పట్టుదలకు మరోపేరు ఈ పరాశరన్ !!

Sharing is Caring...

All the family are lawyers………………………….

పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు పరాశరన్. రామ జన్మభూమి కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు లో సుదీర్ఘ కాలం హిందువుల తరపున వాదనలు వినిపించింది ఈయనే. తమిళనాడుకి చెందిన పరాశరన్ సీనియర్ న్యాయవాది. ఆరు దశాబ్దాల అనుభవం గల పరాశరన్ తమిళనాడు లోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. ఈయన తండ్రి కూడా పేరున్న న్యాయవాది, వేద పండితుడు.

పరాశరన్ 1958 లో సుప్రీం కోర్టు లాయర్ గా ప్రాక్టీస్ మొదలెట్టారు.హిందూ మత గ్రంధాలను చిన్నప్పుడే ఔపోసన పట్టిన పరాశరన్ తనకున్న పరిజ్ఞానాన్ని రామజన్మభూమి కేసు లో ప్రదర్శించారు.రాముడి కాలంలోనే సముద్రంలో వారధి నిర్మాణం జరిగిందని తన వాదనలో వినిపించారు.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ కేసును ఆయనే వాదించారు. ఒక్క వాయిదా కు కూడా గైర్హాజరు కాకపోవడం విశేషం.  పని పట్ల అంత చిత్తశుద్ధి చూపేవారు.పరాశరన్ 93 సంవత్సరాల వయస్సులో కూడా విచారణ కొనసాగినంత సేపూ నిల్చునే తన వాదనలను వినిపించడం మరింత గొప్ప విషయం.

ఆయన వయసు రీత్యా కూర్చొని మాట్లాడమని ధర్మాసనం సూచించినప్పటికీ సున్నితంగా తిరస్కరించి నిలబడే వాదించారు.చివరికి పరాశరన్ వినిపించిన వాదనలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. రామ్ లల్లా విరాజ్ మాన్ కే వివాదాస్పద స్థలం దక్కుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయిదుమంది సభ్యుల ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ నజీర్ సైతం పరాశరన్ వినిపించిన వాదనలను కాదనలేకపోయారట.కేసు గెలిచిన దరిమిలా ముస్లింల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వచ్చి పరాశరన్ ను అభినందించి వెళ్లారు.

ఇక శబరిమల కేసులో కూడా ఈయనే లాయర్. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి పరాశరన్ తన వాదనను వినిపించారు.శబరిమల ఆలయంలో రుతుస్రావం సమయంలో మహిళల ప్రవేశాన్ని ఆపడం  సరైనదేనని వాదించారు.  అలాగే సేతు సముద్రం ప్రాజెక్టు పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదునైన వాదనలు వినిపించారు.

పరాశరన్ 1976 లో తమిళనాడు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ గా పని చేశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ గా 1983 నుంచి 1989 వరకు పని చేశారు. భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్  పురస్కారాలతో ఈయనను సత్కరించింది.

2012 లో పరాశరన్ ను ఆనాటి రాష్ట్రపతి రాజ్యసభ  సభ్యునిగా  నామినేట్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా 2014 లో జాతీయ న్యాయ నియామక కమిషన్‌ను సమర్థించారు. పరాశరన్ ముగ్గురు కుమారులు మోహన్, సతీష్, బాలాజీ కూడా న్యాయవాదులు కావడం విశేషం. ఇక నాలుగో తరం వారు కూడా న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు.

 ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’  ట్రస్టుకు పరాశరన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.  రామ మందిరం నిర్మాణ పనులను ప్రారంభించిన రోజు ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.  అయోధ్య కేసులో పరాశరన్ తోపాటు వాదించిన జూనియర్ లాయర్ పమిడిఘంటం నరశింహం ఆంధ్రాకి చెందినవారు. నరసింహం గారి  తండ్రి కీ. శే. పమిడిఘంటం కోదండరామయ్యగారు హైకోర్టులో జడ్జి గా చేసి రిటైర్ అయ్యారు . వీరే  భద్రాచలం లోని  అంబసత్రం ధర్మకర్తలు.
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!