ఎవరీ నిషాదులు ? ఎచటివారు ?

Sharing is Caring...

Thopudu bandi Sheik Sadiq Ali  …………  

కాకతీయుల చరిత్ర (1 )

రాస్తున్నది కాకతీయుల చరిత్రే అయినా …..దాని మూలాల్లోకి వెళ్ళటం అవసరం అని భావించి ఈ వ్యాసాన్నివ్యాస విరచిత మహాభారతం తో ప్రారంభిస్తున్నాను. మహాభారతంలో చర్చించిన పలు గిరిజన తెగలలో ప్రధానమైనవి రెండు . ఒకటి అపరాంతకులు….వీళ్ళు రాజస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో నివసించేవారు. వీరి ప్రస్తావన వాత్సాయన కామ సూత్రాలలోనూ ఉంది.

మరొకటి నిషాదులు. ఏకలవ్యుడి సంతతిగా ప్రఖ్యాతి గాంచిన వారు. వీరు ప్రస్తుత ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన వారు. ఈ వ్యాసం వారి గురించే కాబట్టి కాస్త విపులంగా చర్చిద్దాం. మహాభారత సంగ్రామం,కృష్ణ నిర్యాణం తదనంతర కాలంలో ఈ రెండు తెగలూ నర్మదా నదిని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించాయి. అయితే ,అపరాంతకుల కన్నా చాలా ముందుగానే నిషాదులు వలస వచ్చారు.

ఈ నిషాదులనే కిరాతులు కూడా అంటారు. వీరి జీవన విధానం గురించి వ్యాస మహాభారతంలో వివరించారు. వీళ్ళు ఉభయ చరులు. అంటే ,అటు అడవులలోనూ ,ఇటు వాటికి ఆనుకొని ఉన్న మైదాన ప్రాంతాల్లోనూ జీవించగలరు. విలు విద్య,బాణాలు,ఇనుము,ఉక్కుతో ఆయుధాలు,ఇతర సామాగ్రి తయారు చేయటంలో వీరు నేర్పరులు. ఉత్తరాఖండ్ లోని పలు క్షేత్రాలలో దర్శనం ఇచ్చే భారీ త్రిశూలాల తయారీలో ఈ నిషాదుల పాత్రే కీలకం .

శారీరకంగా బలంగా ఉండటం, ఉక్కు మీద పట్టు ఉన్న వీరు దక్షిణ భారత దేశపు అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత నుంచి అసలు కథ మొదలయ్యింది.ఏకలవ్యుడు మహాభారతం లోని ఒక పాత్రే అయినప్పటికీ అతను ఒక జాతికి ప్రతీక. ఆ జాతి వీరత్వం ,ధీరత్వం,వ్యక్తిత్వం , డీ ఎన్ ఏ లకు చిరునామా. ఆ జాతి వారైన నిషాదులు దక్షిణ భారత దేశం లోకి ప్రవేశించిన తర్వాత అంచెలంచెలుగా తెలంగాణా,ఆంధ్రప్రదేశ్,కర్నాటక,తమిళనాడు,చివరిగా శ్రీలంక వరకూ చేరుకున్నారు.

ఏడాదిలో కేవలం నాలుగైదు నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలు ఉన్న ఉత్తరాఖండ్ నుంచి ఏడాది పొడవునా ఉపాధి లభించే దక్షిణాపధం నే తమ కర్మ భూమిగా చేసుకున్నారు. ఉక్కు తమ ప్రధాన జీవనాధారం అవటంతో ఉక్కు ఖనిజం పుష్కలంగా లభించే ప్రాంతాల చేరువలో తమ నివాసాలనుఎర్పర్చుకున్నారు.

ఆ క్రమంలో తెలంగాణా లోని ఆదిలాబాద్,కరీంనగర్ వరంగల్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ,ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు,కర్నాటక లోని బెల్గాం,బళ్ళారి ప్రాంతాలు,తమిళనాడులోని కొడుమనాల్, కేరళ లోని మలబార్ ,శ్రీలంకలోని సమనల వేవ, తిప్పమహారామ ,అనురాదాపురం ప్రాంతాల్లో స్థిరపడ్డారు.(వీరిలో మరో వర్గం నల్లమల అటవీ ప్రాంతపు సరిహద్దుల్లో ఉన్న మహబూబ్ నగర్,కర్నూలు,గుంటూరు,ఒంగోలు,కడప ప్రాంతాల్లో స్థిరపడ్డారు..)

ఉక్కు,ఆయుధాల తయారీ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వీరు సహజంగానే అక్కడ రాజ్యాలు ఏలుతున్న రాజులకు,రాజ వంశీయులకు సన్నిహితులు అయ్యారు.ఆయుధాల సరఫరాతో పాటు, దేహ దారుడ్యం,ఆయుధాల ప్రయోగంలో నైపుణ్యం ఉండటంతో రాజుల సైనిక బలగాల్లో వివిధ హోదాల్లో కొలువులు కూడా చేసేవారు. ఇదంతా క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దం నుంచీ జరుగుతూ వచ్చింది.అలాగే అరేబియా సముద్ర తీరం నుంచీ ,హిందూ మహాసముద్రం నుంచీ కూడా విదేశాలకు ఖడ్గాలు,సముద్రంలో ప్రయాణించే ఓడలకు అవసరమైన లంగర్లు,శుద్ధి చేసి,పోతపోసిన ఉక్కు దిమ్మెలు కూడా ఎగుమతి చేసేవారు.

అరబ్బుల మధ్యవర్తిత్వంతో సిరియా,లెబనాన్,అక్కడి నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతులు జరిగేవి. ఈ ఉక్కు దిమ్మెలతోనే తదనంతర కాలంలో డమాస్కస్ లో ఖడ్గాల తయారీ పరిశ్రమలు నెలకొని ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ నిషాదులు ఆయా రాజ వంశీకులకు చేరువైన క్రమంలో తమిళనాడులో ఆరో శతాబ్దానికి చెందిన చేర రాజ వంశీయులకు ఇక్కడ రాష్ట్ర కూటులకు తదనంతరం కళ్యాణీ చాళుక్యులకు సన్నిహితులు అయ్యారు.ఇక్కడి నుంచి నేరుగా మన కాకతీయుల చారిత్రిక నేపధ్యంలోకి వెళ్దాం.

 ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>  హిమాలయ శిఖరాల అంచుల్లో

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!