A lonely struggle……………..
ఫోటో లో కనిపించే వ్యక్తి ని గుర్తు పట్టారా ? అదేనండీ దివంగత నేత జయలలితకు వీర విధేయుడు పన్నీర్ సెల్వం (OPS).. అమ్మ అనుగ్రహం తో మూడు సార్లు తమిళనాడు కి సీఎం అయ్యారు… ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఒంటరి అయిపోయాడు. అన్నా డీఎంకే అధిష్ఠానం బహిష్కరించడంతో పార్టీ పై కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు.
పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు పనిచేశారు. మొత్తం పదవీకాలం సుమారు ఒక సంవత్సరం మూడు నెలలు ( 15 నెలలు) మొదటి పర్యాయం (సెప్టెంబర్ 2001 – మార్చి 2002) సుమారు 6 నెలలు. రెండవ పర్యాయం (సెప్టెంబర్ 2014 – మే 2015) సుమారు 8 నెలలు…మూడవ పర్యాయం (డిసెంబర్ 2016 – ఫిబ్రవరి 2017) సుమారు 2 నెలలు సీఎం గా చేశారు.
రెండు సార్లు జయలలిత అవినీతి కేసులలో (disproportionate assets cases) న్యాయస్థానాల ద్వారా దోషిగా నిర్ధారించబడి, సీఎం పదవిని నిర్వహించడానికి అనర్హురాలిగా మారినప్పుడు, ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం ‘తాత్కాలిక’ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం, హైకోర్టు ఆమె నిర్దోషిగా ప్రకటించింది. తర్వాత సెల్వం రాజీనామా చేసి జయ తిరిగి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి సహకరించారు.
జయలలిత మరణం తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, పార్టీలో జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ CM పదవి చేపట్టాలని పార్టీ శాసనసభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం వ్యక్తిగత కారణాల రీత్యా అంటూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ తర్వాత శశికళ తనను రాజీనామా చేయమని బలవంతం చేశారని ఆయన ఆరోపించారు, ఇది పార్టీలో పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది.
సరిగ్గా ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టడానికి శశికళ ప్రయత్నిస్తున్న సమయంలోనే, సుప్రీంకోర్టు ఆమెను పాత ఆస్తుల కేసు (disproportionate assets case) లో దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష విధించింది.దీంతో జైలుకు వెళ్లే ముందు, శశికళ తన విధేయుడైన, నాటి పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిని AIADMK శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేలా పార్టీ ఎమ్మెల్యేలను (సుమారు 120 మందిని ఒక రిసార్ట్‌లో ఉంచారు) సమర్థవంతంగా ఒప్పించారు.
ఆ తర్వాత పళనిస్వామి చక్రం తిప్పారు. శశికళను కూడా పార్టీ పదవి నుంచి తొలగించారు. తర్వాత ఎన్నికలు జరిగాయి డీఎంకే అధికారంలోకి వచ్చింది.పళనిస్వామి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, AIADMK పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఇక పన్నీర్ సెల్వం ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు..2024 లోక్‌సభ ఎన్నికల్లో’రామనాథపురం’ (Ramanathapuram) నియోజకవర్గం నుంచి బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అభ్యర్థి కె. నవాస్ కనీ చేతిలో ఓడిపోయారు.
పార్టీ బహిష్కరించడం తో ఆయనను అసెంబ్లీలో “అటాచ్డ్ కాని ఎమ్మెల్యే” గా పరిగణిస్తున్నారు.వ్యక్తిగతంగా కొంత మద్దతు (ముఖ్యంగా తేవర్ సామాజిక వర్గంలో) ఉన్నప్పటికీ, మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, శ్రేణులు పళనిస్వామి వెంటే ఉన్నారు.పన్నీర్ సెల్వం తనను,తన మద్దతుదారులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. అయితే పళనిస్వామి (EPS) మాత్రం వారిని తిరిగి చేర్చుకోవడానికి సుముఖంగా లేరు.
2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇచ్చిన OPS, జూలై 2025లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి నుండి బయటకు వచ్చారు. బీజేపీ నాయకులు పళనిస్వామితో మాత్రమే పొత్తును పునరుద్ధరించడంతో, తమకు అవమానం జరిగిందని ఆయన భావించారు.
తన మద్దతుదారులతో సంప్రదింపులు జరిపిన OPS… AIADMKతో ఐక్యత కుదరకపోతే కొత్త రాజకీయ పార్టీ తో ముందుకు సాగవచ్చు. OPS తన వర్గాన్ని “ADMKTUMK” (అన్నా ద్రవిడ మున్నేట్ర కజగ తొండర్కల్ ఉరిమై మీట్పు కజగం) అనే రాజకీయ పార్టీగా మార్చారు.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆయన డీఎంకే అధినేత, CM స్టాలిన్‌ను రెండుసార్లు కలిశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సెల్వం డీఎంకే లో చేరతారా ? సొంతంగా పార్టీ నడుపుతారా ? అనేది తేలాల్సి ఉంది.

