అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష ముగిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కైవసం చేసుకోవాలని మళ్ళీ కలలు కంటోంది. అయితే ఈ సారి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని చట్టం అంటోంది.
జయలలిత మరణించిన కొద్ధి కాలానికి సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ ను పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు 2017, ఫిబ్రవరి 5న చిన్నమ్మను పార్టీ శాసన సభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత్యంతరం లేక ఫిబ్రవరి 6 సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఫిబ్రవరి 9న ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ గవర్నర్‌ను కోరింది. గవర్నర్ ఆమె రాసిన లేఖను పరిశీలించి నిర్ణయం ప్రకటించే లోగానే అక్రమాస్తుల కేసులో శశికళ అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామం శశికళ అసలు ఊహించలేదు. దీంతో తన విధేయుడు పళని స్వామి ని సీఎం గా చేసి జైలు కెళ్ళింది.
కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష అను అనుభవించి కొద్దిరోజుల క్రితమే విడుదల అయ్యారు. ఇంతవరకూ బాగానే ఉంది. జైలు నుంచి బయటికి రాగానే టీ టీ వి దినకరన్ చావు కబురు చల్లగా చెప్పాడట. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 8 ప్రకారం ఒక వ్యక్తి ఏదేని నేరాలకు పాల్పడి, జైలుశిక్ష అనుభవిస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులు అని. అదేవిధంగా 1988 సెక్షన్ 8(1)ఎం) అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కనీసం ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనే ఛాన్స్ లేదని. ఆమాటలు విని చిన్నమ్మ షాక్ తిన్నదట. అప్పటికపుడు లాయర్లను పిలిపించి సంప్రదించారట. అందరూ అదే మాట చెప్పారట. జైలు నుంచి విడుదలైన రోజు నుంచి ఆరేళ్ల పాటు.. అనగా 2027 జనవరి 26వ తేదీలోగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం అసాధ్యం అని తేల్చి చెప్పారట.
కాకపోతే ఎన్నికల కమీషన్ అనుమతిస్తే పోటీ చేయవచ్చట. గతంలో ఎన్నికల కమీషన్ సిక్కిం రాష్ట్ర నేత ప్రేమ్‌సింగ్ దమాంగ్ కు అనర్హత కాలం కొంత తగ్గించిందట. అదే రీతిలో మినహాయింపు లభిస్తే చిన్నమ్మ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అధికారంలోకి వస్తుందా లేదా అన్నది తర్వాత విషయం. అందుకోసం ఈ సి కి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించారట. ఈసీ స్పందన ఎలాఉంటుందో ఇప్పటికైతే సస్పెన్స్. అంత కంటే ముందు పార్టీ పై పట్టు సాధించాలి. అందుకోసమే 7 వ తారీఖున చెన్నై వెళ్తోంది. చిన్నమ్మ జయసమాధి వద్దకు వస్తోందని తెలిసి …. ఆమెను అడ్డుకునేందుకు పళని స్వామి జాగ్రత్త పడుతున్నారు. జయ సమాధి ప్రాంతాన్ని మూసి వేశారు. ఎవరిని అక్కడికి పోకుండా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద చిన్నమ్మ అభిమానులు కోరుకుంటున్నట్టుగా రాజకీయాల్లో ‘క్రియాశీలక పాత్ర’ పోషించవచ్చునేమో గానీ అధికార పీఠం ఎక్కడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఏమి జరుగుతుందో చూద్దాం.
————–KNM