నాగభూషణ రావు తుర్లపాటి…………………………………………..
లోకం చాలా చిత్రమైనది. లేకుంటే, ఒక తల్లి తన కొడుకును చంపితే ఎందుకు హర్షిస్తుంది ? ఆ మాతృమూర్తి కుమారుడ్ని చంపగానే లోకం తెగ సంబరపడిపోయింది. సంబరాలు చేసుకుంది. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంది. ఆనాటి నుంచి ప్రతి ఏటా పండుగ జరుపుకోవడం సమాజంలో ఆచారమైపోయింది. అదే నరకచతుర్ధి- దీపావళి పండుగ.
ఈ సంఘటన 28వ ద్వాపర యుగంలో జరిగింది. అనంత కాలచక్రంలో నాలుగు యుగాలు (కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలు) గిరగిరా తిరుగుతూ ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి. ఆ కాలచక్ర పరంపరలో 28వ ద్వాపర యుగం వచ్చింది. ఆ యుగంలోనే ఈనాడు మనం దేవుడని కొలిచే శ్రీకృష్ణుడు, అలాగే, లోక కంఠకుడని అసహ్యించుకునే నరకాసురుడు ఈ భూమిపై తిరిగారు.
నరకాసురుడు భూమిపుత్రుడు. విష్ణువు- వరాహమూర్తి అవతారంలో ఉన్నప్పుడు భూదేవి అనే కన్యను వివాహమాడాడు. వీరిద్దరి సంతానమే నరకుడు. 28వ త్రేతాయుగం (రాముడు పుట్టిన త్రేతాయుగం కాదు ఇది) – 28వ ద్వాపరయుగం మధ్య సంధికాలం ఉంటుంది.
ఆ సమయంలో ఏ యుగపు ప్రామాణిక లక్షణాలు కనిపించవు. ఎవ్వరూ ఊహించని విచిత్రాలు జరుగుతుంటాయి. విచిత్రజీవుల పుట్టుక జరుగుతుంటుంది. జీవ పరిణామక్రమంలోనే అద్భుతాలు చోటుచేసుకుంటాయి. అలా ఆవిర్భవించిన జీవి – వరాహుడు. పంది ముఖం, మనిషి దేహం వాడిది. కానీ సద్భుద్ధి అపారంగా ఉంది.
ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేడు. సరిగా అదే సమయంలో హిరణ్యాక్షుడు (ఇతడు ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపునికి సోదరుడు) మహా ఖగోళశాస్త్రవేత్త. విశ్వంలోని గోళాల కదలికను బాగా అధ్యయనం చేసినవాడు. గ్రహగతులను ఆనాడే సిద్ధాంతీకరించినవాడు. ఎందుకో వాడికో బుద్ధి పుట్టింది. ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు.
అంతే,భూమి అనే గ్రహాన్ని తీసుకువెళ్ళి సూర్యునికి సుదూరంగా వేరే కక్ష్యలోకి పెట్టాలనుకున్నాడు. ఆ వెంటనే భూమిని తన శాస్త్రశక్తితో కక్ష్య తప్పించి అంతరిక్షంలోని శూన్యంలోకి తీసువెళ్ళాడు. ఆ శూన్యం ఎలా ఉన్నదంటే, మహా జలనిధిలా ఉంది. అందులో భూమిని ముంచుతూ, తేలుస్తూ తీసుకువెళుతున్నాడు హిరణ్యాక్షుడు.
దీన్నే సినిమాల్లో సముద్రంలో భూమి మునిగినట్లు, వరాహుడు తన వాడి దంతాలతో భూమిని పైకి లేపి రక్షించినట్లు చూపిస్తుంటారు. పురాణాల్లో కూడా అనంత జలనిధిలోకి భూమి గిరాటేయబడినట్లు ఉంటుంది. అయితే ఇక్కడ అనంత జలనిధి అంటే అంతరిక్షంలోని అపార వాయువులతో కూడిన శూన్యమనే అర్థంచేసుకోవాలి. అలా, హిరణ్యాక్షుడు చేసిన ప్రయోగంతో భూమి అల్లల్లాడుతోంది. ఈ విషయం విచిత్ర జీవి, మహామేధావి అయిన వరాహమూర్తికి తెలిసింది.
వెంటనే భూదేవిని రక్షించేందుకు వెళతాడు. కక్ష్యతప్పి ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న భూమిని మళ్ళీ స్థిరకక్ష్యలోకి ప్రవేశపెట్టి యధాస్థితి కల్పిస్తాడు. దీంతో భూమి ఎంతో సంతోషించింది. ఆ ఆనందపారవశ్యంలో భూదేవీ, వరహస్వామి ఏకమవుతారు. అయితే వారు కలయుక సాయం సంధ్యవేళలో జరుగుతుంది. దుష్టశక్తులు విరుచుకుపడే వేళ అది. ఆ సమయంలో రమించడంతో వారికి దుష్ట స్వభావాలతో ఒక పుత్రుడు జన్మిస్తాడు.
వాడికి నరకుడు అని నామకరణం చేస్తారు. వాడిలోని అసురలక్షణాలు (దుష్ట లక్షణాలు) చూసిన తల్లి కలవరపడుతుంది. నరకాసురుడైన తన పుత్రుడ్ని ఎప్పటికైనా దేవతలు సంహరిస్తారని ఆమెకు అర్థమైంది. తానూ, తన భర్త (వరాహమూర్తి) దేవతాంశులైనప్పటికీ, పుట్టిన బిడ్డ అసురడవడంతో తండ్రి నుంచి కూడా ప్రమాదం ఉన్నదని ఆ తల్లి భయపడుతుంది.
తండ్రి నుంచి కూడా రక్షణలేని వాడికి, ఆ తండ్రి నుంచే ఒక వరం పొందేలా చూడాలని అనుకుంటుంది. భర్తను వేడుకుంటుంది. ఆమెలోని భయం కనిపెట్టిన స్వామి వరం ప్రసాదిస్తాడు. ఒక్క తల్లి వల్ల తప్ప మరెవరివల్లనూ, ఏ ఆయుధం వల్లనూ మరణం లేకుండా వరం పొందాడు నరకుడు. తల్లి భూదేవి సంతోషిస్తుంది. మాతృమార్తి ఎక్కడైనా తన కుమారుడ్ని చంపుకుంటుందా…! అది ఎన్నటికీ జరగదనుకుని భూదేవి చాలా సంతోషంగా ఉంది.
ఈలోగా నరకుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. చిన్నప్పుడు వాడు సౌమ్యంగానే ఉండేవాడు. ఆదిశక్తి జగదాంబ ను ధ్యానిస్తూ కాలం గడిపేవాడు. యవ్వనం రాగానే వాడిలో వింతకోరికలు పుట్టాయి. స్త్రీజాతిని అవమానించడం మొదలుపెట్టాడు. లోకం లోని కన్యలను చెరబట్టడమే వాడి పని. కేవలం అందుకోసమే అనేక రాజ్యాలపై దండయాత్రలు చేసి లక్షా60వేల మంది రాజకుమార్తెలను (కన్యలను) బందీచేశాడు.
బలగర్వంతో, వర గర్వంతో విర్రవీగాడు. స్వర్గంపై దండయాత్రచేసి ఇంద్రుడ్ని పదవీచ్యుతుణ్ణి చేశాడు. ఇలా రోజుకో అరాచకం చేస్తూ లోక కంఠకుడయ్యాడు. దీంతో నరకుడు అనే మంచి కుర్రాడు కాస్తా నరకాసురుడిగా మారిపోయాడు. ద్వాపరయుగం నడుస్తోంది. శ్రీకృష్ణుడు పెద్దవాడై లక్ష్మీదేవి అంశతో పుట్టిన రుక్మిణీదేవిని పరిణయమాడాడు. ఆ తర్వాత సత్యభామను పెళ్ళిచేసుకున్నాడు.
ఈ సత్యభామ ఎవరో కాదు, భూదేవి అంశతో పుట్టిన స్త్రీమూర్తి. నరకాసురుడి ఆగడాలు ఆమెకు కూడా తెలిశాయి. నాయకత్వ లక్షణాలున్న వీరనారి సత్య నరకాసురుడు స్త్రీలను చెరబట్టడాన్ని క్షమించలేకపోయింది. నరకాసురునికి బుద్ధిచెప్పాలనుకుంది. అందుకే శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతుంటే తానూ వెంట వెళ్ళింది. అక్కడ యుద్ధభూమిలో నరకాసురుడు వరబలంతో రెచ్చిపోతున్నాడు.
అతగాడిని ఏ ఆయుధాలు ఏమీ చేయలేకపోతున్నాయి. వాడు విసిరిన ఒక ఆయుధం శ్రీకృష్ణుడికి తగిలింది. ఇదే మంచి సమయం అనుకున్న శ్రీకృష్ణుడు సొమ్మసిల్లినట్లు నటించాడు. పక్కనే ఉన్న సత్య ఆగ్రహోదగ్రురాలైంది. అపర త్రిపురసుందరిగా మారింది. విల్లు చేతబట్టింది. నారి సారించింది. బాణం విడిచింది. అంతే ఆ శరాఘాతానికి నరకుడు కుప్పకూలిపోయాడు.
తల్లి చేతిలో తప్ప వేరెవ్వరి చేతిలోనూ మరణం లేదని వరం ఉండగా , ఈమె చేతిలో తాను ఎలా కుప్పకూలిపోయాడో వాడికి ఒక్క క్షణం అర్థంకాలేదు. అర్థంచేసుకుని ఎదురుగా ఉన్నది తన తల్లే అని తెలుసుకుని ప్రణమిల్లాడు. అసలు విషయం తెలుసుకుని సత్య కూడా కొద్దిసేపు మనస్తాపానికి గురైంది.
కానీ లోకకంఠకుణ్ణి తల్లి కూడా క్షమించరాదని కృష్ణుడు చెప్పడంతో ఆమె ఊరడిల్లింది. లోక కంఠకుడైన వాడు తనవాడైనా క్షమించకూడదన్న ధర్మాన్ని లోకానికి చాటారు సత్యాకృష్ణులు. నరకాసుర సంహారం జరిగిందని తెలియగానే లోకం హర్షించింది. విజయోత్సాహంతో సత్యాకృష్ణులు ద్వారకకు రాగానే ఊరంతా పండుగ చేసుకున్నారు.
అప్పటి నుంచి ఈ కథను గుర్తుచేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి తీపిగురుతుగా నరకచతుర్ది- దీపావళి రోజుల్లో పండుగ చేసుకుంటున్నాము. ప్రపంచశాంతి కోరుకునేవారందరికీ ఈ పండుగ ఓ స్ఫూర్తి.
photo courtesy… bhushana rao