జేపీ మాట్లాడిన వార్తలేవైనా పేపర్లలో కనిపించినా, ఆయన టీవీల్లో కనిపించినా చాలామంది … ఈయన ఇన్నాళ్లూ ఏమైపోయాడు, సడెన్‌గా మాట్లాడుతున్నాడేమిటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయన మాట్లాడడం, పలు విషయాల్లో తన అభిప్రాయాలు చెప్పడం, పరిష్కారాలు సూచించడం ఎక్కడా ఆపలేదు. జనజీవితానికి సంబంధించి ఆయన చేసే పని కూడా ఎక్కడా ఆగలేదు.
కానీ, దురదృష్టమేమిటంటే … పార్టీల కండువాలు కప్పుకు తిరిగే పత్రికలకు, టీవీ ఛానెళ్లకు జేపీ ఒక చేదు మాత్ర. డాక్టర్ జేపీ మాత్రలు ఎక్కడ ఈ దేశానికి చికిత్స చేస్తాయోననే భయం వాటిని వెంటాడుతుంటుంది. అలాంటి చికిత్సలు తాము కొమ్ముకాసే పార్టీలకు పనికిరావు కాబట్టి, జేపీ మాట్లాడే అంశాల్లో చాలావాటిని అవి అలా చూసీచూడనట్లు వదిలేస్తుంటాయి.
లోక్‌సత్తా.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే గత కొన్ని సంవత్సరాల్లో జేపీ ఎన్ని అంశాలపై స్పందించారు, ఎన్నిటిని పత్రికలు ప్రచురించాయి, ఎన్నిటిని నిర్దాక్షిణ్యంగా కిల్ చేశాయో అర్థమవుతుంది. టీవీ మీడియా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. జేపీ వల్ల మనిషిని మానసికంగా రెచ్చగొట్టే కంటెంట్ ఏదీ దొరకదు కాబట్టి అవీ సైలెంటే. కాకపోతే జేపీ గణాంకాలు చూపిస్తూ నోరు తెరిచిన ప్రతిసారీ బహుశా ఆ సాక్ష్యాలు ప్రభావితం చేస్తాయేమో, ఆ కంటెంట్‌ను మాత్రం (అదీ స్ట్రిక్ట్ ఎడిటింగ్‌తో) రాస్తుంటాయి, చూపిస్తుంటాయి.
మన మీడియాకి బడ్జెట్ గణాంకాలపై రివ్యూలు కావల్సివస్తే జేపీ కావాలి; జాతీయస్థాయిలో కొత్త చట్టాలేవైనా కావల్సివస్తే ఆ చర్చకు జేపీ కావాలి; అవినీతి నియంత్రణ, పాలనలో పారదర్శకత, నిఖార్సయిన విద్య, వైద్యాల గురించి చేసే స్టోరీలకు జేపీ కావాలి. కానీ ఆయన చెప్పే ఇతర కంటెంట్ ఏదీ అవసరం లేదు. నిజానికి ఆయన కావాలనుకుంటే ఇప్పుడు చాలామంది ఐఎఎస్‌లు అనుభవిస్తున్న జీవితం కంటే వంద రెట్లు మెరుగైన జీవితం అనుభవిస్తూవుండేవాడు. పార్టీ పెట్టకపోయివుంటే ఈపాటికి మెగసెసేతో సహా చాలా అవార్డులు వచ్చివుండేవి. ఆయన దేశం కోసం పనిచేయాలనుకున్నాడు, చేస్తున్నాడు.
ప్రశ్నించడం వరకూ ఆగితే తప్పే కావచ్చు; కానీ పరిష్కారాలు కూడా చూపేవాడిని నిర్లక్ష్యం చేయడం ఏ కోవ కిందికి వస్తుందో మరి పత్రికలు, టీవీ ఛానెళ్ల యాజమాన్యాలే ఆలోచించుకోవాలి.