‘పేరెంట్స్’ను ప్రేమించే వారెందరు ?

Sharing is Caring...

భండారు శ్రీనివాసరావు …………………………………

“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.  “నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం. వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక,తమ పిల్లలు ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీ లేని ప్రేమ కన్నవారిది.

పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్థితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా  పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మాకన్నవాళ్ళు కళ్ళారా చూడ లేకపోయారనే బాధ మాత్రం మిగిలింది” అని. తల్లిదండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.

మన దేశంలో ఈ ఏడాది, 2021 జులైలో వచ్చే ఆఖరి ఆదివారం పేరెంట్స్ డే. అంటే జులై, 25. “ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం. మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి  మనల్ని మనసారా ప్రేమించేది, మనం బాగుండాలని కోరుకునేది  మన  తల్లిదండ్రులు మాత్రమే.

ఇక ఇప్పటి సమాజంలో తల్లిదండ్రులను ప్రేమగా చూస్తున్నవారెందరు ? అని అడిగితే నూటికి నూరు శాతం అని ఖచ్చితంగా జవాబు చెప్పలేం. ఒకప్పటి పరిస్థితులు ఇపుడు లేవు.రోజులు మారాయి. సంపాదన యావలో పడి చాలామంది తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే మాట నిష్టుర సత్యం.

అమ్మానాన్నలు వృద్ధులు కాగానే వారిని ఈసడించుకునే వారు ఎందరో కనిపిస్తుంటారు. వారిని తీసుకెళ్లి  వృద్ధాశ్రమాల్లో ఉంచేవారి సంఖ్య కూడా తక్కువేమి కాదు. అలాగే నిర్దయతో వీధుల్లో వదిలేసే పిల్లలు ఉన్నారు. నిత్యం ఇలాంటి వార్తలు ఎన్నో వింటుంటాం. మరెన్నో సంఘటనలను చూస్తుంటాం. మరణం తర్వాత పున్నామ నరకాన్ని తప్పించేవాడే పుత్రుడు అనే నమ్మకాన్ని తిరగరాసి బతికుండగానే నరకం చూపిస్తున్నారు . ఎవరో కొద్దీ మంది మాత్రమే కష్టమైనా .. నష్టమైనా అమ్మానాన్నలను తమ వద్ద ఉంచుకుని చూస్తుంటారు. వారి బాగోగులు గమనిస్తుంటారు. అలాంటి వాళ్ళే నిజమైన కొడుకులు .. కూతుళ్లు.

పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోనపుడు …తమను తాము కాపాడుకునేందుకు  వృద్ధుల భృతి సంరక్షణా చట్టాలు ఉన్నాయి. కానీ కేసులు వేసి పిల్లలను కోర్టుకు ఈడ్చడానికి పెంచిన ప్రేమ .. పేగు పాశం అడ్డొస్తాయి. ఈ ప్రేమ కారణంగానే పిల్లలు చాలామంది పెట్రేగి పోతున్నారు. పేరెంట్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరికి వారు పేరెంట్స్ పట్ల ప్రేమ పెంచుకుంటేనే గానే ఈ సమస్య సమసి పోదు. ఆ రోజులు వస్తాయని ఆశిద్దాం.  
(పేరెంట్స్ డే – సందర్భంగా ….  ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. అందుకే అలానే ఉంచేశాను)  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!