ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ? ఎలా దూరమయ్యారు ?

Sharing is Caring...

That’s it in politics………

మూడేళ్లకే  అమితాబ్ బచ్చన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎందుకు ముగింపు పలికారో? ఇప్పటికి చాలామందికి తెలీదు. అమితాబ్ కూడా ఎక్కడా అసలు విషయం ఎవరికి చెప్పలేదు . చాలా ఇంటర్వ్యూలలో మీడియా వాళ్ళు అడిగినా అమితాబ్ వేర్వేరు కారణాలు చెప్పారు.

తన బ్లాగ్ లో కూడా రాజకీయాల్లో ఇమడ లేకపోయాను అని రాసుకున్నారు.  రాజకీయ నాయకుడి పాత్ర చాలా కష్టమైందని … అసలు రాజకీయమే  సంక్లిష్టమైన ప్రపంచమని అమితాబ్ వివరించారు.
రాజకీయ నేతలు సంబంధాలను ఎంత సులభంగా పెంచుకుంటారో  … అంతే సులభంగా తెంచుకోగలరని … శత్రువులను క్షణంలో తిరస్కరిస్తారని .. నెలలు గడవకుండానే తిరిగి కౌగిలించుకుంటారని.. అటువంటి పనులు తాను చేయలేనని అమితాబ్ నర్మగర్భంగా చెప్పుకున్నారు.

ఇక రాజీవ్ గాంధీ, అమితాబ్ లు బాల్యమిత్రులు. రాజీవ్ తో పెళ్ళికి ముందు  సోనియా అమితాబ్ ఇంట్లోనే ఉన్నారు. ఆమెను హోటల్ లో ఉంచడం ఇష్టంలేక ప్రధాని ఇందిర  అమితాబ్ వాళ్ళింట్లో ఉంచారు. ఒక సందర్భం లో  సోనియాగాంధీ కూడా తనను తల్లిలా చూసుకున్న అత్తగారి తర్వాత మరో అమ్మ తేజీ బచ్చన్ అని చెప్పారు. అమితాబ్,అజితాబ్ లు  తన తోబుట్టువుల్లాంటి వారని కూడా చెప్పారు.

అంతటి బంధం ఆ కుటుంబం మధ్య ఉన్నది. అందుకే రాజీవ్ గాంధీ అడగగానే  అమితాబ్ వెనుకాముందు చూడకుండా అలహాబాద్ వెళ్లి పోటీ చేసాడు.ఎన్నికల్లో రికార్డు మెజారిటీ తో గెలిచాడు. గెలిచినవాడు ఊరుకోలేదు . ఎన్నికల ప్రచారంలో  ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చేందుకు   అమితాబ్ ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి పనులు చేయించే వారు. దీంతో ప్రజలు అమితాబ్ చుట్టూ తిరిగే వారు. దీంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది.

ఇది గిట్టని నేతలు అమితాబ్ పై ఫిర్యాదులు చేయడం మొదలెట్టారు. అమితాబ్ అదే తీరులో దూసుకుపోతే యూపీ కి సీఎం అవుతారేమో అని కొందరు నేతలు భయపడ్డారు. పార్టీ అండ ఉన్నా లేకపోయినా సొంత బలం తో అమితాబ్ ఎదిగిపోతారని చాలామంది నేతలు కలవర పడ్డారు. దీంతో అమితాబ్ మరో అధికార కేంద్రం గా మారుతున్నారని .. అధికారుల నియామకాలలో అమితాబ్ జోక్యం చేసుకుంటున్నారని …మంత్రులపై పనుల కోసం ఒత్తిడి తెస్తున్నారని  రాజీవ్ కు ఫిర్యాదులు పంపారు.

రాజకీయ నేతలు సహజంగానే ఫిర్యాదులు నమ్ముతారు. కొందరు మాత్రమే క్రాస్ చెక్ చేసుకుంటారు. రాజీవ్ అమితాబ్ పై వచ్చిన ఫిర్యాదులను నమ్మారు. ఒక రోజు అమితాబ్ ఢిల్లీ వెళ్లి రాజీవ్ ను కలిసినపుడు అక్కడ సీనియర్ నేత ఫోతేదార్ , రాజీవ్ వ్యక్తిగత సహాయకుడు  విన్సెన్ట్ జార్జి లు ఉన్నారు. అపుడు రాజీవ్  అమితాబ్ నుద్దేశించి మాట్లాడుతూ “ఫోతే దార్ మీ రాజీనామా కోరుతున్నారు” అన్నారు. దానికి స్పందించిన అమితాబ్ ” ఫోతేదార్ కోరుకుంటే అలాగే చేస్తాను” అంటూ వెంటనే జార్జి ఇచ్చిన పేపర్లపై సంతకాలు చేసి, రాజీనామా పత్రం రాసి ఇచ్చారు. 

ఈ విషయాలన్నీ ఫోతేదార్ తన ఆత్మకథ “ఆల్ టెల్” లో రాసుకున్నారు. అమితాబ్ ను .. మాధవరావు సింధియాను రాజకీయాలకు , మంత్రిపదవులకు దూరంగా పెట్టమని ఇందిరా గాంధే రాజీవ్ కి చెప్పారని …కానీ రాజీవ్ పట్టించుకోలేదని కూడా పేర్కొన్నారు. అమితాబ్ రాజీనామా విషయంలో తన పాత్ర లేదని ఫోతేదార్ చెప్పుకున్నారు.

రాజీవ్ వేరొకరి పేరు పెట్టి రాజీనామా అడిగినా ….  ఆ మాత్రం అర్ధం చేసుకోలేనంత  వెఱ్ఱివాడు కాదు అమితాబ్. దీన్నిబట్టి రాజీవ్ కూడా అమితాబ్ ఎదిగితే తనకు ముప్పుఅని భావించాడనే  చెప్పుకోవాలి. అమితాబ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అమితాబ్ నే ఉప ఎన్నికలో పోటీ చేయమన్నారు.

అలహాబాద్ లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. వేరొకరికి టిక్కెట్ ఇస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పాయి.  దీంతో ఇష్టంలేకపోయినా అమితాబ్ పేరునే  పార్టీ ప్రకటించింది. కానీ అమితాబ్ ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు . లోపాయికారీగా వీపీ సింగ్ కి కాంగ్రెస్ మద్దతు పలికింది.  నాటి ఎన్నికలో ఆయన గెలిచారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య దూరం పెరిగింది. 

ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>> ఆయనకు రాజకీయాలు నచ్చలేదా ?  

——————- K.N. MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!