ఆమె పార్టీ పెట్టింది అందుకేనా ?

Sharing is Caring...

Will her strategies work? …………..

దివంగత నేత జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ‘ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం” (AIPTMMK) పేరుతో  కొత్త పార్టీని ప్రకటించారు.చాలాకాలంగా చిన్నమ్మ అన్నా డీఎంకేలోకి మళ్ళీ చేరేందుకు ప్రయత్నించారు. కొంతమందితో రాయబారాలు నడిపారు. అయితే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి (EPS) అందుకు ససేమిరా అనడంతో ఇక చేసేదేమీ లేక సొంత పార్టీ పెట్టారు.

పళనిస్వామి (EPS) చిన్నమ్మ ను దూరం పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఏఐఏడీఎంకేపై పళనిస్వామికి పూర్తి పట్టు ఉంది. శశికళ మళ్లీ పార్టీలోకి వస్తే తన నాయకత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన భావిస్తున్నారు. శశికళ తనను జయలలిత రాజకీయ వారసురాలిగా చెప్పుకుంటున్నారు. ఆమెను చేర్చుకుంటే పార్టీ మళ్లీ శశికళ చేతుల్లోకి వెళ్తుందని కార్యకర్తల్లో ప్రచారం చేస్తున్నారు.

శశికళపై ఉన్న అవినీతి ముద్ర పార్టీకి నష్టం కలిగిస్తుందని, ఆమెతో కలిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పళనిస్వామి పార్టీ నేతలకు చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిని చేసిన శశికళనే ఎదిరించి ఆయన పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ఆమెను చేర్చుకుంటే తన రాజకీయ ఉనికికే ప్రమాదమని భావించి, ఆమెను పార్టీలోకి రానిచ్చేది లేదని పదే పదే స్పష్టం చేస్తున్నారు.

శశికళ పార్టీ ప్రభావం ప్రధానంగా ఆమె సొంత సామాజిక వర్గమైన తేవర్ ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలపై కొంతమేరకు పడే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషణల ప్రకారం, దాదాపు 13 జిల్లాల్లో ఆమె పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది.. సుమారు 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తేవర్ సామాజిక వర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉంది.

అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ఈ వర్గం ఓట్లు శశికళ వైపు మళ్ళితే ఎడపాడి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు గట్టి దెబ్బ తగులుతుంది. 2026 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయించబడే సీట్లలో, శశికళ పార్టీ చీల్చే 1,000 నుండి 5,000 ఓట్లు కూడా అన్నాడీఎంకే కూటమి అవకాశాలను దెబ్బతీయవచ్చు.

యా జిల్లాల్లో బలమైన స్థానిక నాయకులను తన పార్టీ వైపు తిప్పుకోవడం ద్వారా శశికళ తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నారు.చిన్నమ్మ అసలు లక్ష్యం గెలవడం కంటే, ఎడపాడి పళనిస్వామి (EPS) ని దెబ్బతీసి, అన్నాడీఎంకే కార్యకర్తలను తన వైపు తిప్పుకుని, పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకోవడమే ఆమె ప్రధాన వ్యూహం.

తనే అసలైన “జయలలిత వారసురాలిని” అని నిరూపించుకోవాలని ఆమె తపన పడుతున్నారు. పార్టీ పేరులో “పురట్చి తలైవర్” (MGR) పేరును చేర్చడం ద్వారా తాను ఎంజీఆర్, జయలలిత ఆశయాల కోసమే పనిచేస్తున్నానని ప్రజల్లోకి సందేశం పంపారు.  

ప్రస్తుతానికి ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేరు కాబట్టి, తన పార్టీ ద్వారా కనీసం 5-10% ఓట్లను చీల్చగలిగితే, ఏఐఏడీఎంకే ఓడిపోయేలా చేయవచ్చు. తద్వారా “నేను లేకపోతే మీరు గెలవలేరు” అని నిరూపించి, భవిష్యత్తులో అన్నాడీఎంకే తనతో రాజీకి వచ్చేలా ఒత్తిడి తీసుకురావడమే ఆమె లక్ష్యం.

అలాగే తన కుటుంబ సభ్యులు (TTV దినకరన్ వంటి వారు)  తన సామాజిక వర్గం (తేవర్లు) రాజకీయంగా అణగారిపోకుండా, వారికి ఒక బలమైన వేదికను కల్పించి వారిని పార్టీలోకి చేర్చుకుంటూ,రాజకీయంగా తనను పక్కన పెట్టిన వారికి బుద్ధి చెప్పాలని, తాను ఇంకా తమిళ రాజకీయాల్లో ఒక శక్తిని అని చాటిచెప్పడమే ఆమె తక్షణ అజెండా.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే,మేనల్లుడు టీటీవీ దినకరన్,శశికళ రాజకీయంగా ఒకటయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే డీఎంకే లో చేరిన పన్నీర్ సెల్వం (OPS) కూడా శశికళతో కలిసే అవకాశాలు ఉన్నాయి.

అవినీతి కేసులో శిక్ష పడటం వల్ల శశికళ 2027 వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు. ఆమె తన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టి ఏఐఏడీఎంకే గెలుపు అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎంతమంది చిన్నమ్మను నమ్మి ఆమె పార్టీ లోకి వెళతారు అనేది ప్రశ్న.

ఆమె సామాజివర్గానికి చెందిన అభ్యర్థులకు అటు డీఎంకే ,ఇటు అన్నాడీఎంకే కూడా టిక్కెట్లు ఇస్తాయి. ఆ రెండూ బలమైన పార్టీలు కాబట్టి వాటిని వదిలి 71 ఏళ్ల చిన్నమ్మ పార్టీలోకి ఎంతమంది వస్తారు అనేది కూడా సందేహమే. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!