్మికుల వ్యవహార ధోరణిలో మార్పు తీసుకురావడం ద్వారా కొత్త ప్రయాణికులను ఆకర్షించవచ్చును.ప్రైవేట్ బస్సు సర్వీసులను నిలువరించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చును.బస్సులను శుభ్రంగా ఉంచడం,సేవల్లో నాణ్యతను పెంచడం, సంస్థ నిర్వహణకు అతి కీలకమైన డ్రైవర్,కండక్టర్,మెకానిక్ లాంటి ఉద్యోగుల సంఖ్య,బస్సుల సంఖ్యను పెంచడం లాంటి చర్యలతో ఎర్ర బస్సు ను కాపాడు కోవచ్చు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి విడిపోయాక తెలంగాణ ఆర్టీసీ సంస్థ 2016 ఏప్రిల్ లో ఏర్పడింది.ఆర్టీసీకి 10460 బస్సులున్నాయి. అందులో 2వేలు అద్దె బస్సులు. 50317 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 97 డిపో లున్నాయి. 36,593 రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుత నష్టాలకు కారణాలు అనేకం. డీజిల్ రేట్లు . టైర్ల రేట్లు పెరగడం .. కరోనా కాలంలో బస్సులు నిలిచిపోవడం వంటివి అందులో కొన్ని. ఏదైనా కారణాలేమిటో కనుగొని లాభాలబాటలో నడిపే ప్రయత్నం చేయాలి.
15 ఏళ్ల క్రితం ఐఐఎం బెంగళూరు విద్యా సంస్థ చేసిన అధ్యయనంలోని సానుకూల అంశాలను అమలు చేసి కొంత మెరుగైన ఫలితాలు సాధించే ప్రయత్నం చేయవచ్చును. సంస్థ నిర్వహణలో పోలీసు అధికారుల స్థానంలో రవాణా రంగంలో నిపుణులైన అధికారులకు బాధ్యతలు ఇవ్వడం మేలైన పని అవుతుందనే అంశాన్ని సైతం పరిశీలించాలి.నైపుణ్యంతో నిర్వహించవలసిన పనిని బెత్తం,లాఠీలతో నిర్వహించడం సబబు కాదనే అభిప్రాయాన్ని పరిశీలించాలి. ఇవి చేయగలిగితే ఎర్రబస్సును కాపాడినట్లే. దీనికి మనసు కావాలి.ప్రైవేటీకరణ ఆలోచన నిజరూపం దాల్చకుండా చూసేందుకు అందరూ కలిసి యత్నిస్తే అసాధ్యమేమీ కాదు. పేద ప్రయాణికులకు ఏకైక,చవకైన రవాణా సాధనంగా నిలిచిన ఎర్రబస్సు ను కాపాడుకోవచ్చు.