Kala Bhairava …………………………………..
లయకారుడైన పరమ శివుడి వల్ల జన్మించి సృష్టికర్త బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించిన కాలభైరవుడికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని అన్నాడు.
శివుడు అందుకు అంగీకరించలేదు.ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. చాలాసేపు వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం మొదలు పెట్టాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో… మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము ధరించిన ఆ భయంకర రూపుడే కాలభైరవుడు.
శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది.
అనంతరం కాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా ‘‘నీవు బ్రహ్మ శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కాబట్టి నువ్వు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చాడు. అపుడు కాలభైరవుడు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించాడు.
అయినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకం తొలగలేదు. ఈ క్రమంలో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -‘‘కాలభైరవా! నీవు శివ పుత్రుడవు కాబట్టి శివుడితో సమానం. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జన్మించినవాడవు. నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. వెంటనే కాశీ క్షేత్రానికి వెళ్ళు… కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహా ఇచ్చాడు.
విష్ణువు కి నమస్కరించి కాశీకి చేరుకున్నాడు. అక్కడికి రాగానే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోయింది. కాలభైరవుడు బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. ఆ బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’.
ఆ తర్వాత కాశీక్షేత్రంలో కాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ… కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం ఒక ఆచారంగా మారింది.