National Geographic : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ మాస పత్రిక నేషనల్ జియోగ్రాఫిక్ త్వరలోనే మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ లేఆఫ్ ప్రక్రియను చేపట్టింది. ఈ సంస్థలో చివరి స్టాఫ్ రైటర్ల (Staff Writers)ను ఉద్యోగం నుంచి తొలగించారు.
గత కొద్ది రోజులుగా ఈ కంపెనీలో లేఆఫ్ లు చేపడుతుండగా.. మిగిలిన 19 మందిని మూడు రోజుల క్రితం తీసేశారు. సంస్థ ఎడిటోరియల్ విభాగంలోని సీనియర్ సభ్యులు ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించారు.ప్రస్తుతం ఈ మ్యాగజైన్ లో రైటర్స్ ఎవరూ లేరు. వచ్చే ఏడాది నాటికి ఇది స్టాండ్స్ లో ఇక కనిపించదని వాషింగ్టన్ పోస్ట్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.
1888లో నేషనల్ జియోగ్రాఫిక్ (National Geographic) మ్యాగజైన్ తొలి సంచికను తీసుకొచ్చింది. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ గా ఏర్పడిన కొందరు ప్రముఖులు ఈ పత్రికను నడిపించారు. ఈపత్రిక ౩౦ భాషల్లో వెలువడేది.
135 ఏళ్ళక్రితం మొదలైన ఈ పత్రిక ప్రారంభం నుంచి ప్రకృతి, ప్రపంచం, సైన్స్ వంటి ఎన్నో అంశాలపై ఆసక్తికర కథనాలను జనావళికి అందించింది. ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ఆదరణను సంపాదించుకుంది. ప్రతి నెలా ఒక సంచిక వెలువడేది. 2015 నుంచి ఈ కంపెనీ యాజమాన్యం అనేక సార్లు మారుతూ వచ్చింది.
దీంతో ఎడిటోరియల్ పరంగానూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ను వాల్ట్ డిస్నీ సంస్థ నడిపిస్తోంది. అయితే విక్రయాలు తగ్గడం, ఇతరత్రా కారణాలతో డిస్నీ ఖర్చు తగ్గింపు చర్యలు మొదలు పెట్టింది. కొన్ని భాషల్లో పత్రికను ఆపేసింది.గతేడాది సెప్టెంబరులో ఆరుగురు టాప్ ఎడిటర్స్ ను ఉద్యోగం నుంచి తొలగించింది.
ఆ తర్వాత కూడా పలుమార్లు లేఆఫ్లు చేపడుతూ వచ్చిన సంస్థ.. తాజాగా కంపెనీలో మిగిలిన రైటర్లనూ తీసేసింది. ఈ ప్రభావం ఫొటోగ్రాఫర్లపైనా పడనుంది. ప్రస్తుతం కంపెనీలో మిగిలి ఉన్న ఎడిటర్ల సాయంతో ఫ్రీలాన్స్ రైటర్ల ద్వారా మ్యాగజైన్ ను నడపాలని భావిస్తోంది. శాశ్వత ఉద్యోగులను మాత్రం ఇకపై తీసుకోబోదట.
ఈ లేఆఫ్ ల పై కంపెనీ స్పందిస్తూ.. “రైటర్ల తొలగింపు వల్ల మ్యాగజైన్ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు రావు. ఇకపై మరిన్ని విభిన్న కథనాలతో అనేక రంగాల పాఠకులకు చేరువవుతామని నమ్మకంతో ఉన్నాం. ఉద్యోగుల కోతల వల్ల మ్యాగజైన్ పై ప్రతికూల ప్రభావం ఉండదు ” అని చెబుతోంది.
అయితే.. పెరిగిన ప్రింటింగ్ ఖర్చులు, మార్కెట్లో అమ్మకాలు భారీగా తగ్గిపోవటం వంటి కారణాలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మ్యాగజైన్ ప్రచురణ కూడా నిలిపివేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఏడాది నాటికి ఇది బుక్ స్టాండ్స్ లో కన్పించబోదని అమెరికా మీడియా అంటోంది. ఈ మ్యాగజైన్ డిజిటల్ సేవలను మరింత విస్తరించనున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు లభించాయి.