విజయమాల్యా వస్తారని జైలును ముస్తాబు చేసి ఏడాది దాటిపోయింది. ముంబై లోని అత్యంత ప్రాచీన ఆర్ధర్ రోడ్ జైలును ఆయన కోసం బూజు దులిపి ,శుభ్రం చేసి. కడిగి ముగ్గులేసి సిద్ధంగా ఉంచారు . కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మాల్యా వస్తే కదా . ఎపుడొస్తారో కూడా ఎవరికి తెలీదు. ఛానల్స్ లో పత్రికల్లో మాత్రం వార్తలు వస్తుంటాయి. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. ఒక ఆర్ధిక నేరస్తుడి కోసం జైలు కూడా శుభ్రం చేయడం ఏమిటని మిగతా జైళ్లలోని ఖైదీలు కుళ్ళు కుంటున్నారట.
అన్నట్టు ఇపుడు మిగతా నేరస్తులు కుళ్ళుకునే వార్త ఒకటి కొత్తగా ప్రచారం లో కొచ్చింది. విజయమాల్యా బయోపిక్ తీస్తున్నారట. అది సినిమా గా కాకుండా వెబ్ సీరియల్ గా తీయబోతున్నారట. అంతకుముందే ఒకాయన విజయమాల్యా గురించి ఒక పుస్తకం కూడా రాసారు. దాని ఆధారంగా వెబ్ సీరియల్ నిర్మిస్తున్నారట. ఈ ప్రచారం చూసి నీరవ్ మోడీ ఇతర ఆర్ధిక నేరస్తులు కూడా తమ జీవితాలను కూడా తెరపైకి ఎక్కించమని డిమాండ్ చేయవచ్చు. లేదా అంతేవాసులు ద్వారా సీరియళ్లు తీయించవచ్చు. ఇదివరలో మాఫియా డాన్ల గురించి సినిమాలు తీస్తే మనమే చూసి వాటిని విజయవంతం చేసాం. మొత్తానికి మాల్యా అందరూ కుళ్ళుకునేలా చేస్తున్నారు. ఆ మాటకొస్తే బ్యాంకులు మునిపోయేలా అప్పులు చేసి ఎగవేసిన బడా వ్యాపారవేత్త విజయమాల్యాను చూసి దొరికి పోయిన చిన్న నేరగాళ్లు కూడా కుళ్ళు కుంటున్నారు. నేరగాళ్లే కాదు మామూలు జనంతోపాటు కోటీశ్వరులు సైతం మాల్యా స్టైల్ చూస్తే కుళ్ళు కుంటారు. ఆయన స్టైల్ అలా ఉంటుంది మరి.
ఇంటి ముందు కొలువు తీరిన వింటేజ్ కార్లు, కోట్ల ఖరీదైన విహార నౌకలు, విలాసానికి చిరునామా వంటి సొంత విమానాలు,
దేశదేశాల్లో సొంత దీవులు, రేసు గుర్రాలు…ఒకప్పటి యుబి గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా లైఫ్స్టైల్లో అతి సాధారణ అంశాలు. ఇపుడు వాటిలో చాలావరకు గత వైభవ చిహ్నాలుగా మారాయి. మారిన పరిస్థితుల్లో ఆయనకు అప్పు ఇచ్చిన బ్యాంకులన్నీ తల గోడ కేసి కొట్టుకుంటున్నాయి.బకాయిలు ఎగ్గొట్టిన సంస్థల్లో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అగ్ర గామి గా ఉంది. ఈ పొజిషన్ చూసి కూడా కొంతమంది అసూయ పడుతున్నారట.
కింగ్ ఫిషర్ పరపతి, నికర విలువ,ప్రతి కూలంగా ఉందని తెలిసి కూడా ఆ సంస్థకు 950 కోట్ల అప్పు ఇచ్చినందుకు ఐడీబీఐ బ్యాంక్ అధికారులు తర్వాత కాలంలో తలలు పట్టుకున్నారు . సీబీఐ వాళ్ళు ప్రశ్నలతో విసిగించి చంపారు.
ఇక రద్దు అయిన కింగ్ ఫిషర్ 17 బ్యాంకుల కన్షార్షియంకు 7 వేల కోట్లకు పైగా బకాయి పడిందని బ్యాంకర్లు లెక్కలు తేల్చారు.
ఇన్ని అప్పులు ఉన్నా మాల్యా విలాసాలకు కొదువే లేదు. అందుకే మాల్యా అంటే చాలామంది పారిశ్రామికవేత్తలకు కుళ్ళు.
ఒకప్పుడు కుబేరుల సరసన మెరిసిపోయిన మాల్యా ఫోర్బ్స్ జాబితాలో జాడలేకుండా పోయారు పాపం.
ఏడేళ్ల క్రితం 100 కోట్ల డాలర్ల సంపదతో భారతీయ కుబేరుల్లో 45వ స్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 1153 వ స్థానంలో నిలిచిన మాల్యా 2013 నుంచి అడ్రస్ లేకుండా పోయారు.మాల్యా డ్రీమ్ ప్రాజెక్టు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోవడం, నష్టాలపాలు కావడం ఆయన తల రాతను మార్చేసింది. ఈ క్రమంలోనే మాల్యా దర్పానికి, అహానికి చిహ్నంగా ఉన్న అనేక ఆస్తులు ఆయన్నుంచి దూరమయ్యాయి.
మెగా విహార నౌక (యాచ్) మాల్యా ఆస్తుల్లో ప్రముఖమైనది.. ఈ యాచ్‌ను మాల్యా 2006లో ఖతార్‌కు చెందిన షేక్ దగ్గర కొనుగోలు చేశారట.దీన్ని మాల్యా 2011లోనే విక్రయించారు. ముంబైలోని భవనాలు, వింటేజ్ కార్లు, ఖరీదైన గుర్రాలు.. ఇలా ఒక్కొక్కటిగా మాల్యా చేజారాయి.2016 లో మాల్యా లండన్ వెళ్ళాక అక్కడి ఆస్తులను మాత్రం భద్రంగా ఉంచుకున్నారని అంటారు. చివరాఖరికి ఈ విషయంలో కూడా మాల్యా పోటీ దారులను సుఖంగా ఉండనీయలేదు.
————- KNM