టర్కీలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో కొంత పురోగతి కనిపించడంతో ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఒక్కరోజే ఆరు శాతం తగ్గి బ్యారెల్ ముడి చమురు ధర 106 డాలర్లకు పడిపోయింది.
బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర ఆరు శాతానికి పైగా తగ్గి సుమారు 106 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ బ్యారెల్ ధర కూడా 6 శాతానికి పైగా పతనమై 99.6 డాలర్లకు పడిపోయింది. ఈ పరిణామం తో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
అయితే ఈ తగ్గుదల నిలకడగా ఉంటుందో లేదో చూడాలి? ముడి చమురు ధరలు తగ్గితే మెల్లగా ఆ ప్రభావం మిగతా రంగాలపై కూడా పడుతుంది. ఆ రంగాల్లో కూడా చుక్కలను తాకిన ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ప్రభావం అన్నిరంగాలపై పడింది.
ప్రధానంగా వంట నూనె ధరలు,స్టీల్,సిమెంట్ ధరలు పెరుగుతున్న తీరుతో సామాన్యులు బెంబేలెత్తి పోయారు.అలాగే బంగారం,స్టాక్ మార్కెట్ తదితర రంగాలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం అయ్యాయి. మొత్తంగా ఆర్ధిక రంగంపై యుద్ధం పెనుప్రభావాన్నే చూపింది. ముఖ్యంగా వంట నూనెలు భగభగ మండాయి.
గత నెలరోజుల్లో నూనె ధరలు బాగా పెరిగాయి. గత నెలలో 120 నుంచి 130 రూపాయల వద్ద లభ్యమైన నూనె ధరలు ఏకంగా రూ. 225 వరకు చేరుకున్నాయి. యుద్ధం కారణం గా స్టీల్ ..సిమెంట్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఊహించని విధంగా ధరలు పెరిగిన తీరుతో బిల్డర్లు ..కాంట్రాక్టర్లు కలవర పడ్డారు. గత నెలలో స్టీల్ ధర క్వింటాల్ రూ.6,600 ఉండగా, ప్రస్తుతం దాని ధర రూ. 8,400కు చేరుకుంది.సిమెంట్ బస్తా ధరలు కూడా భారంగా మారాయి.
శాంతి చర్చల్లో హామీ ఇచ్చిన మేరకు కొన్ని చోట్ల అయినా రష్యా బలగాలు వెనక్కి తిరిగితే .. ఆ ప్రభావం కారణంగా పెరిగిన ధరలు తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు. ఏడైనా పూర్తిగా యుద్ధ విరమణకు రష్యా అంగీకరిస్తేనే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర చుక్కలను తాకింది. ముందు ఎన్నడూ లేని విధంగా ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు 2,150 డాలర్లకు అంటే సుమారు రూ.1,63,400 కి చేరుకుంది.
రాబోయే నెల అవసరాల కోసం భారత కంపెనీలు రష్యా నుంచి ఇదే ధరకు 45వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోబోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అర్జెంటీనా నుంచి దిగుమతులను పెంచుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. యుద్ధ పరిణామాలతో ఏప్రిల్ నుంచి ధర మరింత పెరగవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. శాంతి చర్చల ప్రభావం వంట నూనెలు, ఇతర వస్తువుల పైన ఏమేరకు పడుతుందో మరికొద్ది రోజులు గడిస్తేనే కానీ చెప్పలేం.