Why KV Reddy said he won’t direct that film ……….
ఎన్టీఆర్ ‘భూకైలాస్’ (1958) సినిమాలో రావణబ్రహ్మ గా నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి మంచిపేరు కూడా వచ్చింది. ఇందులో అక్కినేని నారదుడిగా నటించారు. ఈ రెండు పాత్రలను దర్శకుడు శంకర్ బాగా మలిచారు. సముద్రాల వారు అద్భుతమైన డైలాగులు రాశారు.
అప్పటినుంచే ఎన్టీఆర్ కి రావణ పాత్రపై మక్కువ పెరిగింది. అభిమాన పాత్ర అయింది. ఆ విషయం ఆయన స్వయంగా కూడా చెప్పుకున్నారు. రావణుడు పరమ భక్తుడు. అంతటి భక్తిపరుడు సైతం పరకాంతను చెరపట్టి చెడుపేరును సంపాదించుకున్నాడు. ఈ పాత్రను చూసి జనం ఎంతయినా తెలుసుకోవలసి ఉందని ఎన్టీఆర్ అనుకునే వారు.
ఈ క్రమంలోనే ‘సీతారామ కళ్యాణం’ సినిమా తీసి రావణ పాత్రను మరో సారి పోషించాలని అనుకున్నారు.అదే సమయంలో డి.బి.వి. కృష్ణచౌదరి అనే ఆయన ‘సీతారాముల జననానికి, వారి కళ్యాణానికి రావణుడు ఏ విధంగా పరోక్షంగా కారణమయ్యారో’ వివరిస్తూ కథను రాశారు. ఈ విషయాన్నిఒక మిత్రుడు ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది. ఆ రచయిత తో మాట్లాడి హక్కులు తీసుకున్నారు. రచయిత సముద్రాల రాఘవాచార్య ను పిలిపించి రావణుని పాత్రను హైలైట్ చేయిస్తూ స్క్రిప్ట్ రాయించారు. దాన్ని ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డికి చూపించారు ఎన్టీఆర్.
అందులో కథ మొత్తం రావణుని చుట్టూ తిరుగుతోందని గమనించిన కేవీ రెడ్డి ఇందులో నీ పాత్ర ఏది అని అడిగారట. రావణ పాత్రను నేనే పోషిస్తున్నానని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. దాంతో కేవీ రెడ్డి ఆశ్చర్యపోయారట..
మాయాబజార్’ (1957) సినిమాలో ఎన్టీఆర్ ను శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దారు కేవీ రెడ్డి. కృష్ణుడంటే ఈయనే అన్న ఇమేజ్ వచ్చింది ఎన్టీఆర్ కి. అలాంటి ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రావణ పాత్ర పోషిస్తే బాగుండదని కేవీ రెడ్డి అభిప్రాయ పడ్డారు. శ్రీరామునిగా నువ్వు, రావణునిగా ఎస్వీఆర్ నటిస్తే బాగుంటుందని సూచించారు.
కానీ తానే రావణునిగా నటిస్తానని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. ఈక్రమంలో కేవీ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహించలేనని చెప్పారు. ఒకటి రెండు రోజులు ఆలోచించి తనే డైరెక్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చేసారు. వెంటనే నటీనటుల ఎంపిక కూడా చకచకా ముగించారు ఎన్టీఆర్..
సీతగా గీతాంజలి, రామునిగా హరనాథ్, లక్ష్మణునిగా శోభన్ బాబు, మండోదరిగా బి.సరోజాదేవి, విశ్వామిత్రునిగా గుమ్మడి, నారద పాత్రకు కాంతారావు లను ఖరారు చేసుకుని షూటింగ్ మొదలుపెట్టి అనుకున్న టైం ప్రకారమే ముగించారు. ఈ సినిమాకి పుండరీ కాంక్షయ్య, త్రివిక్రమరావు లు మొత్తం ప్రొడక్షన్ పనులు చూసారు.
‘సీతారామకళ్యాణం’ సినిమాకు సముద్రాల సీనియర్ అందించిన పాటలు, మాటలు ప్రేక్షకులను అలరించాయి. “సీతారాముల కళ్యాణం చూతము రారండి” పాట ఎవర్గ్రీన్ సాంగ్ గా నిలిచి పోయింది.సముద్రాల పాటలకు గాలి పెంచల నరసింహారావు సమకూర్చిన సంగీతం అజరామరంగా నిలచింది.
సినిమా ఆరంభంలోనే “దేవ దేవ పరంధామా…” అంటూ నారదుని నోట వినిపించే పాట, సందర్భానుసారంగా పలు మార్లు చిత్రంలో చోటు చేసుకుంటుంది. ‘జగదేక మాత కరుణించవే’ పాట ఇటు సీత పై అటు మండోదరి పై చిత్రీకరించడం విశేషం.సినిమాలో రాముడుగా హరనాథ్ ను అందంగా చూపారు.ఆయనకు డైలాగులు కూడా తక్కువే.
రావణుడు కైలాసాన్ని పెకలించాలని చేసే ప్రయత్నాలు అద్భుతంగా చిత్రీకరించారు. నంది రావణుని వెక్కిరించే సన్నివేశాలు బాగా పండాయి.. పైన కైలాసంలో శివ పార్వతుల నృత్యం… కింద రావణుడు 10 తలలతో కైలాసాన్ని పెకలించడం, పర్వతంపై సెలయేళ్లు దూకుతున్న దృశ్యం… అన్నీ ఒకే ఫ్రేమ్‌లో వచ్చేలా చేయడం ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ ప్రతిభకు నిదర్శనం.
ఆ తర్వాత ఉదరం చీల్చి.. ప్రేగులు బయటకు తీసి రుద్ర వీణ వాయించే దృశ్యాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. ఇక్కడ రవికాంత్ గురించి రెండు మాటలు చెప్పాలి. ఎన్టీఆర్ సొంత చిత్రాలకు ఎమ్.ఏ.రహమాన్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరించేవారు. ఆయనంటే ఎన్టీఆర్ కు ఎంతో గౌరవం.
ఎన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’ (1949)కు రహమాన్ ఛాయాగ్రాహకుడు. ఎన్టీఆర్ ను తొలిసారి తెరపై చూపించింది రహమానే. మొదట సీతారామ కళ్యాణం కు రహమాన్ ను సినిమాటోగ్రాఫర్ అనుకున్నారు.తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి,తీస్తోన్న ‘సీతారామకళ్యాణం’ సినిమా ప్రారంభోత్సవానికి రహమాన్ హాజరు కాలేదు.
దాంతో అవకాశాల అన్వేషణలో ఉన్న ‘రవికాంత్ నగాయిచ్’ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. అతగాడికి ఇదే మొదటి సినిమా.. రవి కాంత్ కూడా తన సత్తా నిరూపించుకున్నారు. తర్వాత కాలంలో దాదాపు పది సంవత్సరాలు ఎన్టీఆర్ సొంత చిత్రాలకు రవికాంత్ నగాయిచ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు.
కైలాసాన్ని పెకిలించే సన్నివేశంలో ఎన్టీఆర్ అభినయం చూసినవారికి ఒళ్ళు పులకరిస్తుంది. సినిమా మొత్తం లో వివిధ సన్నివేశాల్లో రావణ పాత్రలో ఎన్టీఆర్ హావభావాలను .. అభినయాన్ని చూసిన ఆనాటి నటులు ‘నభూతో నభవిష్యతి’ అని కీర్తించారు.
తర్వాత ఒక సందర్భం లో కలిసినపుడు ‘అనుకున్నది సాధించావుగా’ అని ఎన్టీఆర్ ను కే.వీ.రెడ్డి ప్రశంసించారట. ఈ సినిమా టైటిల్స్ లో దర్శకుడిగా ఎన్టీఆర్ తన పేరు వేసుకోలేదు. అయినప్పటికీ ఆయన ప్రశంసలు అందుకున్నారు. సీతారామ కళ్యాణం సినిమా యూట్యూబ్ లో ఉంది … చూడని వారు చూడవచ్చు. చూసినవారు చూడ వచ్చు.
————-KNM