ఆ సినిమా అందుకే తన్నేసిందా..శిశువా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………..

మార్క్సీయ వాక్యం …శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి.అదే వాక్యం కొంచెం కామెడీ గా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని   .. ముళ్లపూడి వెంకటరమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ …ఆయన తన సినిమాల్లో రాజకీయాలు బానే రాశారు. 
మన ఊరి పాండవులు చిత్రంలో ఆయన రాసిన సీను … మనోళ్లు మనూళ్లోనే ఫ్యాక్టరీలు అయ్యీ పెట్టేసి దారుణంగా అభివృద్ది చేసేస్తారు … ఆ తర్వాత ఇక మీ పిల్లలకీ ఉద్యోగాలొస్తాయి … ఈ లోగా మీకు టీలు కాపీలు అమ్ముకునే కాంట్రాక్టులొస్తాయి ..మరి అందుకోసం మీరు మరి ఇరాళాలియ్యాల … భూములియ్యాల అంటూ దాదాపు మన రోజుల్లో అధికారపక్ష నాయకులు చెప్పినట్టే చెప్తారు.

ఆ ఊరి దొరగారైన రావుగోపాల్రావుగారు. సెజ్ ల కోసం ఫ్లైవోవర్ల కోసం … రాజధానుల కోసం … పవర్ ప్రాజెక్టుల కోసం … ఇట్టా దేనికి పడితే దానికి భూసేకరణలు జరిపేయడం లాండు పుల్లింగు లాగింగు లాంటి దిక్కుమాలిన ఇంగ్లీషు పేర్లెట్టి చేసేస్తున్న అభివృద్ది మొత్తాన్ని అలా ఓ సీనులో చూపేశారాయన.

అట్టాగే … ఎన్నికల వ్యవస్థ మీద జోకేస్తూ మీ నల్లదొరలకు ఓట్లేయాలంటే ఈ బక్కోళ్ల ఒంట్లో కూసింత ఓపికుండాల కదరా … అంటాడు … కృష్ణావతారంలో కృష్ణ. ఇక అదే సినిమాలో మరో సీనులో అసలు మేమే కనుక అజ్ఞానం కొద్దీ నేరాల్చేయకపోతే … కోర్టులిండస్ట్రీ, పోలీసిండస్ట్రీ, జైళ్లిండస్ట్రీ అన్నీ ఏటైపోవాల .. మేం ఇలా కొవ్వుత్తుల్లా మా జీవితాలను కరిగించుకుంటూ మీ పోలీసోళ్ల, లాయర్ల జడ్జీల జైలధికారుల ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తున్నాం అంటాడు. 

ఈరో కృష్ణ. కోర్టుల్నీ, జైళ్లనీ, పోలీసుల్నీ ఇండస్ట్రీ చేయడంలోనే ఓ అద్భుతమైన చమక్కు కనిపిస్తుంది …అందాల్రాముడులో తీతా అదేనండి తీసేసిన తాసీల్దారు…అయితే … ఏమండీ రామదాసు ప్రభుత్వం వారి సొమ్ము తో రాముడికి గుడి కట్టిస్తే ఆయన్నేమో గొప్ప భక్తుడని కొలుస్తారా? నేనేదో తల దాచుకోడానికి ఓ చిన్న ఇల్లు ప్రభుత్వం వారి సొమ్ముతో కట్టించుకుంటే నేరమా అని విసుక్కోవడం …ఇలా అనేకం … పైగా ఆయన రాసే పొలిటికల్ డైలాగుల వెనుక అపారమైన జీవితానుభవం తో పాటు ఆయన చదివిన ప్రపంచ సాహిత్యమంతా కనిపిస్తుంది.

రాజాధిరాజు సినిమా విషయానికి వస్తే … ఆ సినిమాకు సంబంధించి నాకేం పెద్ద ఊహలేం లేవు.. అప్పుడు నేను ఇంటరో హంటరో చదువుతున్నా … జంధ్యాల గారు చెప్పినట్టు … రాజాధిరాజు అనే సినిమా విడుదలైన రోజే శోభన్ బాబు నటించిన చేసిన బాసలు అనే సినిమా కూడా విడుదలైంది.

అదేమో రామా టాకీసులోనూ … మరి రాజాధిరాజేమో కళ్యాణ చక్రవర్తిలోనూ వేశారు.అయితే … మా మిత్ర బృందం అంతా చేసిన బాసలు సినిమాకు వెళ్లారు. నేనూ ప్రసాదూ మాత్రం రాజాధిరాజుకు వెళ్లాం.మా రాధాకృష్ణ గాడైతే … అదేదో డివోషనల్ సినిమా బొత్తిగా ఎమోషన్స్ ఉండవు అని మరీ చేసిన బాసలు కు వెళ్లిపోయాడు. అదీ తన్నేసిందనుకోండి … రాజాధిరాజూ తన్నేసింది.

అయితే రాజాధిరాజు సినిమా చూడ్డానికి కొద్ది రోజుల ముందు మానికొండ లైబ్రరీలో మార్క్ ట్వేన్ రచన మిస్టీరియస్ స్ట్రేంజర్ తెలుగు అనువాదం విచిత్ర వ్యక్తి చదివాను. నండూర్రామోహన్రావుగారు … అనువదించినది … చాలా విచిత్రంగా అదే నవల కొద్ది పాటి మార్పులతో తెరకెక్కినట్టు అనిపించింది. విజయచందర్ కు కరుణామయుడుతో వచ్చిన ఇమేజ్ కి ఒక రకంగా బొక్కేసిందీ సినిమా. 

సినిమా బానే ఉన్నప్పటికిన్నీ … ఓడిపోయిన దేవుడి మీద కాన్సన్ ట్రేషన్ పెరిగిపోయింది … మిస్టీరియస్ స్ట్రేంజర్ ఇన్ ఫ్యులెన్స్ కు గురైంది … నేను ఓడిపోయిన దేవుణ్ణి శిశువా … అసలు నేను హీరోని కానీ విలనంటారు దుర్మార్గంగా అనిపిస్తారు సైతానుతో .. ఇలా సినిమా అంతా సైతాను గోలెక్కువై పోయి .. భక్తుల మనసులు గెల్వలేకపోయింది. 

అలా బాపు రమణ కల్సి విజయచందర్ కు ఓ ఫ్లాపును దయ చేశారు . అది క్రైస్తవ సినిమా అని హిందువులూ సైతాను సినిమా అని క్రైస్తవులూ సినిమాను దూరంగా ఉంచారన్నమాట. రామారావు చేసేవాడీలాంటి పన్లు … దేవుడి సినిమాలు తీస్తూ తాను రాక్షస వేషం వేసి అవే గొప్ప మానవత్వం ఉన్నవి అని ప్రూవ్ చేయించే ప్రయత్నం చేసేవాడు . అయితే ఏదో నాలుగైదు సినిమాలు నడిచాయి గానీ ఈ ధోరణిలో తీసిన చాలా సినిమాలు ఆయనవే తన్నేసినాయి. 

భక్తులా మజాకానా … అది రాజాధిరాజు కథ … పైగా ఇంకో సెక్యులర్ పైత్యం శ్రీ రామచిత్ర అని బ్యానర్ పేరెట్టడం … సినిమా తన్నమంటే తన్నదూ మరీ … ఏ .. క్రైస్తవ సినిమా తీసేప్పుడే … సైతాను పాత్ర గుర్తొచ్చి దాని మీద కాన్సన్ ట్రేట్ చేయాలనెందుకు అనిపించింది… మరి అన్ని రామాయణాలు తీశారు కదా … బాపు రమణలు … అప్పుడెందుకు రావణ పాత్రకు అల్లాంటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు … అనే అంశం మీద బాపు రమణల్ని నిలదీయవచ్చనుకోండి. 

అది వేరు సంగతి … అంటే హిందువుల సినిమాకొక నీతీ క్రైస్తవ సినిమాకో నీతా యువరానర్ …
ఇలాంటి రాజాధిరాజులో నూతన్ ప్రసాద్ పాత్రే దైతే ఉందో అది ముత్యాలముగ్గులో కాంట్రాక్టర్ పాత్రలా పేలుద్దనుకున్నారు. కానీ అంత కాదు కదా … అందులో మూడో వంతు కూడా పేల్లేదు.

ఇలాంటి గోల్డెన్ ఆఫర్ ఆ మధ్య రాజేంద్రప్రసాద్ కు కూడా ఇచ్చారు బాపు రమణలు … దాని పేరు రామబంటు … అందులో కోట క్యారెక్టర్ కూడా ముత్యాలముగ్గు కాంట్రాక్టరై పోతాడనుకుంటే జనాలకు ఎక్కలేదు. దరిమిలా రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది పాపం …అంచేత అదీ రాజాధిరాజు రేపిన జ్ఞాపకాల వెల్లువ. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!