‘స్పెషల్ షో’ లతో లాభమెవరికి ??

Sharing is Caring...

కఠారి పుణ్యమూర్తి ………………………………………

No lose to fans………………………………………..

రాజకీయ కోణం లోంచి కాకుండా ప్రేక్షకుడి దృష్టి కోణంలో నుంచి చూస్తే ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన నష్టాలేమి లేవు. టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు… ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అని చట్టం చెబుతోంది. దీని వల్ల ప్రజలకు వచ్చే కష్టాలు .. అభిమానులకు జరిగే నష్టాలు ఏమీలేవు.

తమ అభిమాన హీరో సినిమా మార్నింగ్ షో చూడాలనుకునే ఫ్యాన్స్ నుంచి టిక్కెట్టు రేటు వెయ్యి రూపాయలు పెట్టి దోచుకోవడం సరికాదు అంటోంది ప్రభుత్వం … అందులో తప్పేమిటి ? అలాగే పగలూ రాత్రీ వరసగా షోస్ వేయడం తప్పు….దేనికైనా ఓ పద్దతి ఉండాలంటోంది .. అందులోనూ తప్పేం లేదు. టిక్కెట్ల ధర ఇష్టమొచ్చిన రీతిలో పెంచడం మూలాన అభిమానులకు నష్టమే కానీ లాభమేమి లేదు. 

@ సంవత్సరానికి పది సినిమాలు 1500 పెట్టి చూసినా 15వేల రూపాయలు ఫ్యాన్స్ కోల్పోయినట్టే. ఆ డబ్బుని ఆదా చేసుకుని ఫ్యాన్స్ కనీస అవసరాలకు వాడుకోవచ్చు.@ సినిమా నిర్మాణానికి వందల కోట్లు ఖర్చుపెట్టమని  ఎవరైనా అడుగుతున్నారా ? గతం లో లోబడ్జెట్ సినిమాలు రాలేదా ? ప్రేక్షకులు చూడలేదా ? సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం ఎవరు ? పారితోషకం ఎందుకు పెంచుతున్నారు ? 

@  రాజమౌళి, శంకర్, గుణశేఖర్ తదితరులు గొప్ప డైరెక్టర్లు కావచ్చు.. కానీ మన సినిమా.. దాని వ్యాపార పరిధి తెలుసుకోకుండా వాళ్ళ ఖరీదయిన ఊహలకు, జనాల హీరో ఆరాధన అనే బలహీనతని (నాకు కూడా ఈ బలహీనత ఉంది…నేను చిరంజీవి వీరాభిమానిని) ఊతంగా చేసుకుని  సెట్టింగ్ లకు,హీరోల పారితోషకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.. ఆ డబ్బంతా ప్రేక్షకుల నుంచే గుంజుతున్నారు.

@  రాజమౌళి లాంటి ఫ్యామిలీ పారితోషక ప్యాకేజీ దర్శకులు, పెద్ద హీరోలు మూడేళ్ళకి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ అధికంగా డబ్బులు తీసుకుంటున్నారు… సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు చెయ్యడం వల్ల వారి ఆదాయం తగ్గదు…
(రాజమౌళి అయితే తనకి, తన భార్య కి, తండ్రికి, అన్నయ్యలకి, వదినలకి, పిల్లలకి అందరికీ సుమారు 200 కోట్లు తీసుకుంటారని టాక్)

@ సినిమా నిర్మాణం ఖర్చులో 75 శాతం హీరోలకు, దర్శకుడికే వెళ్లిపోతుంది… చిన్న ఆర్టిస్టులు, కార్మికులు బ్రతికే పరిస్థితి లేదు… పెద్ద హీరోలు, దర్శకులు తాము తీసుకునే పారితోషకం 50 శాతం తగ్గిస్తే వారు నష్టపోయేది ఏమీ లేదు ఎందుకంటే ఇప్పటికే ఒక యాభయ్ తరాలకు సరిపడా ఆస్తి సంపాదించేశారు.

@  హీరో, దర్శకుల పారితోషకం తగ్గితే మంచి నిర్మాతలు వస్తారు… మంచి సినిమాలు వస్తాయి…మంచి నటులు వెలుగులోకి వస్తారు…సినీ కార్మికులు బ్రతుకుతారు…@   పైరసీ ప్రస్తుతం పెద్ద సమస్య కాబట్టి దానిని అరికట్టే సాంకేతికత సమకూర్చుకోవాలి.. తద్వారా సినిమాలు ఎక్కువ రోజులు ఆడించుకోవచ్చు.ప్రస్తుతం అవ్వా కావాలి, బువ్వా కావాలనే రీతిలో తొలివారం లోనే ప్రేక్షకుల్ని దోచుకుంటూ, టీవీ హక్కులు, ఓటీటీ హక్కుల రూపంలో తెగ సంపాదించేస్తున్నారు.

@  భవిష్యత్తు అంతా OTT సినిమాదే… కాబట్టి పెద్ద సినిమాలు అనే కాన్సెప్ట్ అనవసరం. 

ఇక ఎన్టీఆర్  సినిమా రంగం నుండి వచ్చినా, సినిమా వాళ్ళు టికెట్ల అమ్మకం లెక్కలు తక్కువగా చూపించి ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్నారని పసిగట్టి అప్పట్లో శ్లాబ్ సిస్టం ప్రవేశపెట్టారు…చిన్న ఆందోళనలు మినహా ఎవరూ కిక్కురు మనలేదు..కానీ దానికి ఇంకో మార్గం కనిపెట్టి ప్రభుత్వాన్ని మోసం చేసేవారు.

ఈ విధానంలో సీటింగ్ కెపాసిటీ బట్టి డబ్బులు కట్టాలి ప్రభుత్వానికి…దాంతో సినిమా హాలు సీటింగ్ కెపాసిటీ తగ్గించేసి, పండగలప్పుడు, పెద్ద హీరోల సినిమాలప్పుడు అదనంగా మడత పెట్టుకునే ఇనుప కుర్చీలు వేసి వాటి మీద అమ్మకం మొత్తం వాళ్ళే తీసేసుకునేవారు… ఆ అదనపు కుర్చీలు కూడా లేకపోతే చాలామంది టికెట్ తీసుకుని నిలుచునే సినిమా చూసేవారు… మా భీమడోలులో చాలా సినిమాలు నుంచునే చూశా నేను.

తాజా ప్రభుత్వ నిర్ణయం నుండి తప్పించుకోవడానికి సినిమా వాళ్ళు ఖచ్చితంగా మార్గాలను అన్వేషిస్తారు.కోర్టుకు వెళ్ళొచ్చు లేదంటే ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించే దారులు తప్పకుండా వెతకొచ్చు. అలా కాకుండా పెద్ద మనసు చేసుకుని సినిమా నిర్మాణ వ్యయాన్నితగ్గించుకుని పరిశ్రమను బతికించాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!