Will Sasikala’s dreams come true?………..
తలైవి జయలలిత సన్నిహితురాలు చిన్నమ్మ శశికళ మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాలని ఉవ్విళూరుతున్నారు. పార్టీ పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు.2021 మార్చిలో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, 2024 జూన్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చారు.
అన్నాడీఎంకే (AIADMK) లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, పార్టీని పునరుజ్జీవింపజేయడానికి.. గ్రూపులను ఐక్యం చేయడానికి తాను రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నానని ప్రకటించారు.
2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేలోని పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.”ప్రజలు తన వైపే ఉన్నారని, అన్నాడీఎంకే అంతం కాలేదని” 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దివంగత ముఖ్యమంత్రి జయలలిత “అమ్మ పాలన”ను తిరిగి తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆమె పిలుపును,ప్రతిజ్ఞ ను పళని స్వామి పట్టించుకోలేదు.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుండి తనను తొలగిస్తూ 2017లో ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ ఆమె న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.అన్నాడీఎంకేను తిరిగి తన ఆధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం అన్నా డీఎంకే పార్టీ ఎడప్పాడి కె. పళనిస్వామి ఆధీనంలో ఉంది. 2023 మార్చిలో, మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పళనిస్వామి పార్టీ అత్యున్నత నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.2023 ఏప్రిల్‌లో భారత ఎన్నికల సంఘం (EC) కూడా పళనిస్వామిని AIADMK ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా గుర్తించింది.
పన్నీర్ సెల్వం (OPS) శశికళ వంటి ఇతర నాయకులను పార్టీ నుండి చాలా కాలం క్రితమే బహిష్కరించారు. పన్నీర్ సెల్వం,శశికళ తమ బహిష్కరణను సవాలు చేస్తూ న్యాయస్థానాలలో పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలపై వారికి నియంత్రణ లేదు. పెద్దగా కార్యకర్తలు కూడా వారి వెంటలేరు.
పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ శశికళతో కలిసి పనిచేయడం లేదా ఆమెను పార్టీలోకి తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. పళనిస్వామి ఆమెను పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆమెకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. అయితే పన్నీర్ సెల్వం వర్గంలోని కొందరు నేతలు శశికళతో ఆమధ్య చర్చలు జరిపారు..పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, శశికళ విషయంలో వారి వైఖరులు భిన్నంగా ఉన్నాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పన్నీర్ సెల్వం, శశికళ లు కలిసే అవకాశాలున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల పన్నీర్ సెల్వం, దినకరన్ NDA నుండి వైదొలిగారు. డిసెంబర్ 2025లో జరిగిన AIADMK జనరల్ కౌన్సిల్ సమావేశంలో 2026 ఎన్నికల పొత్తులపై తుది నిర్ణయాధికారాన్ని పళని స్వామికి అప్పగించారు.
2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, DMKను ఓడించడానికి AIADMKలోని అన్ని వర్గాలు (OPS, శశికళ, TTVతో సహా) ఏకం కావాలని BJP తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. అయితే పళని స్వామి దీనిపై రాజీ పడడం లేదు.
పన్నీర్ సెల్వం పట్ల కొంత మెతక ధోరణి ఉన్నప్పటికీ .. శశికళ, దినకరన్ ల విషయంలో మాత్రం వారి వ్యవహార శైలి తెలిసినందున పళని మొండిగా ఉన్నారు. జైలు నుంచి వచ్చినప్పటినుంచి శశికళ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆమె ప్రయత్నాలు ఏవీ వర్కవుట్ కాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ క్రమంలో చిన్నమ్మ కలలు ఫలించే అవకాశాలు దాదాపుగా లేవు. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

