Govardhan Gande …………………………………………
“వాళ్ళు” “వీళ్ల ” చెప్పులు మోయాలట! “వాళ్ళు” అంటే అధికార యంత్రాంగం. “వీళ్ళు” అంటే రాజకీయ నాయకత్వం. ఈ మాట అన్నది కేంద్రంలో గతంలో ఓ మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన ఓ మహిళా శిరోమణి. చెప్పులు ఎందుకు మోయాలి? అసలు చెప్పులు మోయడం ఏమిటి? ఎవరైనా మరొకరి చెప్పులు మోయడం ఏమిటి? ఎందుకు మోయాలి? “వీళ్ళే”మైనా ఆకాశం నుంచి ఊడి పడ్డారా? “వాళ్ళు” బానిసలా? అదేమీ కాదే.
“వాళ్ళు”,”వీళ్ల”తో సహా మిగతా వారందరూ సాధారణ ప్రజల నుంచి వచ్చిన వారే కదా. “వాళ్ళు” చదువుకొని పరీక్షల్లో ప్రతిభతో అధికారులయ్యారు. “వీళ్ళు” ప్రజలను ఓట్లు అడుక్కొని రాజకీయ నాయకత్వ స్థానాల్లోకి చేరుకున్నారు. ప్రతిభతో అధికార స్థాయి పొందిన “వాళ్లు” అడుక్కొని అధికారం పొందిన “వీళ్ళ” చెప్పులు మోయడం ఏమిటి విచిత్రంగా. ఇదేమైనా త్రేతా యుగమా చెప్పులు మోయడానికి. నిజానికి “వీళ్ళు” మాత్రమే జనం చెప్పులు మోయాలి.
ఎందుకంటే ఇది రాచరికం కాదు.అధికారం అప్పగించింది ప్రజలే. ఓట్లతో జనం అధికారం అందించారు. ఆ అధికారం జనం పెట్టిన భిక్ష కాబట్టి. ఇదంతా మరిచిపోయి ఇలా రాజుల్లాగా అహంకరిస్తే ఎలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి ఇక్కడ అహంకరించవలసింది ప్రజలు మాత్రమే. జనానికి ఆ హక్కు, అధికారం మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి.కానీ ఓట్లేసిన అమాయక జనం అలాంటి అహంకార పూరిత ధోరణిలో లేరు. “వీళ్ళ” అహంకారాన్ని,అణచివేతను అమాయకంగా భరిస్తున్నారు.
నిజంగా జనం కళ్ళు తెరిస్తే వీళ్ళ స్థానం ఎక్కడుంటుంది? అనుమానం లేకుండా ఖచ్చితంగా వీళ్ళు చెబుతున్న చెప్పుల స్థానంలో ఉంటుంది. నిజానికి అదే వీళ్ళ వాస్తవిక స్థానం జనం పాదాల వద్దనే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిజమైన యజమానులు. రాజ్యాంగం ప్రకారం “వీళ్ళ” (రాజకీయ నాయకత్వం)ది సేవక స్థానమే. అది మరిచిపోయి ఇలా అహంకరిస్తే ఎలా?
ఆ మాజీ మంత్రి పుంగవురాలి అహంకారం ఆ మాటతో మాత్రమే ఆగిపోలేదు. ఇంకా కొనసాగింది…“వాళ్ల”కు సామర్థ్యమే లేదట! పోస్టింగులు,జీతాలు ఇచ్చేది తామే నట! ప్రమోషన్లు,డిమోషన్లు ఇచ్చేది కూడా తామేనట! తమ రాజకీయాలకు “వాళ్ళ”ను వాడుకుంటా రట! ఇదీ “ఫైర్ బ్రాండ్” గా పేరొందిన ఈ నాయక శిరోమణి ప్రదర్శించిన అహంకారం. ఇది ఆవిడకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. దేశం మొత్తంలో రాజకీయ నాయకత్వానికి విస్తరించిన వైరస్.
ప్రజాస్వామ్యానికి పట్టిన ఈ వైరస్ కు సరైన టీకా వేసి నిర్మూలించవలసింది జనం మాత్రమే. జనానికి ఆ చైతన్యం కలిగేంత వరకు వీరి అహంకార వైరస్ ఇలా మహమ్మారి లా విజృంభిస్తూనే ఉంటుంది. చివరాఖరికి … మాటలన్నీ మాట్లాడాక … పొరపాటున అన్నానని అనడం ఏమిటో ? అసలు అనడమెందుకు ? చింతించడమెందుకు ?? ———-